రేవంత్ తెలుగు సినిమాలు చూడాలి
x
Revanth

రేవంత్ తెలుగు సినిమాలు చూడాలి

చాలా భాషల్లోని సినిమాల్లాగే చాలా తెలుగు సినిమాల్లో కూడా సెక్స్, డ్రగ్స్, మద్యాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కండీషన్ పెట్టారు. రేవంత్ ఈమధ్యలో వస్తున్న తెలుగుసినిమాలను చూస్తున్నట్లు లేరు. చూస్తుంటే ఇలాంటి కండీషన్లు పెట్టేవారు కారేమో. చాలా భాషల్లోని సినిమాల్లాగే చాలా తెలుగు సినిమాల్లో కూడా సెక్స్, డ్రగ్స్, మద్యాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే రేవంత్ పెట్టిన కండీషన్ ఏమిటంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా తెలుగుసినిమా ఇండస్ట్రీ రెండు నిముషాలు నిడివి వుండే వీడియోలను చూపించాలట. ప్రతి సినిమా రిలీజ్ కు ముందు అందులో నటించిన వాళ్ళంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా మాట్లాడాలట. డ్రగ్స్, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా తయారుచేసిన షార్ట్ ఫిల్ములను సినిమాల్లో కచ్చితంగా ప్రదర్శించాలట. షార్ట్ ఫిల్ములను ప్రదర్శించి, డ్రగ్స్, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా ప్రచారంచేసే సినిమాలకే టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని రేవంత్ స్పష్టంచేశారు. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వామి అయిన చిరంజీవిని రేవంత్ అభినందించారు.

తెలుగు సినిమాలకు రేవంత్ ఇలాంటి కండీషన్లు పెట్టడాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే సినిమా అనే మాధ్యమం ప్రజలపై చాలా బలమైన ముద్రవేస్తుందనటంలో సందేహంలేదు. ఎంతోమంది యువత తమ అభిమాన హీరోలను అనుకరించేందుకు పోటీలుపడుతుండటం అందరికీ తెలిసిందే. సినిమాల్లో తమ హీరోలు ఎలాగుంటారో అలాగే బయట తాము నడుచుకోవాలని చాలామంది యువత అనుకోవటం సహజం. కాబట్టి సమాజంలోని మంచి చెడుల గురించి చెప్పటానికి సినిమా అనే మాధ్యమాన్ని ఎంచుకున్నందుకు రేవంత్ ను అభినందించాల్సిందే.

అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే తెలుగు సినిమాల్లో సెక్స్, డ్రగ్స్, మద్యాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్న విషయం రేవంత్ కు తెలిసినట్లు లేదు. తెలుగు సినిమాలు చూసే వాళ్ళందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. యువతను ఆకట్టుకునే ఉద్దేశ్యంతోనే సినిమాల్లో డ్రగ్స్, సెక్స్, మద్యం విచ్చలవిడిగా చూపిస్తున్నారు. డ్రగ్స్, సెక్స్, మద్యం సన్నివేశాలు లేని సినిమాలు చాలా చాలా తక్కువుంటున్నాయి. రేవంత్ ఆందోళన వ్యక్తంచేస్తున్న ఈ మహమ్మారిని తెలుగు సినిమాలు ఏ స్ధాయిలో ప్రమోట్ చేస్తున్నాయో అర్ధమవుతోంది.

ఒకవైపు సినిమాల్లో డ్రగ్స్, సెక్స్, మద్యాన్ని యధేచ్చగా ప్రమోట్ చేస్తు మళ్ళీ అవే సినిమాల్లో వీటికి వ్యతిరేకంగా షార్ట్ వీడియోలు చూపిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా ? జనాల్లోకి చెడు ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదన్న విషయం రేవంత్ కు తెలీదా ? డ్రగ్స్, మద్యం, సెక్స్, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా షార్ట్ వీడియోలను రూపొందించాలని, సినిమాల్లో చూపించాలని రేవంత్ కండీషన్ పెట్టడం మంచిదే. తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. అయితే ఇదే సమయంలో డ్రగ్స్, సెక్స్, మద్యాన్ని ప్రమోట్ చేయవద్దనే కండీషన్ కూడా పెట్టాలి. తప్పదని అనుకంటే ఎంత వీలుంటే అంత తక్కువగా సన్నివేశాలను చూపించాలనే కండీషన్ను అమలు చేయాలని చెప్పాలి. రెండుగంటల సినిమాలో పై మహమ్మారులను విచ్చలవిడిగా చూపించి ఓ పదినిముషాలు వీటికి దూరంగా ఉండండని ఇచ్చే సందేశాన్ని ఎవరూ పట్టించుకోరు.

కాబట్టి తెలుగు సినిమాల ద్వారా డ్రగ్స్, మద్యం, సెక్స్ ను ప్రమోట్ చేయవద్దని రేవంత్ సినిమా వాళ్ళకు గట్టిగా చెప్పాలి. సినిమాలు తీసేవాళ్ళు కూడా సామాజిక బాధ్యతగా ఈ మహమ్మారులకు వీలున్నంత తక్కువగా చూపించాలి. అప్పుడే వీటి ప్రభావం నుండి యువత దూరమవుతారు. లేకపోతే సినిమాల్లో వీటిని యధేచ్చగా చూపిస్తు రెండు నిముషాలు మాత్రం డ్రగ్స్, మద్యం, సెక్స్ కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉండవు.

Read More
Next Story