
కాంగ్రెస్ ఓడితే ఏమవుతుందో నేరుగా చెప్పేసిన రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమపథకాలు అందుకుంటు బీఆర్ఎస్ ను గెలిపించిన జనాలకు సంక్షేమపథకాలు ఎందుకు అందివ్వాలని డైరెక్టుగానే అడిగాడు
ముసుగులో గుద్దులాట లేదు..మొహమాటం కూడా లేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు కాకుండా జనాలు బీఆర్ఎస్(BRS)ను గెలిపిస్తే ఏమవుతుందో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) సూటిగా చెప్పేశాడు. శుక్రవారం రాత్రి నియోజకవర్గంలో రోడ్డుషో జరిగింది. ఆసమయంలలో ప్రజలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం రద్దవుతుందన్నాడు. పేదోళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా బంద్ అవుతుందన్నాడు. 25వేలమందికి ఇచ్చిన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కూడా రద్దవుతుందని చెప్పేశాడు. అంటే రేవంత్ చెప్పింది ఎలాగుందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తరచూ చెప్పే సామెతలాగుంది.
కేసీఆర్ ఏమి చెప్పేవారంటే ఎద్దుకు మేతేసి బర్రెను పాలిమ్మంటే ఇస్తదా ? అని అడిగేవారు. అలాగే ఇపుడు రేవంత్ సామెత చెప్పకుండా డైరెక్టుగా జరగబోయేది చెప్పేశారు. అదేమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమపథకాలు అందుకుంటు బీఆర్ఎస్ ను గెలిపించిన జనాలకు సంక్షేమపథకాలు ఎందుకు అందివ్వాలని డైరెక్టుగానే అడిగాడు. రేవంత్ మాటలో లాజిక్ ఉందికాని ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నంత మాత్రాన జనాలంతా అధికారపార్టీకి మాత్రమే ఓట్లేయాలని అనటం తప్పు. ప్రజాస్వామ్యం అంటేనే జనాలు తమిష్టం వచ్చినవాళ్ళకు ఓట్లేయటం కదా. ఎక్కువమంది ఓటర్లు ఎవరికైతే ఓట్లేస్తారో సదరు అభ్యర్ధి గెలవటమే ప్రజాస్వామ్యం.
ప్రభుత్వం సంక్షేమపథకాలు అందిస్తోంది కాబట్టి కచ్చితంగా అధికారపార్టీకే ఓట్లేసి గెలిపించాలని రేవంత్ అనటం ముమ్మాటికి తప్పే. ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నది సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయటానికే. 2023 ఎన్నికల్లో గెలుపుకోసం రేవంత్ ఇచ్చిన హామీలను జనాలు ఎవరూ అడగలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కావాలని బీసీలు అడగలేదు. ఉచిత బస్సు ప్రయాణం కావాలని, 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ ఇవ్వమని ఎవరు రేవంత్ ను అడగలేదు. కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలకు ఉచిత స్కూటి ఇవ్వమని, మహిళలకు తులం బంగారం కావాలని, మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ కావాలని ఎవరడిగారు రేవంత్ ను?
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, తాను ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే రేవంత్ ఆచరణసాధ్యంకాని హామీలను అనేకం ఇచ్చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడు హామీలిచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుచేయలేక ఇపుడు నానా అవస్తలు పడుతున్నాడు. ఈనేపధ్యంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జనాలను రేవంత్ బెదిరించినట్లుగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ కు ఓట్లేస్తే సంక్షేమపథకాలన్నీ ఎందుకు ఆగిపోతాయి ? ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిచినంతమాత్రాన అధికారంలోకి వచ్చేయదు కదా. అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి పార్టీ గెలిచినా, ఓడినా సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయాల్సిన బాధ్యత రేవంత్ పైన ఉంటుందనటంలో సందేహంలేదు. ఏదేమైనా కాంగ్రెస్ ను గెలిపించకపోతే జరగబోయే వ్యవహారాన్ని జనాలకు సూటిగా చెప్పిన రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

