బీజేపీకి 400 సీట్లిస్తే జరగబోయేది ఇదేనా ?
x
Revanth

బీజేపీకి 400 సీట్లిస్తే జరగబోయేది ఇదేనా ?

బీజేపీకి 400 సీట్లిస్తే వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిర్వేషన్లు ఎత్తేస్తారని, ఓటుహక్కును కూడా హరించేస్తారని చెప్పారు


బీజేపీ నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దేశప్రజలకు పిలుపిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ‘ఓట్ చోర్-గద్దీ చోడ్’ పేరుతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఈధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత(Rahul Gandhi) రాహుల్ గాంధీతో పాటు అనేకమంది సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్(Revanth) మాట్లాడుతు రాజ్యాంగాన్ని రద్దుచేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రజలందరిపైనా ఉందన్నారు. ప్రస్తుత సమస్య ఎన్నికలదో లేకపోతే కాంగ్రెస్ పార్టీదో కాదని యావత్ దేశానిది అన్న విషయాన్ని జనాలంతా గుర్తించి రాహుల్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తిచేశారు.

మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినపుడు రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలకు ఓటుహక్కు గురించి చర్చ జరిగినట్లు చెప్పారు. ఈసందర్భంగా ఆర్ఎస్స్ఎస్ సిద్దాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ తదితరులు పై వర్గాల వారికి ఓటుహక్కు అవసరంలేదన్నట్లు వాదించారని రేవంత్ చెప్పారు. అయితే గాంధీ, అంబేద్కర్ మాత్రం పై వర్గాల వారికి ఓటుహక్కు ఉండాల్సిందే అని పట్టుబట్టి ఓటుహక్కు కల్పించినట్లు తెలిపారు. అప్పట్లో గాంధీ, అంబేద్కర్ పట్టుబట్టడంవల్లే ప్రభుత్వాల ఏర్పాట్లలో పైవర్గాలు కూడా భాగస్వాములవుతున్నట్లు రేవంత్ వివరించారు. ప్రస్తుతం గోల్వాల్కర్ భావజాలంతో పనిచేస్తున్న మోదీ, అమిత్ షా బీజేపీకి 400 సీట్లు కావాలని అడుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.

బీజేపీకి పార్లమెంటులో 400 సీట్లు ఇస్తే వెంటనే గోల్వాల్కర్ గతంలో చెప్పినట్లుగా పైవర్గాలకు ఓటుహక్కును హరించేయటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీకి 400సీట్లిస్తే వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిర్వేషన్లు ఎత్తేస్తారని, ఓటుహక్కును కూడా హరించేస్తారని చెప్పారు. ఈ విషయాలను రాహుల్ ప్రజలకు విడమరచి చెప్పటంతోనే పోయిన పార్లమెంటు ఎన్నికల్లో జనాలు బీజేపీని 240 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని అన్నారు.

బీజేపీకి 400సీట్లు ఇవ్వలేదు కాబట్టే రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఓటుహక్కు ఉందన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. అప్పట్లో పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల కోసం గాంధీ, అంబేద్కర్ మద్దతుగా నిలబడినట్లే ఇపుడు ఖర్గే, రాహుల్ నిలబడ్డారని తెలిపారు. ఖర్గే, రాహుల్ కు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలబడినట్లే యావత్ దేశం మద్దతు పలకాల్సిన అవసరాన్ని రేవంత్ నొక్కిచెప్పారు. బీజేపీకి పార్లమెంటులో 400 సీట్లిస్తే ప్రజల హక్కులను కాలరాయటం ఖాయమని రేవంత్ ఆందోళన వ్యక్తంచేశారు.

Read More
Next Story