రేవంత్ ప్రభుత్వం ఒంటి స్తంభం గూడు కాదు, వేయి స్తంభాల మేడ కావాలి...
x
అధికారం వికేంద్రీకరణకు బాటా వేశాడా

రేవంత్ ప్రభుత్వం ఒంటి స్తంభం గూడు కాదు, వేయి స్తంభాల మేడ కావాలి...

జిల్లా ఇన్ చార్జ్ మంత్రుల ఏర్పాటుతో అధికారాల వికేంద్రీకరణకు బాట వేసినట్లయింది. వీళ్లంతా ఉపప్రాంతీయ పిల్ల జమిందారులు కాకుండా ఉండాలి.



ఒంటి స్తంభం గూడు

కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో ఉన్న బిఆర్ ఎస్ ప్రభుత్వానికి కొట్టొచ్చినట్లు తేడాలున్నాయి. బిఆర్ ఎస్ ప్రభుత్వం జమిందారీ ప్రభుత్వం లాగా సాగింది. జమిందారు ఆయన కుటుంబ సభ్యులకు తప్ప ప్రభుత్వంలో ఎవ్వరికీ చోటుండదు, మాటా ఉండదు. ప్రతిచోట జమిందార్ అనే మాట జోడించి మాట్లాడాలి. ప్రధానోపన్యాపసకులు వాళ్లే, ముఖ్యఅతిధులు వాళ్లే, ప్రారంభోత్సవాలు చేసేది వాళ్లే. ఇలా గత పదేళ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కల్వకుంట్ల రామారావు, మేనల్లుడు తన్నీరు హరీష్ రావు, కూతురు కల్వకుంట్ల కవిత. వీళ్లే ముందు వరసలో ఉంటారు. వీళ్ల కే స్వాగతం పలకాలి. మీడియాలో వీళ్ల ఫోటోలే ప్రధానంగా కనిపిస్తాయి. మంత్రులు వీళ్ల చుట్టూర చీర్ లీడర్స్ మాత్రమే. కేవలం కాంగ్రెస్ నేతలను, అపుడపుడు బిజెపి వాళ్లను తిట్టేందుకు పెట్టుకున్న స్పోక్స్ పర్సన్లే. వీళ్లకు అంతకు మించి అధికారామేమీ ఉండదు. పార్టీ పాలసీలు వీళ్లు మాట్లాడరు. పార్టీకి ఒక అధికార ప్రతినిధంటూ లేరు. పొరపాటును ఎవరైనా కీలకమయిన అంశాలమీద స్పందిస్తారేమోనని, వెంటనే కెటిఆర్ ట్విట్టర్ లో స్పందిస్తారు. దాన్నిపార్టీ సోషల్ మీడియా ఆర్మీ చకచకా షేర్ చేస్తుంది. అదే మహా ప్రసాదంగా మీడియా స్వీకరించేది.

మంత్రులు ముఖ్యమంత్రిని కలువలేరు. ఎమ్మెల్యేకు ఆ ప్యాలస్ ఆమడ దూరం. ఎపుడూ అప్పాయంట్ మెంట్ రాదఅనే విమర్శ మొన్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బిజెపి అస్త్రంగా ఉపయోగించుకుని బాగా లబ్ధి పొందాయి. ఓడిపోయాకనే ఏర్రవల్లి ఫామ్ హౌస్ గేట్లు బార్లా తెరుచుకున్నాయి. బిఆర్ ఎస్ ప్రభుత్వం ఒంటి స్తంభపు గూడులాగా పనిచేసింది.

జిల్లా ఇన్ చార్జ్ మంత్రి

రాష్ట్రంలో ఏ నియోకవర్గంలో గాని, ఏ జిల్లాలో గాని మంత్రికిగాని, ఎమ్మెల్యేకి గాని ప్రభుత్వ ప్రతినిధి అనే గుర్తింపు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలను గత ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అనే ఏర్పాటును.కెసిఆర్ ప్రభుత్వం తీసేసింది. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అనే వ్యవస్థలో ప్రతిజిల్లా అభివృద్ధికి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కేంద్రంగా పనిచేస్తాడు.ఏదైనా ఆయనకు విన్నవిస్తే ప్రభుత్వానికి విన్నవించినట్లే లెక్క. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆ జిల్లా ముఖ్య మంత్రి లాంటి వ్యక్తి. జిల్లా పరిషత్ మీటింగ్ లకు ఆయన ప్రభుత్వ పెద్దగా హాజరవుతారు. తనకు చాలా బాధ్యత ను అప్పగించినట్లు ఆ మంత్రి కూడా భావిస్తాడు. బాధ్యతగా ప్రవర్తిస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి మధ్య ఈ ఇన్ చార్జ్ మినిస్టర్ సమన్వయ కర్తగా ఉంటాడు. సాధారణంగా బయటి జిల్లాల మంత్రులనే ఇన్ చార్జ్ జిల్లా మంత్రులుగా నియమిస్తూ ఉంటారు. దీనికి కారణం, బయటినుంచి వచ్చిన మంత్రి కి జిల్లాపట్ల నిష్పాక్షికంగా వ్యవరిస్తాడని. ఈ పద్ధతే చాలా రాష్ట్రాలలో ఉంది. ఆంధ్రలో ఉంది. కర్నాటకలో ఉంది.

అయితే, ఈ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయని సందర్బాలున్నాయి. ఇన్ చార్జ్ మంత్రులు జిల్లాలో పర్యటించడం లేదని, జిల్లా కుచెందిన మరొక మంత్రితో చేతులకలపి ముఠారాజకీయాలకు చేయూత నిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే, వ్యవస్థ పనిచేయకపోతే, పటిష్టం చేయాలి సంస్కరించాలి. అయితే, మొత్తానికి ఎత్తేయడం వాంఛనీయం కాదు. తెలంగాణలో ఒంటి స్థంభం మేడ. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు పవర్ కు సంబంధించి లాంఛన ప్రాయమే.

గత పదేళ్ల కాలంలో మంత్రులకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అనే గౌరవం దక్కకుండా పోయింది. ఫలితంగా పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ నలుగురు కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండరు, వాళ్లని కలుసుకోవడం చాలా కష్టం. వాళ్లు జిల్లాకు రారు, వచ్చినా ఏదో ప్రారంభోత్సవానికో, పండగకో వస్తారు.అపుడు మంది మార్బలంలో ఉంటారు. ఇక ప్రగతి భవన్ కు వెళ్లి నివేదించడం కంటే, అమెరికా అధ్యక్షుడిని కలుసుకోవడం ఈజీ అనే భావం ఉంది. అక్కడ దరిదాపుల్లోకి అప్పాయంట్ మెంట్ లేకుండా రానీయరు. అంతెందుకు, ముఖ్య మంత్రి సలహాదారులుగా నియమించిన ఐఎఎస్ అధికారులు, ఇతర ప్రముఖుల, అప్పాయంట్ మెంటు లెటర్ అందుకున్న రోజు పుష్పగుచ్ఛం ఇచ్చాక ఎన్ని సార్లు ముఖ్యమంత్రిని కలసి సలహా లిచ్చారు. సలహాలు వద్దు, కలసి నమస్కారం పెట్టారు.

ఇలాంటి వ్యవస్థకు ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటి స్థంభం గూడకాదు, వేయి స్థంభాల మేడ అన్న సంకేతం పంపాడు. మంత్రులందరిని ఉమ్మడి జిల్లాల ఇన్ చార్జ్ లుగా నియమించారు. 2014 దాకా పనిచేసినా, చేయకపోయినా, కొనసాగిన వ్యవస్థను పునరద్ధరించాడు. బిఆర్ ఎస్ లో ఆ నలుగరు తప్ప మరొకరికి వాయిస్ లేదు,చాయస్ లేదు. ఇక్కడ అందరికి వాయిస్ వచ్చింది.

బిఆర్ ఎస్ లో లాగా కాకుండా కాంగ్రెస్ లో మల్టిపుల్ లీడర్సిప్ ఉంటుందని సంకేతం ఇచ్చాడు.కాంగ్రెస్ ముఠాల మీద బోలెడు జోక్స్ ఉన్నాయి. రేవంత్ వాటిని ఖాతరు చేసినట్లు లేదు. జిల్లాకొక పేరుమోసిన, పాతుకుపోయిన నాయకుడు ఉన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి, సీతక్క,రాజనరసింహ, కొండా సురేఖ, పొన్నం, ఒకరేమిటి అంతా నాయకులే. ఇలా ప్రోత్సహిస్తే వాళ్లింకా పెద్ద నాయకలవుతారు. వీళ్లలో ఎవ్వరినీ నిర్లక్ష్యం చేయలేని వాతావరణ పార్టీలో ఉంది. ఇలా పార్టీలో పది మంది నాయకులుండటం డెమోక్రసీకి సంకేతం. ఈ ఏర్పాటు ప్రభుత్వం వికేంద్రీకరణకే కాదు, పార్టీ పటిష్టపడేందుకు ఉపయోగపడుతుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీకి ఈ ఏర్పాటు చాలా మద్దతుగా ఉంటుంది.

బిఆర్ ఎస్ పవర్ అనేది కుటుంబ సభ్యులకు తప్పమరొకరికి కలలో కూడా వినిపించని మాట.

ఇన్ చార్జ్ మంత్రుల ఏర్పాటుతో అధికారాల వికేంద్రీకరణ బాట వేసినట్లయింది.ఇది శుభసూచకం. ప్రభుత్వం నియమించిన ఇన్ చార్జ్ మంత్రుల వీళ్లే. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు. 1. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌. 2. ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. 3. రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. 4. వరంగల్‌- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 5. మహబూబ్‌నగర్‌ – దామోదర రాజనర్సింహ. 6. కరీంనగర్‌ – ఎన్‌.ఉత్తమ్‌కుమార్ రెడ్డి. 7. మెదక్‌ – కొండా సురేఖ. 8. నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు. 9. నిజామాబాద్‌- జూపల్లి కృష్ణారావు. 10.ఆదిలాబాద్‌ – సీతక్క.

వీళ్లంతా ఉపప్రాంతీయ పిల్ల జమిందారులు కాకుండా ఉండాలి.

Read More
Next Story