చంద్రబాబు రిక్వెస్టుకు రేవంత్ నో చెప్పారా ?...ఊహించలేదా ?
x
Chandrabau and Revanth

చంద్రబాబు రిక్వెస్టుకు రేవంత్ నో చెప్పారా ?...ఊహించలేదా ?

కొన్ని భవనాల కోసం చంద్రబాబు చేసిన రిక్వెస్టుకు రేవంత్ నో చెప్పినట్లు సమాచారం.


విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు దాదాపు 2.30 గంటల పాటు చర్చించారు. మొదటి మీటింగ్ కాబట్టి సమస్యలపైన మాత్రమే చర్చించారు. పరిష్కారమార్గాలకు మూడుదశల్లో కమిటీలు వేయాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో మొదటి కమిటి, ఇద్దరు చీఫ్ సెక్రటరీలతో రెండో కమిటి, మంత్రుల స్ధాయిలో మూడో కమిటి నియమించాలని డిసైడ్ అయ్యింది. మూడుదశల్లో పరిష్కారాలు కాని సమస్యలను ఫైనల్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇదంతా మామూలు ప్రక్రియే కాని ఇదే సమయంలో కొన్ని భవనాల కోసం చంద్రబాబు చేసిన రిక్వెస్టుకు రేవంత్ నో చెప్పినట్లు సమాచారం.




ఇంతకీ విషయం ఏమిటంటే విభజన చట్టంలో భాగంగానే హైదరాబాద్ లోని కొన్ని భవనాలను 2014లో ఏపీకి కేటాయించారు. సీఐడీ హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ భవనం, సెక్రటేరియట్ లోని నాలుగు భవనాలు, మంత్రులు, ఎంఎల్ఏల క్వార్టర్స్ లోని కొన్ని భవనాలను ఏపీ వాటాగా వచ్చాయి. అలాగే అసెంబ్లీ, శాసనమండలిలోని కొన్ని భవనాలు, ఖాళీ స్ధలాలు కూడా ఏపీకి దక్కాయి. అయితే హైదరాబాద్ నుండి చంద్రబాబు విజయవాడకు వెళిపోయినపుడు సెక్రటేరియట్ లోని భవనాలు, గెస్ట్ హౌస్, సీఐడీ హెడ్ క్వార్టర్స్, హెర్మిటేజ్ భవనాలను వదిలేసి వెళిపోయారు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయిన తర్వాత కేసీయార్ రిక్వెస్టు ప్రకారం అసెంబ్లీ, శాసనమండలిలోని భవనాలతో పాటు ఖాళీస్ధలాలను కూడా తెలంగాణాకు ఇచ్చేశారు.




అంటే అప్పటి లెక్కల ప్రకారం గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ భవనం, సీఐడీ హెడ్ క్వార్టర్స్ భవనాలతో పాటు వాటి పరిధిలోని ఖాళీస్ధలాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇపుడు సమస్య ఏమిటంటే విభజన చట్టంలోని కామన్ క్యాపిటల్ పదేళ్ళు అయిపోయింది కాబట్టి హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు, ఖాళీస్ధలాలను తెలంగాణా ప్రభుత్వం తీసేసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చెప్పారు. ఈ నేపధ్యంలోనే తాజా సమావేశంలో పైన చెప్పిన భవనాల్లో కొన్నింటిని ఏపీకి శాస్వతంగా అప్పగించాలని చంద్రబాబు రిక్వెస్టు చేశారని సమాచారం. అయితే అందుకు రేవంత్ నో చెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. తెలంగాణా భూభాగంలోని ఏ ఆస్తిని కూడా ఏపీకి ఇచ్చేది లేదని రేవంత్ తెగేసి చెప్పారట. పదేళ్ళ కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఏపీ పరిధిలోని అన్నీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని బదులిచ్చారు.




మరీ తప్పదని అనుకుంటే హైదరాబాద్ లోని ఖాళీస్ధలాలను ఏపీ ప్రభుత్వం కొనుక్కోవచ్చని చంద్రబాబుకు రేవంత్ చెప్పారట. ఢిల్లీలో తెలంగాణా భవన్ కు స్ధలం కొనుక్కున్నట్లే హైదరాబాద్ లో ఏపీకి అవసరమైన స్ధలాన్ని అమ్మటానికి ఇబ్బందిలేదని రేవంత్ స్పష్టంచేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మరీ విషయంలో చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు-రేవంత్ మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని అందరికీ తెలిసిందే. అయిత ఆ సంబంధాలు వ్యక్తిగతం అన్న విషయాన్ని మరచిపోకూడదు. ఇపుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి ఏమి నిర్ణయం తీసుకోవాలన్నా నియమ, నిబంధనలు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోకతప్పదు. ఎక్కడ ఏతేడా వచ్చినా ప్రజలు రెచ్చిపోతారు, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు, అధికారపార్టీలను ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ఇద్దరికీ బాగా తెలుసు.




అందుకనే చర్చలు జరిపి పరిష్కారం కనుక్కునేందుకు చంద్రబాబు, రేవంత్ ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అలా కాదని వ్యవహరిస్తే వెంటనే సెంటిమెంట్లు, ఆందోళనలు, ఉద్యమాలు మొదలైపోతాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే బహుశా భవనాలు కావాలన్న చంద్రబాబు రిక్వెస్టుకు రేవంత్ మొదట్లోనే నో చెప్పినట్లు అర్ధమవుతోంది. మరి తెలంగాణా డిమాండ్ చేస్తున్న ఏపీ పరిధిలోని ఏడు మండలాలు, ముఖ్యంగా భద్రాచలం ఆలయం అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చే విషయమై చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణాలోని ఏడు మండలాలు చింతూరు, వీఆర్ పురం, బూర్గంపాడు, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం(గ్రామపంచాయితి మినహా)ను తిరిగి తమకిచ్చేయాలని తెలంగాణా ప్రభుత్వం అడిగింది.




అలాగే భద్రాచలం టెంపుల్ చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను కూడా తిరిగిచ్చేయాలని తెలంగాణా ప్రభుత్వం అడుగుతోంది. ఎందుకంటే భద్రాచలం ఆలయం ఉన్న గ్రామపంచాయితీ మాత్రమే తెలంగాణా పరిధిలో ఉంది. ఆలయం చుట్టూ ఉన్న గ్రామాలు ఏపీలో కలిసిపోయాయి. దీనివల్ల ఆలయం అభివృద్ధి తెలంగాణా ప్రభుత్వానికి సాద్యంకావటంలేదు. అందుకనే ఏడుమండలాలతో పాటు ఐదు గ్రామాలను కూడా తిరిగి తెలంగాణాకు ఇచ్చేయాలని ప్రభుత్వం అడుగుతోంది. నిజానికి ఐదు గ్రామాల సంగతిని పక్కనపెట్టేస్తే ఏడు మండలాలను తెలంగాణాకు తిరిగి ఇవ్వటం సాధ్యంకాదు. మరి చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Read More
Next Story