కెసిఆర్ తలుపులు మూశాడు, రేవంత్ స్వాగతించాడు...
x
నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కుమార్ బేరి (గ్రే కోటు) తో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం

కెసిఆర్ తలుపులు మూశాడు, రేవంత్ స్వాగతించాడు...

నీతిఆయోగ్ ను బహిష్కరించకుండా సహకరించాలని కోరేందుకు మంగళవారం నాడు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌కుమార్‌ బేరి ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు.


నీతిఆయోగ్ (NITI Aayog: National Institution for Transforming India)కు గత తెలంగాణ ప్రభుత్వం విధించి నిషేధాన్ని ఎత్తివేశారు.

పేచీలేకుండా ఈ కేంద్ర సంస్థకు నిర్మాణాత్మకంగా సహకరించి, లబ్దిపొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకే 2019 లో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూసేసిన తలుపులు బార్లా తెరిచి నీతిఆయోగ్ కు స్వాగతం పలికారు. అంతేకాదు, కెసిఆర్ లాగా నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను బహిష్కరించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను స్వయంగా కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం మానుకుని నీతిఆయోగ్ కు సహకరించాలని కోరేందుకు మంగళవారం నాడు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌కుమార్‌ బేరి, సభ్యుడు విజయ్‌కుమార్‌ సారస్వత్‌ ముఖ్యమంత్రిని కలిశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తరహా సమావేశం జరగడం ఇదే ప్రథమం. ఇాదొక మంచి పరిణామమని సీనియర్ అధికారి ఒకరు ఫెడరల్ -తెలంగాణకు తెలిపారు.

ఒక కేంద్ర సంస్థకు చెందిన ఉన్నత స్థాయి బృందం రాష్ట్రానికి వచ్చి సఖ్యత ఆశించడం గతంలో జరగలేదని ఆయన చెప్పారు. "కేంద్ర సంస్థతో పేచీ పడకుండా సఖ్యతగా ఉంటూ సహాయం పొందాలనుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ ఒక నిర్మాణాత్మక నిర్ణయం తీసుకున్నారు," అని ఆయన వ్యాఖ్యానించారు.

గతంలో బిఆర్ ఎస్ ముఖమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీతిఆయోగ్ ను బ హిష్కరించారు. ఆయన నీతిఆయోగ్ సమావేశాలకు తాను వెళ్లకపోవడమే కాదు ఆయన హాజరయిన చివరి సమావేశం 2018 లోజరిగిన గవర్నింగ్ కౌన్సిల సమావేశమే. దానికితోడు ఆయన నీతిఅయోగ్ ని పనికిరాని సంస్థ (useless body) అని కొట్టి పడేశారు. తెలంగాణ మీద కేంద్రం చూపిస్తున్న వివక్ష నిరసనగా తాను నీతిఆయోగ్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కెసిఆర ప్రకటించారు. ఈ వివక్ష అనే విమర్శను నీతి ఆయోగ్ ఖండిస్తూవచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద రు.3,982 కోట్లు, పిఎంకెఎస్ వై కింద 2014-2015 నుంచి 2021-21దాకా 1,195 కోట్లు విడుదల చేసినట్లు చెబుతూ వచ్చింది.

2019లో ప్రధాని మోదీ అఖండ విజయంతో తిరిగిరాగానే కెసిఆర్ నీతి ఆయోగ్ బహిష్కరణ మొదలయింది. కెసిఆర్ అంతకు ముందు మోదీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక కూటమి కట్టాలనుకున్నారు. కేంద్రంలో మోదీ బలహీన పడ్డారని, రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు మంచి మెజారిటీతో గెలుస్తాయని అపుడు ప్రతిపక్ష కూటమి ఏర్పడే పరిస్థితి వస్తే, తాను కీలకపాత్ర పోషించవచ్చని ఆయన కలగన్నారు. దీనికో ప్రత్యేక విమానంలో అనేక రాష్ట్రాలు తిగిరి ముఖ్యమంత్రులను కలిశారు. అయితే, పరిస్థితి తారుమారయింది. కేంద్రంలో మరింత మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కెసిఆర్ బలగం బాగా తగ్గింది. కాంగ్రెస్ మూడుస్థానాల్లో బిజెపి నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. దీనితో కెసిఆర్ కు కోపం వచ్చింది. ఎదుకంటే బిజెపి బలహీనపడుతున్నదన్న తన అంచనా తప్పయింది. రెండు,తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన తాను ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. ఈ అసంతృప్తిని ఆయన రకరకాల రూపాలలో వ్యక్తం చేస్తూ వచ్చారు. నీతిఆయోగ్ ని యూజ్ లెస్ బాడీ అనడం ఈ అక్కసుతోనే.

రేవంత్ స్వాగతం

కెసిఆర్ లాగా కాకుండా రేవంత్ రెడ్డి నీతిఆయోగ్ ను స్వాగతించారు. రాష్ట్రానికి రావలసిన గ్రాంట్లే కాకుండా అదనపు అప్పులు, సాయం పొందేందుకు ఈ సంస్థను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్నే ముఖ్యమంత్రి నిన్న నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడికి తెలిపారు. బిఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థికపరిస్థితి దెబ్బతినిందని, కేంద్రంలో ఆదుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు.కేంద్రం నుంచి నిధులు ఇప్పించేందుకు నీతిఆయోగ్ మధ్యవర్తిగా పనిచేయాలని తెలివిగా ఒక కోరిక కోరారు.

16వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు నిధులు వచ్చేలా చూడాలని కోరారు. దీనికి బదులుగా నీతి ఆయోగ్‌కు తమ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొంటుందని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో 2014 ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం వెనకబడిన జిల్లాల పేరుతో రాష్ట్రానికి కేంద్రం రు. 1800 కోట్లు బకాయీ ఉందని, ,ఈ మొత్తాన్ని విడుదల చేయాలని కూడా రేవంత్ కోరారు.

Read More
Next Story