
‘మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు’..!
ఏమీ తక్కువ కాకుండా మేడారం జాతర జరగాలన్న సీఎం రేవంత్.
కుంభమేళా స్థాయిలో జరిగే మేడారం జాతరకు జాతీయ పండగ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా మేడారం జాతర నిర్వహణకు కేంద్రం నిధులు ఇవ్వాలని కూడా కోరారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో కోట్ల మంది భక్తులు పాల్గొంటారని, వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారని గుర్తించారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి వనదేవతలను దర్శించుకుంటారని అన్నారు. ఇంతటి స్థాయిలో జరిగే మేడారం జాతరకు జాతీయ పండగ గుర్తింపు ఇవ్వాలని పునరుద్ఘాటించారు. మంగళవారం మేడారంలో పర్యటించిన ఆయన ఆలయ అభివృద్ధి, జాతర నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో సమ్మక్క, సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ ప్రణాళిక నమూనాను ఆవిష్కరించారు. “సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునర్నిర్మాణం చేపట్టే అవకాశం దక్కడంతో నా జన్మ ధన్యమైంది. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటున్నా. గతంలో పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష ప్రదర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ ఆనాటి పాలకులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. వారేదో దాన, ధర్మమిచ్చినట్టుగా తాత్కాలిక పనులతో సరిపెట్టారు. నేను ఇక్కడి నుంచే పాదయాత్ర బయలుదేరా’’ అని గుర్తు చేశారు.
‘‘ఆదివాసీలే ఈ దేశానికి మూల వాసులు. దొరల పాలనను అంతం చేసి ప్రజా పాలనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రణాళిక అందించింది. బడుగు బలహీన వర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినప్పుడు సరిపోవని ఆదివాసీ, గిరిజన ప్రాంత వాసులు చెప్పినప్పుడు ఐటీడీఏ ప్రాంతాల్లో వారికి అదనంగా ఇండ్లు ఇచ్చాం. ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా ఆదివాసీలకు ఇవ్వాల్సిన వాటా, కోటా ఇవ్వాల్సిందే. దశాబ్దాలుగా వారికి అన్యాయం జరిగింది. వాటన్నింటినీ సరిదిద్దాలని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’’ అని వెల్లడించారు.
‘‘గద్దెలు, ప్రాంగణ అభివృద్ధి నిర్మాణం జీవితంలో వచ్చిన గొప్ప, అరుదైన అవకాశం. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో జన్మ ధన్యమైంది. వాటి నిర్మాణంలో నిధుల సమస్య ఉండదు. ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నాం. సిమెంట్ కన్నా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడితే వేల ఏండ్లు ఉంటుంది. గొప్ప నగిశీలు, రాతి కట్టడాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని ప్రణాళికలు వేశాం’’ అని తెలిపారు.
‘‘ఈ గొప్ప కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఆదివాసీ సోదరుల కోరిక మేరకు ఈ ప్రణాళిక తీసుకొచ్చాం. వచ్చే జాతర నాటికి కార్యక్రమాలు పూర్తి కావాలంటే రాత్రింబవళ్లు ఇక్కడ పనులు జరగాలి. ఆలయ అభివృద్ధితో పాటు జంపన్న వాగు నిర్మాణం, రహదారుల నిర్మాణాలపైన కూడా సలహాలు, సూచనలు తీసుకుంటాం.రాబోయే వంద రోజులు ప్రతి వారం జిల్లా ఇంచార్జీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి. నిష్టతో స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తీరుగా సమ్మక్క సారలమ్మ మాల ధరించిన రీతిలో పనులను పర్యవేక్షించాలి. పనులు పూర్తయిన తర్వాత మళ్లీ ఇక్కడ పర్యటిస్తా’’ అని స్పష్టం చేశారు.
‘‘మేడారం జాతరను ఈసారి అత్యంత అద్భుతంగా చేసుకుందాం. ఈ ఆదివాసీ కుంభమేళాను జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతున్నాం. కుంభమేళాకు వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు కూడా నిధులను మంజూరు చేయాలి. అందరం కలిసి ఒక మంచి సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కష్టపడి పనిచేద్దాం..” అని పిలుపునిచ్చారు.