
‘విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు..’
విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? మీ 17 నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లకు తాళాలు పడ్డాయని చురకలంటించారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని మండిపడ్డారు. డిగ్రీ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వకుండా వారిని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించరా? కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడింది. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం. సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీసెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగాని తనమే’’ అని చురకలంటించారు.
‘‘మరోవైపు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దివంగత సీఎం వైఎస్ గారు ప్రారంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కెసిఆర్ గారు అమలు చేశారు. గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా, ఏనాడు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదు’’ అని గుర్తు చేశారు.
‘‘ప్రతి ఏటా సగటున రెండు వేల కోట్లు, తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో మొత్తం 19,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసాము. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నది. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారు. దానికి అతి గతి లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, పథకాన్ని మరుగున పడేలా చేశారు’’ అని విమర్శించారు.
‘‘పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయి. రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయి. మాటమీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి. 'విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత' అంటూ స్పీచులు దంచే సీఎం గారు ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు?’’ అని ప్రశ్నించారు.
‘‘విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? మీ 17 నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లకు తాళాలు పడ్డాయి. డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయి. మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఇక గురుకులాలది దీన గాథ. ఏడాదిన్నర పాలనలో విద్యావ్యవస్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్కు మార్పు ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.