ఇండియన్ ఆర్మీకి హైదరాబాద్ సాలిడారిటీ
x

ఇండియన్ ఆర్మీకి హైదరాబాద్ సాలిడారిటీ

నెక్లెస్ రోడ్డులో మే 8 సాయంకాలం సాలిడారిటీ ర్యాలీ


పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన సమాధానం ప్రపంచమంతా వినిపించింది. భారత వాయుసేన చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ ఎయిర్ స్ట్రైక్స్‌కు ప్రతి భారతీయుడు సెల్యూట్ చేస్తున్నాడు. ఈ విషయంలో భారత సైన్యం చూపిన తెగువకు ప్రతి ఒక్కరూ జేజేలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపంచిన భారత బలగాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే ఈ దాడుల విషయంలో తెలంగాణ ప్రజలంతా భారత ఆర్మీ, నేవీ, వాయుసేనకు మద్దతుగా నిలుస్తున్నారని చాటిచెప్పాలని రేవంత్ ప్రభుత్వం భావించింది.

అందుకోసమే మే 8న సాయంత్రం 6గంటలకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిశ్చయించింది. ఈ సాలిడారిటీ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ ర్యాలీ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మొదలై సెక్లెస్ రోడ్ వరకు జరుగుతుంది. ఈ ర్యాలీలో ప్రజలకు కూడా భాగస్వాములు కావొచ్చు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రక్షణ, పోలీస్, విపత్తుల నిర్వహణ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో భాగంగానే హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న పాకిస్థానీయులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఏ ఒక్కరినీ వదలకుండా అరెస్ట్‌లు చేయాలని చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని, ఇందులో రాజకీయాలు, రాజకీయ పార్టీలు అన్న ప్రస్తావన కూడా రాకూడదన్నారు రేవంత్.

అయితే పహల్గామ్ దాడి తర్వాత పాక్‌పై చర్యలు తీసుకోవడం అనే విషయంలో తొలుత నుంచి కూడా రేవంత్ రెడ్డి.. కేంద్రానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇప్పుడు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు పూర్తి మద్దతు పలికారు. పాక్‌కు ధీటైన బుద్ది చెప్పారంటూ భద్రతా బలగాలపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఈ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కొనేలా ఉండాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కీలక శాఖల్లో పనిచేస్తున్న వారి సెలవులను రద్దు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న విదేశీ కార్యదర్శుల కార్యాలయాల దగ్గర భద్రతను పటిష్టం చేయించారు. విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.

ఆపరేషన్ సిందూర్‌కు ప్రపంచ మద్దతు

పాకిస్థాన్, పీఓకే ప్రాంతంలోని ఉగ్రక్యాంపులపై భారత భద్రతా బలగాలు చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ దాడుల క్రమంలో భారత్‌కు ఇజ్రాయల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు భారత్‌కు ఇండియా అంబాసిడర్ ఎక్స్‌వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘భారత్‌కు ఉన్న ఆత్మరక్షణ హక్కుకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఇస్తుంది. అమాయకులపై దాడులు చేసే వాళ్లు దాక్కోవడానికి ఎక్కడా ప్లేస్ లేదని ఉగ్రవాదులకు తెలియజేయాలి’’ అని రువెన్ అజార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వీరితో పాటు రష్యా, జర్మనీ కూడా తమ సంఘీభావం తెలిపాయి.

Read More
Next Story