నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందాం రేవంత్ సంచలనం
x
Revanth in assembly

నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందాం రేవంత్ సంచలనం

తెలంగాణాకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసం చావటానికైనా సిద్ధమైని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.


తెలంగాణాకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసం చావటానికైనా సిద్ధమైని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణాకు నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ ప్రకటించారు. సభాపతిగా తాను, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్ష విషయంలో కేసీఆర్ తో మాట్లాడి తేదీని చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రేవంత్ చెప్పారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సభాపతి రేవంత్ మాట్లాడుతు తెలంగాణా విషయంలో నరేంద్రమోడి ప్రభుత్వం వివక్షతో కాదని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపోయారు. ఐటిఐఆర్, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరి, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, రీజనల్ రింగ్ రోడ్డు, ఐఐఎంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు నిధులు ఇచ్చి తీరాల్సిందే అన్నారు. రాష్ట్రాల నుండి కేంద్రానికి అందుతున్న పన్నుల దామాషాలో కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వటంలేదని ఆరోపించారు. ఐదేళ్ళల్లో 3 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణా చెల్లిస్తే రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం రూ. 1.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఐదు ధక్షిణాది రాష్ట్రాల నుండి కేంద్రానికి పన్నుల రూపంలో 22 లక్షల కోట్ల రూపాయలు వెళుతుంటే 6.42 లక్షల కోట్లు మాత్రమే తిరిగి వెనక్కు వస్తోందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ నుండి పన్నుల రూపంలో 3.41 లక్షల కోట్లు వెళుతుంటే రు. 6 లక్షల కోట్లను కేంద్రం తిరిగి ఉత్తర ప్రదేశ్ కు కేటాయిస్తున్నట్లు రేవంత్ చెప్పారు. ఈ లెక్కలను గమనిస్తే కేంద్రం వివిధ రాష్ట్రాలపై చూపిస్తున్న వివక్ష ఏంటో అర్ధమవుతుందన్నారు.

కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టి తెలంగాణా అభివృద్ధిని సాధించుకునేందుకే అసెంబ్లీలో ప్రత్యేకించి బడ్జెట్ పై చర్చ, తీర్మానం చేసినట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణాకు జరిగిన అన్యాయంపై పార్లమెంటు మెట్ల మీద సోనియాగాంధి, రాహుల్ తో పాటు అనేకమంది ఎంపీలు కూర్చుని నిరసన తెలిపినట్లు రేవంత్ చెప్పారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రప్రయోజనాలే పరమావధిగా ఐకమత్యంగా పోరాటం చేద్దామని పిలుపిచ్చారు. ఈనెల 27వ తేదీన నరేంద్రమోడి నాయకత్వంలో జరగబోయే నీతి అయోగ్ సమావేశాన్ని తెలంగాణా ప్రభుత్వం బహిష్కరిస్తుందని రేవంత్ ప్రకటించారు. కేంద్రం ఆలోచించి సవరించిన బడ్జెట్లో తెలంగాణా అభివృద్ధికి కోరుతున్న అన్నీ డిమాండ్లపైన సానుకూలంగా స్పందించి నిదులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

విభజన చట్టంలో తెలంగాణా అభివృద్ధికి ఇచ్చిన హామీలను అమలుచేయటంలో కేంద్రప్రభుత్వం ఫెయిలైందని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణా విషయంలో కేంద్ర వైఖరికి అసెంబ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నదన్నారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం అన్నీరకాలుగా చర్యలు తీసుకోవాలని రేవంత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ చదివి వినపించగానే సభ్యులు చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు.

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణా అసెంబ్లీలో చర్చించటం, తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024లో తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తెలంగాణా అభివృద్ధికి రేవంత్ మూడుసార్లు నరేంద్రమోడితో పాటు అనేకమంది మంత్రులను కలిసి వినతిపత్రాలను అందించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రు. 10 వేల కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఐటీఐఆర్, ఐఐఎంను మంజూరు చేయాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనేటువంటి చాలా డిమాండ్లను వినతిపత్రాల్లో ప్రస్తావించారు. మోడిని కేంద్రమంత్రులను ఎన్నిసార్లు రేవంత్ బృందం కలిసినా ఉపయోగంలేకపోయింది. తాజా బడ్జెట్లో పైన చెప్పిన ఏ డిమాండ్ల మీద కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. దాంతో రేవంత్ తో పాటు చాలామందికి మండిపోయింది.

అందుకనే బడ్జెట్ సమావేశాల్లో బుధవారం ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ మీద చర్చ-తీర్మానం అంశాన్ని అసెంబ్లీ చేపట్టింది. కేంద్ర బడ్జెట్ పై ఏ రాష్ట్ర అసెంబ్లీ కూడా చర్చించదు. రాజకీయంగా అనేకమంది అనేకరకాలుగా ఆరోపిస్తారు, విమర్శిస్తారంతే. అయితే తెలంగాణా అసెంబ్లీలో ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ మీద అసెంబ్లీలో చర్చ జరిపి తీర్మానం చేసింది. రేవంత్ రెడ్డి చర్చను ప్రతిపాదించగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతు తెలంగాణా ప్రయోజనాల విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. తెలంగాణా విషయంలో నరేంద్రమోడి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనటానికి తాజా బడ్జెట్టే నిదర్శనంగా చెప్పారు. తాము తెలంగాణా అభివృద్ధికి అనేక వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవటం అన్యాయమన్నారు. తెలంగాణా విషయంలో మొదటినుండి కేంద్రం ఇదే పద్దతిలో వ్యవహరిస్తోందన్ని విషయాన్ని గుర్తుచేశారు.

ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు తెలంగాణాపై కేంద్రప్రభుత్వం గడచిన పదేళ్ళుగా వివక్ష చూపిస్తూనే ఉందన్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనలో కూడా కేంద్రం ఇలాగే వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సరే తమ ప్రభుత్వం కేంద్రంపై పోరాటాలు చేసి తెలంగాణాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని కేటీయార్ ప్రస్తావించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి చాలాసార్లు కేటీఆర్ను అడ్డుకున్నారు. 2024 బడ్జెట్లో తెలంగాణాకు కేంద్రం చేసిన అన్యాయంపైన మాత్రమే మాట్లాడాలని సూచించారు. వీళ్ళెంత వారించినా కేటీఆర్ మాత్రం తాను అనుకున్నట్లుగానే మాట్లాడారు. చివరలో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో చేసే తీర్మానానికి సంపూర్ణ మద్దతిస్తామని చెప్పారు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేయాలని సూచించారు. నిధులు తెచ్చుడో..అని చెప్పి ఆగిపోయారు.

బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతు కేంద్రం నుండి తెలంగాణాకు నిధులు వస్తున్నా రాలేదని ఆరోపణలు, విమర్శలు చేయటం అన్యాయమన్నారు. గడచిన పదేళ్ళల్లో కేంద్రం నుండి తెలంగాణాకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు రు. 10 లక్షల కోట్లు వచ్చినట్లు చెప్పారు. మూసీ నదీ రివర్ ఫ్రంట్ కు నిధులు అడుగుతున్న ముఖ్యమంత్రి అందుకు అవసరమైన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇవ్వకపోతే ఎలాగంటు ప్రశ్నించారు. డీపీఆర్ ఇవ్వకపోతే కేంద్రం నిదులు ఎలాగిస్తుందన్నారు. తెలంగాణాపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందన్ని తప్పుపట్టారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపైన రేవంత్ రెడ్డే సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్లు ఎదురు ఆరోపించారు. కేంద్రం నుండి నిదులు తేవటంలో ఫెయిలైన కారణంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

తర్వాత భట్టి మాట్లాడుతు కేటీయార్ వ్యాఖ్యలను ఖండించారు. నిదులు తెచ్చుడో సచ్చుడో అన్న భావనతో కేటీయార్ మాట్లాడటం సరికాదన్నారు. క్యాబినెట్ మొత్తం చనిపోవాలని కేటీయార్ కోరుకోవటం దుర్మార్గమన్నారు. తెలంగాణాకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణాకు న్యాయం జరిగేందుకు అనుసరించాల్సిన మార్గాలపై సభ్యులు చర్చించి సూచనలు చేయాలన్నారు. కేటీయార్ తర్వాత మాట్లాడిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నుండి కూడా ఆశించినంత మద్దతు రాలేదన్నారు. రాష్ట్రప్రయోజనాలకన్నా కొందరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనట్లుగా భట్టి ఎద్దేవాచేశారు. కేంద్రంపై చేయాల్సిన పోరాటంలో అన్నీ పార్టీలు, సభ్యులందరు కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర వైఖరి వల్ల రాష్ట్రాల మధ్య సమాఖ్య స్పూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం సభ్యుడు మహహ్మద్ మజీద్ హుస్సేన్ మాట్లాడుతు కేంద్రం వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏమాత్రం సహకరించటంలేదన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను రాబట్టేందుకు అసెంబ్లీ చేసే తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

Read More
Next Story