రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవేనా ?
x

రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవేనా ?

కేంద్రప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ పథకంలో వర్తింపచేస్తున్న మార్గదర్శకాలనే అనుసరిస్తే సరిపోతుందని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది.


రైతు రుణమాఫీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమ, నిబంధనలు దాదాపు ఫైనల్ చేసినట్లే ఉంది. కేంద్రప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ పథకంలో వర్తింపచేస్తున్న మార్గదర్శకాలనే అనుసరిస్తే సరిపోతుందని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. తొందరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోబోతున్నది ప్రభుత్వం.

అయితే కిసాన్ సమ్మాన్ పథకం అమలుకు కేంద్రం అనుసరిస్తున్న మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు స్టడీచేసి రేవంత్ కు నోట్ పెట్టినట్లు సమాచారం. కేంద్రం అనుసరిస్తున్న మార్గదర్శాలను అనుసరిస్తే రైతు రుణమాఫీ అమలుకు రాష్ట్రప్రభుత్వంపై చాలావరకు భారం తగ్గిపోతుందన్న విషయంలో క్లారిటి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీల్లో రైతు రుణమాఫీ అత్యంత కీలకమైనదే కాకుండా చాలా ఖరీదైనది కూడా. ఎలాగంటే ఈ పథకం అమలుకు సుమారు రు. 40 వేల కోట్లు అవసరమవుతుందని అప్పట్లో అంచనా. లోటు బడ్జెట్లో, అప్పుల్లో ఉన్న ఖజనాతో రుణమాఫీని అమలుచేయటం సాధ్యంకాదని రేవంత్ కు అర్ధమైపోయింది.

అందుకనే అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే అమలుచేస్తామని చెప్పిన సిక్స్ గ్యారెంటీస్ లో రుణమాఫీ అమలుకు ఆగష్టు 15వ తేదీని గడువుగా రేవంత్ పొడిగించుకున్నారు. ఇపుడా గడువు కూడా దగ్గరకు వచ్చేస్తోంది. అందుకనే ఉన్నతాధికారులతో రేవంత్ సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ పథకం మార్గదర్శకాల అమలు విషయం చర్చల్లోకి వచ్చింది. ఈ పథకం అమలును క్షుణ్ణంగా అధ్యయనంచేసిన ఉన్నతాధికారులకు దీన్నే అమలుచేస్తే రుణమాఫీ హామీని అమలుచేయటంలో ప్రభుత్వంపై చాలాభారం తగ్గిపోతుందని వివరించారు. ఈ పథకం ప్రకారం రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వంపై సుమారు 15 వేల కోట్ల భారం తగ్గిపోతుందని తేలింది. అంటే రుణమాఫీ అమలుకు ప్రభుత్వానికి అవసరమైన మొత్తం సుమారు రు. 25 వేల కోట్లని తెక్కతేలింది.

ఇంతకీ ఇంతపెద్దమొత్తంలో భారం ఎలా తగ్గింది ? ఎలాగంటే కిసాన్ సమ్మాన్ మార్గదర్శకాలను యథాతధంగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దాని ప్రకారం తెలంగాణాలో 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అలాగే మరో 1.5 లక్షల మంది పెన్షనర్లున్నారు. మరో లక్షన్నరమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులున్నారు. అంటే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే సుమారు 6 లక్షలదాకా ఉంటారు. వీళ్ళు కాకుండా ఎంఎల్ఏలు 119 మంది ఎంపీలు 17, రాజ్యసభ ఎంపీలు ఏడుగురు, 40 మంది ఎంఎల్సీలు, 33 మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు, 13 మంది మున్సిపల్ మేయర్లు, వీరు కాకుండా మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్సీలు ఉండనే ఉన్నారు. వీరు కాకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు సుమారు 25 లక్షలుంటారు. వీరు కాకుండా వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు మరో 5 లక్షలుంటారని అంచనా. ఇలాంటి వారినందరినీ కిసాన్ సమ్మాన్ పథకంలో కేంద్రం లబ్దిదారులుగా తీసేసింది. అచ్చంగా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులను మాత్రమే కిసాన్ సమ్మాన్ పథకంలో లబ్దిదారులను చేయాలన్నది కేంద్రం ఆలోచన.

ఇలాంటి వాళ్ళ ఆదాయపు పన్ను రిటర్నులు పరిశీలిస్తే వీళ్ళ ఆదాయాలు, అప్పుల లెక్కలు బయటకు వస్తాయి. వీళ్ళల్లో ఎంతమందికి వ్యవసాయభూములున్నాయి, ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారు ? ఎంతమందికి పథకంలో రుణమాఫీ అర్హత ఉందనే విషయాలను రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రంలో పంటరుణాలు తీసుకున్న వారిసంఖ్య 47 లక్షలు. పంటరుణాలు తీసుకునేటపుడు వీళ్ళు బ్యాంకులకు అందించిన డాక్యుమెంట్లను పరిశీలించి, ఆదార్ కార్డులను, మోబైల్ నెంబర్లు, ప్యాన్ కార్డుల సీడింగ్ చేస్తే చాలా క్లారిటి వస్తుంది. ఇవన్నీ జరిగితే నిజమైన లబ్దిదారుల సంఖ్య చాలావరకు తగ్గిపోతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ధరణి పోర్టల్ ప్రకారం పట్టదారుపాస్ పుస్తకాలున్న వారి సంఖ్య 70 లక్షలు. అయితే ఇందులో కిసాన్ సమ్మాన్ పథకంలో లబ్దిపొందుతున్న రైతులు 33 లక్షలమంది మాత్రమే. దీని ఆధారంగా రుణమాఫీకి కిసాన్ సమ్మాన్ పథకం మార్గదర్శకాలను అనుసంధానిస్తే రుణమాఫీ అర్హుల సంఖ్య భారీగా తగ్గటంతో పాటు ప్రభుత్వంపై ఆర్ధికభారం కూడా తగ్గుతుందని సమాచారం.

Read More
Next Story