‘అదే జరిగి ఉంటే రాజ్యాంగం మారిపోయి ఉండేది’
x

‘అదే జరిగి ఉంటే రాజ్యాంగం మారిపోయి ఉండేది’

కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.


కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే తాము చూస్తూ కూర్చోమని అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును రేవంత్ తప్పుబట్టారు. పేదలపై కక్షతో ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. నిబంధనల ముసుగులో ఈ పథకాన్ని పూర్తిగా ఆపేయడానికి ప్రభుత్వం ప్లాన్స్ చేస్తోందని ఆయన విమర్శించారు. దానిని మేము అడ్డుకుని తీరతామని అన్నారు.

‘‘2024 ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయిన బీజేపీ ప్రచారం చేసింది. అదే జరిగి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేసి ఉండేవారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ద్వారా పేదల హక్కులను కాలరాయడానికి చేస్తున్న ప్రయత్నమే. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే కుట్ర. ప్రజలకు కాంగ్రెస్ అప్రమత్తం చేయడం ద్వారానే వాళ్లు 240 స్థానాలకు పరిమితం అయింది. దాంతో రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన అటకెక్కింది. ఇప్పుడు ఓట్లకు తొలగించడం కోసమే ఎస్ఐఆర్‌ను తీసుకొచ్చారు. దీని వెనక భారీ కుట్ర దాగుంది’’ అని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

‘‘అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే మేము ఒప్పుకోం. మెజారీటీ ఉంది కదా.. చట్టసభలను పావులుగా వాడుకుని పేదలను అణచివేద్దాం అంటే సాధ్యం కాదు. ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర చేసే కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా పొందింది’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగానే మున్సిపల్ ఎన్నికలపై కూడా రేవంత్ స్పందించారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు సమాయత్తం అవుతుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత నేతలదేనని తేల్చి చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు.

Read More
Next Story