
తెలంగాణ రైజింగ్ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్
అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై సుమారు 40 నిముషాలపాటు రేవంత్ వివిధశాఖల ఉన్నతాధికారులతో సమావేశమై అడిగి తెలుసుకున్నారు
ఫ్యూచర్ సిటిలో డిసెంబర్ 8,9 తేదీల్లో జరగబోతున్న ‘తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. రెండురోజులు భారీస్ధాయిలో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సు(Global Summit) నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై సుమారు 40 నిముషాలపాటు రేవంత్(Revanth) వివిధశాఖల ఉన్నతాధికారులతో సమావేశమై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో రేవంత్ మాట్లాడుతు ఏర్పాట్లు అంతర్జాతీయస్ధాయిలో ఉండాలన్నారు. రెండురోజుల సమ్మిట్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది కాబట్టి ఏర్పాట్లు కూడా అంతేస్ధాయిలో జరగాలన్నారు.
అంతర్జాతీయస్ధాయిలో సుమారు 1300 మంది ప్రతినిధులు సమ్మిట్ లో పాల్గొనే అవకాశముందన్నారు. వివిధ దేశాల రాయబారులు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. పాస్ లు లేకుండా సమ్మిట్ ప్రాంగణంలోకి ఎవరు ప్రవేశించేందుకు లేదని రేవంత్ స్పష్టంగా చెప్పారు. అలాగే సమ్మిట్ కు సంబంధంలేని వారికి ఎట్టి పరిస్ధితుల్లోను ఎంట్రీ ఇచ్చేదిలేదని కూడా స్పష్టంగా చెప్పారు. వివిధశాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. తాను ఎప్పటికప్పుడు పనులు పురోగతిని సమీక్షిస్తుంటానని హెచ్చరించారు.
పోలీసులు సమ్మిట్ ఏర్పాట్లకు అవసరమైన చర్యలను గట్టిగా తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. మీడియాకు కూడా పాస్ లు ఇవ్వాలన్నారు. తర్వాత ఫ్యూచర్ సిటీలోనే నిర్మిస్తున్న భారత్ స్కిల్ యూనివర్సిటి నిర్మాణ పనులను కూడా రేవంత్ పరిశీలించారు.

