రేవంత్ దూకుడు చేతలు.. కేసీఆర్ దాగుడు మూతలు
హైడ్రా కూల్చివేతలపై రాజధానిలో తప్ప బయట వ్యతిరేకత లేదని రేవంత్ భావిస్తున్నారు.హైడ్రా బాధితులకు 2బిహెచ్ కె ఇళ్లు ఇచ్చి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నారు.
(ఎస్. కె. వేణుగోపాల్)
తెలంగాణలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా.. ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తుండగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడును మరింత పెంచగా గులాబీ దళాధిపతి ఇంటికే పరిమితమై మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇపుడు ఫీల్డ్ లో ఎక్కడ చూసినా రేవంత్ కనబడుతున్నారు. కెసిఆర్ మాత్రం సీన్ నుంచి మాయమయ్యారు.
కేసీఆర్ వైఖరి అటు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ పరిశీలకులకు ఇటు బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన వ్యూహమేమిటో అర్థంకాక బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డీలా పడుతున్నారు. రాజకీయ వ్యూహాలు పన్నటంలోను, వాటిని పకడ్బందీగా అమలు చేసి లక్ష్యం సాధించటంలోను కేసీఆర్‌కు తిరుగులేదని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటు నడిపించి తెలంగాణను సాధించిన ఆయన దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. కారణాలు ఏవయినా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత..తుంటి ఎముకకు గాయం కావడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటూ అడపాదడపా పార్టీ నేతలను కలుస్తున్న ఆయన రాజకీయంగా మాత్రం స్తబ్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిపైన, కాంగ్రెస్ పాలనపైన విమర్శనాస్త్రాలను సంధించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అగ్రనేత హరీష్‌రావు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ వ్యూహం మేరకే వారీ బాధ్యతను చేపట్టినట్టు కొందరు చెబుతున్నారు. సరైన సమయం వచ్చినపుడు కేసీఆర్ ఉప్పెనలా విరుచుకుపడతారని అంటున్నారు.
హైడ్రా కూల్చివేతలతో వేడెక్కిన రాజకీయం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో కొన్నింటినే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మెగా డీఎస్సీ నిర్వహణ వంటివి వీటిలో ఉన్నాయి. కానీ కీలకమైన హామీల అమల్లో జాప్యం జరుగుతోంది. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు, సామాన్యులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీ హామీలు ఇంకా అమలు కాలేదు. దీనిపై కేటీఆర్, హరీష్‌రావు తదితరులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పెంచడానికి గట్టిగా యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతం, చెరువులు-కుంటల ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేకంగా హైడ్రా ఏర్పాటు చేసి పెద్దఎత్తున కూల్చివేతలు చేపట్టడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌తోపాటు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లు, భవనాల కూల్చివేతపై పెద్దఎత్తున రచ్చ జరుగుతోంది.
తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో డ్రామా నడిపిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆక్రమణల కూల్చివేతను తొలుత పరోక్షంగా సమర్ధించిన బీజేపీ నేతలు తర్వాత మాట మార్చి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి న్యాయ పోరాటం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.
రేవంత్ ఏం చేయనున్నారు?
హైడ్రా కూల్చివేతలతో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని రేవంత్ వ్యతిరేకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పూర్తిగా ఉందని, అందుకే రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన రేవంత్ రెడ్డి కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టారని పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని మళ్లించటానికి డీఎస్సీ నియామకాలను ఆగమేఘాలపై చేపట్టారని చెబుతున్నారు. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై రాజధాని నగరంలో తప్ప జిల్లాలలో వ్యతిరేకత ఏమీ లేదని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధానిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి ఇస్తామని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశారని తెలుస్తోంది.
కేసీఆర్ రంగంలోకి దిగేదెప్పుడు?
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నప్పటికీ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనం వీడకపోవటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నందువల్ల ఆయన ఇప్పుడప్పుడే బరిలోకి దిగరని ఆయన వ్యవహార శైలి గురించి తెలిసినవారు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు సాటిరారని, ఆయనపై విమర్శలు చేసి తన స్థాయిని తగ్గించుకోరాదని కేసీఆర్ భావన అయిఉండవచ్చని అంటున్నారు. కీలెరిగి వాత పెట్టడంలో నిష్ణాతుడైన కేసీఆర్ సరైన సమయంలో తుపానులా దూసుకొచ్చి సునామీ సృష్టించటం ఖాయమని చెబుతున్నారు.
Next Story