వైఎస్సార్  స్టైలే వేరు
x
YSR and Revanth

వైఎస్సార్ స్టైలే వేరు

వైఎస్సార్ ముందు చంద్రబాబునాయుడు, తర్వాత ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీయార్, కొడుకు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ స్టైల్ రాలేదు.


రాజకీయాల్లో వైఎస్సార్ స్టైలే వేరు. వైఎస్సార్ ముందు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు, తర్వాత ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, కొడుకు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ స్టైల్ రాలేదు. వైఎస్సార్ లోని గొప్ప గుణం ఏమిటంటే టైమ్ ను బ్యాలెన్స్ చేసుకోవటమే. ఒకవైపు ప్రభుత్వ వ్యవహారాలు, మరోవైపు పార్టీ వ్యవహారాలను బ్యాలెన్స్ చేసుకోవటమే దివంగత ముఖ్యమంత్రికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యమంత్రిగా ఐదేళ్ళలో ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా సమస్యలు చెప్పుకోవటానికి వచ్చే మామూలు ప్రజలను కలిసేవారు. ఒకవైపు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీలోని సీరియర్ నేతలు, క్యాడర్ను కూడా కలిసేవారు. ఇవన్నీ ఒకఎత్తయితే ప్రతి రోజు రాత్రి 9 గంటల నుండి గంటసేపు కుటుంబసభ్యులకు కూడా కేటాయించేవారు.

అందరికీ ఉన్నట్లు వైఎస్సార్ కు ఉన్నది కూడా 24 గంటలే అయినా మామూలు జనాలు, సమీక్షల్లో ఉన్నతాధికారులను, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో పాటు కుటుంబసభ్యులకు కూడా సమయాన్ని కేటాయించేవారని పార్టీ నేతలు చెప్పుకునేవారు. వైఎస్సార్ పాలనలో హ్యూమన్ టచ్ అన్నది చాలా కీలకమైంది. అందుకనే చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా జనాలు వైఎస్సార్ గురించి ఇంతగా చెప్పుకుంటున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉనప్పటికీ ప్రతిరోజు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో పాటు క్యాడర్ను కూడా కలవాలని డిసైడ్ అయ్యారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రతిరోజు పార్టీకి కొంతసమయాన్ని కేటాయించబోతున్నట్లు ఆమద్య రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రతిరోజు ఏదో సమస్యమీద మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడాలని అనుకోవటం సహజం. అయితే ఆ అవకాశం రాకపోతే వాళ్ళల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. సీఎం తరపున ఎవరితో సమస్యలను చెప్పుకోవాలంటే చాలామంది ఇష్టపడరు. సమస్య పరిష్కారమైనా కాకపోయినా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే తృప్తిగా ఫీలవుతారు. అలాకాదంటే సమస్య పరిష్కారం కాకపోవటం అటుంచితే అసలు ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం దొరక్కపోవటంతో చాలామందిలో అసంతృప్తి పెరిగిపోయి ఆగ్రహంగా మారుతుంది. అప్పుడే సీఎంకు మంత్రులు, ఎంఎల్ఏలు వ్యతిరేకమవుతారు.

తనకన్నా ముందు ముఖ్యమంత్రులు అయిన చంద్రబాబు, కేసీయార్, జగన్ ఎక్కడ ఫైయిలయ్యారో రేవంత్ గ్రహించినట్లున్నారు. అందుకనే తాను వాళ్ళలా కాకుండా ప్రతిరోజు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా సమయాన్ని కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఈ ఆలోచనను రేవంత్ సమర్ధవంతంగా అమల్లోకి తెస్తే పార్టీకి అంతకన్నా కావాల్సిందేముంటుంది. ముఖ్యమంత్రులైన పై నేతలకు పార్టీతో గ్యాప్ వచ్చేసిన ఫలితంగానే ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని రేవంత్ అర్ధంచేసుకన్నట్లున్నారు. కాబట్టి పై నేతల మార్గంలో కాకుండా దివంగత ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడవాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాగానే తనింట్లోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను కలుస్తారా ? సచివాలయంలోనే భేటీ అవుతారా ? లేకపోతే ప్రతిరోజు గాంధీభవన్ కు వెళతారా అన్నది సస్పెన్స్.

చంద్రబాబు ఏమిచేశారు ?

1995లో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినపుడు బాగానే ఉండేవారు. 1999లో రెండోసారి సీఎం అవగానే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలను కలవటం మానేశారు. చంద్రబాబును కలవటానికి మంత్రులు కూడా వారాల తరబడి వెయిట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చంద్రబాబు వ్యవహార శైలితో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం వ్యతిరేకమైపోయారు. 24 గంటలూ అధికారులు, అధికారులతోనే చంద్రబాబు సమయాన్ని గడిపేవారు. దాంతో మండిపోయిన పార్టీ మొత్తం టీడీపీ ఓడిపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే కాని చంద్రబాబు కళ్ళు తెరుచుకోరని అందరు కోరుకున్నారు. అందరి కోరిక ప్రకారమే 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత విశ్లేషణల్లో వాస్తవాలు తెలుసుకుని ఇకనుండి తాను పార్టీకి కూడా సమయం కేటాయిస్తానని చెప్పుకున్నారే కాని ఎప్పుడూ కేటాయించిందిలేదు.

కేసీఆర్ సమస్య ఏమిటి ?

2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు సీనియర్ నేతలను దూరంగా ఉంచేశారు. కేసీఆర్ ను కలవాలని మంత్రులు ఎంత ప్రయత్నించినా అవకాశం ఉండేదికాదు. వారాల తరబడి ఫాంహౌస్ లోనే గడిపేసిన కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులను, నేతలను కలవటానికి మాత్రం ఇష్టపడేవారు కాదు. 2018లో గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పురాలేదు. దాంతో మంత్రులకే కాదు యావత్తు పార్టీతోనే కీసీఆర్ కు బాగా గ్యాప్ వచ్చేసింది. అందుకనే మండిపోయిన పార్టీ నేతలు, క్యాడర్ 2023 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకం చేసి ఓటమికి కారణమయ్యారు. ఓడిన తర్వాత గెలిచిన ఎంఎల్ఏలు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్న కారణంగా ఇపుడు ప్రజాప్రతినిధులు, నేతలతో భేటీలవుతున్నారు.

జగన్ వ్యవహారం

మిగిలిన వాళ్ళ వ్యవహారం వేరు జగన్ వ్యవహారం వేరని అనుకుంటే పొరబాటే. వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తానని తరచూ చెప్పుకునే జగన్ ఆపనిచేయలేదు. వైఎస్సార్ నాయకత్వ లక్షణాల్లో జగన్ కు సగంకూడా లేవని పార్టీ నేతలు ఇపుడు బాహాటంగా మండిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు 24 గంటలూ జనాల్లోనే గడిపిన జగన్ అధికారంలోకి రాగానే మారిపోయారు. మంత్రులను, ప్రజా ప్రతినిధులను, పార్టీ నేతలను కలవటానికి ఇష్టపడలేదు. తమకు ఏ సమస్య ఉన్నా జగన్ తో చెప్పుకోవాలని అనుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బొత్సా సత్యనారాయణతో చెప్పుకోవాల్సొచ్చింది. తమను జగన్ కలవటంలేదనే అసంతృప్తి అందరిలోను బాగా పెరిగిపోయింది. అయితే సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి జగన్ను ఎవరూ తప్పుపట్టే సాహసంచేయలేదు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి నిర్భయంగా జగనలోని తప్పులను ఎండగడుతున్నారు. వైఎస్సార్ లోని హ్యూమన్ టచ్ జగన్లో లేదని నేతలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు.

తన కళ్ళముందు చంద్రబాబు, కేసీయార్, జగన్ స్టైలును రేవంత్ బాగా దగ్గర నుండి గమనించినట్లున్నారు. అందుకనే వాళ్ళ పద్దతిలో కాకుండా దివంగత ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. విచిత్రం ఏమిటంటే వైఎస్సార్ బ్యాలెన్స్ చేసినట్లుగా ప్రభుత్వాన్ని, పార్టీని మిగిలిన వాళ్ళు ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోయారన్న విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. మరిపుడు రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.

Read More
Next Story