ఎవరి లాజిక్ నిజమవుతుందో ?
x
Revanth KCR and Kishan

ఎవరి లాజిక్ నిజమవుతుందో ?

సోమవారం పోలింగ్ తర్వాత రేవంత్ రెడ్డి, కేసీయార్, కిషన్ రెడ్డి ముగ్గురు కూడా పోలింగ్ తమకే అనుకూలంగా జరిగిందని అంచనాలు కట్టారు.


ఎంతోకాలంగా ఎదురుచూసిన ముఖ్యఘట్టం పోలింగ్ అయిపోయింది. ఇక లెక్కలు, అంచనాలు మొదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నానానికి వాస్తవ పోలింగ్ శాతం ఏమిటన్నది తేలుతుంది. అయితే సోమవారం జరిగిన పోలింగ్ సరళి ప్రకారం సుమారు 65 శాతం ఓటింగ్ నమోదైంది. మంగళవారం మధ్యాహ్నానానికి అందే చివరి సమాచారాన్ని బట్టి మహాయితే మరో మూడు, నాలుగు శాతం పోలింగ్ పెరిగే అవకాశముంది. సోమవారం పోలింగ్ తర్వాత రేవంత్ రెడ్డి, కేసీయార్, కిషన్ రెడ్డి ముగ్గురు కూడా పోలింగ్ తమకే అనుకూలంగా జరిగిందని అంచనాలు కట్టారు. ఈ అంచనాల్లో ముగ్గురిదీ మూడురకాల లాజిక్కులు. ఓటేసిన తర్వాత మీడియాతో రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ కు 14 సీట్లు పక్కాని తేల్చేశారు. అలాగే కేసీయార్ మాట్లాడుతు పోలింగ్ సరళిని బట్టి తమకు 12 సీట్లు ఖాయమన్నారు. కిషన్ మాట్లాడుతు తమపార్టీ 10 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు.

రేవంత్ లాజిక్కేంటి ?

లాజిక్కుల పరంగా రేవంత్ ఏమంటారంటే తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరుగ్యారెంటీల వల్లే ఓటర్లు ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ కు పెద్దఎత్తున ఓట్లేసినట్లు చెప్పారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రు. 500 కే మూడు సబ్సిడి సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడకం కారణంగా జనాలు పార్టీకి మెజారిటి సీట్లిస్తారని అన్నారు. బీఆర్ఎస్ కు ఓట్లేసినా ఉపయోగంలేదని, అలాగే నరేంద్రమోడి వల్ల తెలంగాణాకు ఎలాంటి మేలు జరగలేదని జనాలందరు అర్ధంచేసుకున్నారని రేవంత్ చెప్పారు. 8 నియోజకవర్గాల్లో బీజేపీతోను, 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తో పోటీ జరిగిందన్నారు. ఎవరితో పోటీపడినా తమకు మాత్రం 14 సీట్లు పక్కా అని బల్లగుద్ది మరీ చెప్పారు.

కేసీయార్ ఏమంటారు ?

ఇదే విషయమై కేసీయార్ లాజిక్ ఏమిటంటే ఓటర్ల పెద్దఎత్తున తమకే మద్దతిచ్చినట్లు చెప్పారు. కారణం ఏమిటంటే ఆరుగ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందని జనాలు గ్రహించారట. అలాగే బీజేపీకి ఓట్లేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధంచేసుకున్నారట. పదేళ్ళల్లో నరేంద్రమోడి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణాకు చేసిందేమీ లేద్నన వాస్తవాన్ని జనాలందరు గుర్తించినట్లు కేసీయార్ చెప్పారు. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి తప్పుచేసినట్లు జనాలందరు చింతిస్తున్నట్లు కేసీయార్ అభిప్రాయపడ్డారు. కాబట్టే బీఆర్ఎస్ 12 సీట్లలో గెలుస్తుందని కాంగ్రెస్, బీజేపీలు రెండోస్ధానం కోసమే పోటీపడినట్లు కేసీయార్ బల్లగుద్దకుండానే చెప్పారు.

కిషన్ ఏమన్నారు ?

ఇక కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతు తమకు పదిసీట్లు ఖాయంగా వస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. పదిసీట్లలో ఎలా గెలుస్తుందంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేసి నష్టపోయామని జనాలు బాధపడుతున్నారట. ఇదేసమయంలో బీఆర్ఎస్ కు ఓట్లేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా జనాలందరు గుర్తించారట. తెలంగాణా అభివృద్ది నరేంద్రమోడి నాయకత్వంలో మాత్రమే జరుగుతుందన్న విషయాన్ని ప్రజలంతా తెలుసుకున్నట్లు కిషన్ అభిప్రాయపడ్డారు. అందుకనే నాలుగు సిట్టింగ్ నియోజకవర్గాలకు తోడు మరో ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందన్నారు. ఇదే విషయమై మల్కాజ్ గిరి పార్లమెంటులో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఈటల రాజేందర్ మాట్లాడుతు బీజేపీ 12 సీట్లలో గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు. రేవంత్, కేసీయార్, కిషన్ ముగ్గురు కూడా తమ పార్టీ విజయానికి, పార్టీ గెలుచుకోబోయే నియోజకవర్గాల సంఖ్య విషయంలో మూడురకాల లాజిక్కులు వినిపించారు.

అసలేం జరిగింది ?

అసలు గ్రౌండ్ లెవల్లో ఏమి జరిగిందో చూస్తే పోలింగ్ శాతం ఏమంత ఆశాజనకంగా లేదు. 65 శాతం పోలింగ్ జరిగిందని అనుకున్నా 35 శాతం మంది ఓట్లేయటంలో ఆసక్తిచూపలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గాల సగటు ఓటింగ్ శాతం 50 దాటలేదు. అందుకనే గ్రేటర్ పరిధిలోని ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలైన ఓట్లలో మెజారిటియే చూస్తారు కాబట్టే పై ముగ్గురు గెలుపు విషయంలో తమదైన లాజిక్కులను వినిపిస్తున్నారు. మరి ఎవరి లాజిక్ కరెక్టో తెలియాలంటే జూన్ 4వ తేదీవరకు వెయిట్ చేయాల్సిందే.

Read More
Next Story