మల్కాజ్ గిరిలోకి దిగిన  రేవంత్ స్పెషల్ టీమ్ లు
x
Revanth Team

మల్కాజ్ గిరిలోకి దిగిన రేవంత్ స్పెషల్ టీమ్ లు

లోక్‌సభ ఎన్నికల వేళ అత్యధిక సీట్లను ‘హస్త’గతం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి వినూత్న వ్యూహాలు రూపొందించారు. ఎన్నికల్లో విజయం కోసం తన టీంలను రంగంలోకి దించారు.


అది హబ్బిగూడలోని ఓ హోటల్...ఈ హోటల్‌కు రెండు ఇన్నోవా కార్లలో రయ్ మంటూ ఏడుగురు యువకులు ఖద్దరు దుస్తుల్లో వచ్చి, కారు దిగి టీ తాగుతూ స్థానికులతో మాట కలిపి, పార్లమెంట్ ఎన్నికల గురించి ఆరా తీశారు. వీరెవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం ఎ రేవంత్ రెడ్డి టీం సభ్యులు...పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం సిట్టింగ్ ఎంపీ స్థానమైన మల్కాజిగిరి పరిధిలో రేవంత్ టీం సభ్యులు తిరుగుతూ కాగ్రెస్ విజయం కోసం వినూత్న వ్యూహాలతో ప్రచార సంరంభానికి తెర లేపారు.

తన సిట్టింగ్ పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలో ఎలాగైనా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో వినూత్న వ్యూహాలు రూపొందించారు. తన అనుచర గణంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రచార బరిలోకి దించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పది చొప్పున రేవంత్ టీం సభ్యులను నియమించి, వారిని కార్యరంగంలోకి దించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 70 బృందాలను నియమించి వారి ఆధ్వర్యంలో విజయం కోసం కాంగ్రెస్ వ్యూహాలు రూపొందిస్తోంది. తమ రేవంత్ టీం పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ టీం సభ్యుడు ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మైనారిటీ ఓట్లపై ఆశలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లింలు, క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు ‘హస్తం’ వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గ్యారంటీల గురించి ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా వారి ఓట్లను గంపగుత్తగా పొందాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మైనారిటీలతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ టీం సభ్యులు సమాయత్తం అవుతున్నారు. రమజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పలు ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు సైతం ఏర్పాటు చేస్తూ ముస్లిం మైనారిటీలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
ముస్లింలు నివాసమున్న ప్రాంతాల్లో రేవంత్ టీం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్లు, రెడ్డి ఓటర్లు మొత్తం 3,17,668 మంది ఉన్నారు. ఈ మూడు వర్గాల ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించారని సమాచారం. ఇందులో భాగంగా రేవంత్ టీం కార్యక్షేత్రంలోకి దిగి ప్రచార వ్యూహాలను అమలు చేస్తోంది.



సెటిలర్ల ఓట్లవేటకు రేవంత్ టీం యత్నాలు

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కూకట్ పల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్ బీ నగర్, కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు సెటిలర్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో సెటిలర్ల ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడేలా రేవంత్ టీం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ వారీగా సెటిలర్లతో ప్రత్యేకంగా ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇవ్వడం ద్వారా వారి ఓట్లను పొందాలని సీఎం తన టీంకు దిశ నిర్దేశం చేశారు.

ఓటర్లు మా వైపే ఉన్నారు : సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా, వారి పార్టీ కేడరులో ఎక్కువ మంది కార్యకర్తలు తమ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, ఉప్పల్ కాంగ్రెస్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ నాయకుడు రేవంత్ గేట్లు తెరవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కార్యకర్తలు జాతరలాగా వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల అమలు గురించి ప్రజల్లో ప్రచారం చేసి మైనారిటీ, సెటిలర్స్ ఓట్లను పొందడం ద్వారా తాము పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తామని మందుముల పరమేశ్వరరెడ్డి చెప్పారు. ‘‘ మా పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలతో మల్కాజిగిరి ఓటర్లు మా వైపే ఉన్నారు, దీనివల్ల మా పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తాం’’ అని పరమేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై రేవంత్ ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ఎ రేవంత్ రెడ్డి తెలంగాణలో అధిక పార్లమెంటుస్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు సీఎం ఇన్ చార్జీగా ఉంటూనే తన సిట్టింగ్ ఎంపీ స్థానమైన మల్కాజిగిరిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలోని 17 స్థానాల్లో కనీసం 14 సీట్లను హస్తగతం చేసుకునేలా రేవంత్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను రూపొందించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో 50 వేల ఓట్ల మెజారిటీ లక్ష్యంగా సీఎం తన టీంకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

మూడంచెల సమన్యయ కమిటీలు
తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, బూత్‌ స్థాయిల్లో మూడంచెల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సాధించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ గ్యారంటీల అమలు గురించి ప్రచారం చేసి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ఈ సమన్వయ కమిటీలను నియమించారు. సమన్వయ కమిటీల్లో ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులను నియమించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసే వారికి ఎన్నికల అనంతరం ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం ప్రకటించారు.

ఇందిరమ్మ కమిటీలు
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో గ్రామ, వార్డు స్థాయిల్లో ఇందిరమ్మ కమిటీలను నియమించాలని నిర్ణయించింది. గ్రామాలు, మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో బాగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును ఈ ఇందిరమ్మ కమిటీలు పర్యవేక్షించనున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని రేవంత్ టీం సభ్యుడొకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఇందిరమ్మ కమిటీలు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానించనున్నట్లు కాంగ్రెస్ పార్టీవర్గాలు వెల్లడించాయి.

రోజుకో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపిస్తున్న రేవంత్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి రోజుకో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు రోజుకొకరు కాంగ్రెస్ గూటిలో చేరుతున్నారు.గతంలో పలువురు బీఆర్ఎస్ నేతలు హస్తం గూటిలో చేరారు. తాజాగా కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇలా రోజుకొక నేత చేరుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో నిస్తేజం అలముకుందని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.


Read More
Next Story