
టీజీపీఎస్సీ కేసులో రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేసుకోవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద రిలీఫ్ దొరికింది. టీజీపీఎస్సీ ఫలితాల విడుదలపై హైకోర్టు(Telangana High Court) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును బుధవారం డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి భారీఊరట లభించినట్లయ్యింది. గ్రూప్ 1 అభ్యర్ధుల విషయంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేసుకోవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది. అయితే నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉండాలని టీజీపీఎస్సీ(TGPSC) బోర్డుకు షరతు విధించింది.
గ్రూప్-1 మెయిన్స్ ర్యాకింగ్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ర్యాంకులు రాని కొందరు అభ్యర్ధులు హైకోర్టు సింగిల్ బెంచ్ లో కేసు దాఖలు చేశారు. పిటీషనర్లతో పాటు ప్రభుత్వ వాదన విన్న సింగిల్ బెంచ్ ర్యాంకులను రద్దుచేస్తు ఈనెల 9వ తేదీన తీర్పుచెప్పింది. ర్యాంకులురాని కొందరు మొత్తంనియామకాలనే నిలిపేయాలన్న దుర్భుద్దితో కేసులు దాఖలు చేశారన్న ప్రభుత్వ వాదనను సింగిల్ బెంచ్ పట్టించుకోలేదు. ఫలితాలకు సంబంధించి అభ్యర్ధులు రాసిన జవాబుపత్రాల రీవాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరకపోతే పరీక్షలను తిరిగి నిర్వహించాలని సింగిల్ బెంచ్ స్పష్టంగా చెప్పింది. ఇందుకు బోర్డుకు 8 మాసాల గడువును కూడా విధించింది. సింగిల్ బెంచ్ తీర్పుతో షాక్ తిన్న ప్రభుత్వంతో పాటు ర్యాంకులుసాధించి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధుల్లో కొందరు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాలు చేశారు.
ఈకేసును డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వకేట్ జనరల్(ఏజీ) వాదించారు. 14ఏళ్ళ తర్వాత గ్రూప్ 1 పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయాన్ని ఏజీ గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించిందన్నారు. గ్రూప్ 1 నిర్వహణ నిబంధనల్లో రీవాల్యుయేషన్ అన్నది లేదని, కేవలం రీ కౌంటింగ్ మాత్రమే ఉందని గుర్తుచేశారు. కాబట్టి సింగిల్ బెంచ్ తీర్పు సహేతుకం కాదని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న డివిజన్ బెంచ్ చివరకు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. తర్వాత విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదావేసింది.
విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్ కొన్ని సందేహాలను వ్యక్తంచేసింది. టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించటం తగదని అభిప్రాయపడింది. ఇంటిగ్రిటి అన్నది చాలా సున్నితమైన పదమని పేర్కన్నది. మాల్ ప్రాక్టీస్ లేదా పేపర్ లీక్ లాంటివి ఏమైనా జరిగాయా అన్న సందేహాన్ని వ్యక్తంచేసింది. డివిజన్ బెంచ్ సందేహానికి పిటీషనర్లు సమాధానం చెప్పలేదు. ఫలితాల ప్రకటనలో బోర్డు ఎవరికైనా ఫేవర్ చేసిందా అన్న డివిజన్ బెంచ్ ప్రశ్నకు కూడా పిటీషనర్లు సమాధానం చెప్పలేదు. ఎవరికైనా ఫేవర్ చేసినట్లు ఆధారాలున్నాయా అన్న ప్రశ్నకు పిటీషనర్ల దగ్గర సమాధానం లేదు. తీర్పుఇచ్చేటపుడు సింగిల్ బెంచ్ ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది.
అసలు ఏమి జరిగింది ?
గ్రూప్-1 పరీక్షల ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తు ర్యాంకులు రాని అభ్యర్ధుల్లో కొందరు కోర్టులో కేసు వేశారు. వీళ్ళఅభ్యంతరం ఏమిటంటే జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని. అభ్యంతరాలతో కేసు దాఖలుచేసిన పిటీషనర్లు ఆధారాలను మాత్రం చూపించలేదు. పిటీషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన సింగిల్ బెంచ్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ చేయకపోతే మొత్తం పరీక్షలను రద్దుచేస్తామని చెప్పింది. దాంతో సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది. టీజీపీఎస్సీకి మద్దతుగా ర్యాంకులు సాధించిన వాళ్ళలో కొందరు కేసులు దాఖలుచేశారు. ఎవరో తప్పుచేస్తే ర్యాంకులు సాధించిన తమందరినీ శిక్షించటం సబబుకాదని ర్యాంకర్లు కోర్టుకు చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది.