లగచర్ల భూసేకరణలో రేవంత్ చక్రంతిప్పారా ?
x
Revanth

లగచర్ల భూసేకరణలో రేవంత్ చక్రంతిప్పారా ?

భూములు ఇవ్వటానికి ఒకపుడు ప్రభుత్వానికి ఎదురుతిరిగిన లగచర్ల(Lagacharla farmers) రైతులు తాజాగా యూటర్న్ తీసుకున్నారు.


క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదేఅనుమానం పెరిగిపోతోంది. భూములు ఇవ్వటానికి ఒకపుడు ప్రభుత్వానికి ఎదురుతిరిగిన లగచర్ల(Lagacharla farmers) రైతులు తాజాగా యూటర్న్ తీసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇస్తామని రాతమూలకంగా కలెక్టర్ కు హామీఇచ్చారు. పోయినఏడాది నవంబర్ నెలలో లగచర్ల మొదటిసారిగా దేశవ్యాప్తంగా సంచలమైంది. రేవంత్ రెడ్డి(Revanth) సొంత నియోజకవర్గం కొడంగల్లో(Kodangal) ఏర్పాటుచేయాలని అనుకున్న ఫార్మా విలేజ్(Pharma village) కోసం భూములను సేకరించాలని డిసైడ్ అయ్యింది. ఇందులోభాగంగా నియోజకవర్గంలోని పోలేపల్లి, హకీంపేట, లగచర్ల గ్రామస్తులతో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) గ్రామసభలు నిర్వహించారు. లగచర్లలో గ్రామసభ నిర్వహిస్తుండగా కలెక్టర్ పై గ్రామస్తులు, రైతులు దాడిచేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ పైన గ్రామస్తులు, రైతులు చేసిన దాడి అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలమైంది.

కలెక్టర్ పై దాడిఘటనలో పోలీసులు దాదాపు 70 మందిని అరెస్టుచేసి నెలలపాటు జైలులోనే ఉంచారు. దాడికి బాధ్యులుగా పోలీసులు గుర్తించిన వారిలో కొందరు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ దాడికి బీఆర్ఎస్(BRS) మాజీ ఎంఎల్ఏ పట్నంనరేందర్ రెడ్డి, స్ధానికనేత సురేష్ కీలకపాత్రదారులని పోలీసులు గుర్తించారు. మాజీ ఎంఎల్ఏని పోలీసులు అరెస్టుచేయగా మరో నిందితుడు సురేష్ కొంతకాలం పరారీలో ఉండి తర్వాత కోర్టులో లొంగిపోయాడు. అప్పట్లో అరెస్టయిన రైతులు, గ్రామస్తుల్లో కొందరు ఈమధ్యనే జైలునుండి విడుదలయ్యారు. భూములిచ్చే విషయంలో ప్రభుత్వానికి ఎదురుతిరిగిన రైతులు, గ్రామస్తులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్(Harish) తదితరులు బహిరంగంగా మద్దతుగా నిలిచారు. దాంతో చాలారోజులు రైతులు, గ్రామస్తులు-ప్రభుత్వానికి మధ్య పెద్ద వివాదమే నడిచింది. ప్రాణాలుపోయినా సరే భూములు మాత్రం ఇచ్చేదిలేదని రైతులు ప్రభుత్వానికి తెగేసిచెప్పారు.

అప్పటి పరిస్ధితులనుబట్టి ప్రభుత్వంకూడా ఫార్మా ఇండస్ట్రీ కోసం చేయాలని అనుకున్న భూసేకరణను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఫార్మా ఇండస్ట్రీకి భూసేకరణ బదులు పారిశ్రామికవాడకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసింది. పారిశ్రామికవాడకు కూడా తమభూములిచ్చేదిలేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమోగాని నాలుగురోజుల క్రితం లగచర్లలోని కొందరు రైతులు కలెక్టర్ ను కలిశారు. పారిశ్రామికవాడ ఏర్పాటుకు తమభూములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు రాతమూలకంగా రాసిచ్చారు. రైతులతో మాట్లాడి, ఒప్పించి భూములిప్పించే బాధ్యతను మొదట్లో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి తీసుకున్నారు. రైతులతో సమావేశంలో తిరుపతిరెడ్డి దురుసుగా వ్యవహరించటమే కాకుండా బెదిరింపులకు దిగటంతోనే రైతులు ఎదురుతిరిగారని రేవంత్ కు రిపోర్టందింది.

లగచర్ల వివాదాన్ని జాగ్రత్తగా పరిశీలించిన రేవంత్ రైతులను ఒప్పించే బాధ్యతలను బొంరాస్ పేట మండలానికి చెందిన కొందరు సీనియర్ నేతలకు అప్పగించినట్లు సమాచారం. సీనియర్ నేతలు పైగ్రామాల్లోని రైతులతో ప్రత్యేకంగా వారంరోజులు వరుసగా భేటీ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. నేతలిచ్చిన హామీలతో రైతులు మెత్తబడి తమ భూములివ్వటానికి రెడీ అయ్యారు. దాంతో సీనియర్ నేతలు రైతులను కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఎకరాకు పరిహారంగా రు. 20 లక్షలు, ఎకరాకు 150 చదరపు గజాల ఇంటిస్ధలం, ఇందిరమ్మ ఇళ్ళు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేట్లుగా కలెక్టర్ చేసిన ప్రతిపాదనకు మెజారిటి రైతులు అంగీకరించారు.

భూములు ఎంతవసరం ?

పారిశ్రామికవాడ ఏర్పాటుకు 1177 ఎకరాలు అవసరమని ప్రభుత్వం నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. లగచర్లలో 607 ఎకరాలు సేకరించబోతున్నది ప్రభుత్వం. ఇందులో 497 ఎకరాల పట్టాభూమి, 110 ఎకరాల అసైన్డ్ భూముంది. పోలేపల్లి గ్రామంలో 71.39 ఎకరాల అసైన్డ్ భూమి సేకరించాలి. హకీంపేటలో పట్టాభూమి 146.34 ఎకరాలు, అసైన్డ్ భూమి 351 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లోని కొందరు రైతులు భూసేకరణ ఒప్పందంపై సంతకాలు చేశారు. వివాదానికి కేంద్రంగా నిలిచిన లగచర్ల రైతుల్లో 40 మంది ఒప్పందంపై సంతకాలు చేశారు. మిగిలిన రైతులతో కలెక్టర్ చర్చలు జరుపుతున్నారు. సంతకాలు చేసిన అసైన్డ్ రైతుల దగ్గర సుమారు 70 ఎకరాలుంది. మరో 40 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. పట్టాభూములున్న రైతుల్లో కొందరు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తమ భూములను ఇవ్వటానికి ఒప్పుకోవటంలేదు. అందుకనే వారితో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం టార్గెట్టుగా పెట్టుకున్నభూసేకరణలో ఇఫ్పటికి 80శాతం భూములు వచ్చేసినట్లే అనుకోవాలి. తాజా పరిణామాలను గమనిస్తే రైతులను ఒప్పించటంలో రేవంత్ తెరవెనుక చక్రంతిప్పారని అర్ధమవుతోంది.

Read More
Next Story