అందరినీ ఏం మాయచేశాడో
x
Revanth and Rajagopal reddy (source Revanth twitter)

అందరినీ ఏం మాయచేశాడో

ఏ విషయంలో అయినా ఒక నేత అవునంటే పదిమంది కాదంటారు. ఇలాంటి పార్టీలో ఇపుడు రేవంత్ రెడ్డి మాటకు ఎదురన్నదే లేకుండా ఉంది.


ఇపుడిదే అంశంపై తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలమధ్య చర్చ జరుగుతోంది. విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అపరిమితమైన స్వేచ్చకు పేరొందిన పార్టీ. కాంగ్రెస్ నేతలే తమ పార్టీలో జరుగుతున్న గొడవలపై డెమక్రసీ ఎక్కువగా ఉన్న పార్టీ తమది అని చలోక్తులు విసురుతుంటారు. ఏ విషయంలో అయినా ఒక నేత అవునంటే పదిమంది కాదంటారు. ఇలాంటి పార్టీలో ఇపుడు రేవంత్ రెడ్డి మాటకు ఎదురన్నదే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ మాటకు ఎదురుచెప్పటానికి నేతలంతా భయపడుతున్నారని అనుకుంటే పొరబాటు పడినట్లే. కాంగ్రెస్ అంటేనే పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రా లేకపోతే పార్టీ అధ్యక్షుడా అని కూడా ఎవరూ చూడరు. తాము చెప్పదలచుకున్నది చెప్పేయటం లేకపోతే పూర్తిగా వ్యతిరేకించటం కాంగ్రెస్ లో చాలా మామూలు.

ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇపుడు రేవంత్ ఎంతచెబితే మిగిలిన నేతలకు అంతగా ఉంది. అలాగని రేవంత్ అంటే అందరికీ ఆమోదయోగ్యుడైన నేతా అంటే అదీకాదు. రేవంత్ కు మద్దతుగా ఎంతమంది నేతలుంటే వ్యతిరేకించే వాళ్ళు అంతకన్నా ఎక్కువమందే ఉన్నారు. వ్యతిరేకత కూడా మామూలుగా ఉండదు బహిరంగంగానే అనదలచుకున్నది, చెప్పదలచుకున్నది చెప్పేస్తారు. ఇలాంటి నేతలున్న పార్టీలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం మాటకు ఎదురన్నదే కనబడటంలేదు. విషయం ఏమిటంటే మొత్తం 17 పార్లమెంటుసీట్లలో తక్కువలో తక్కువ 14 నియోజకవర్గాలను గెలుచుకోవటమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని నేతల సమీక్షా సమావేశాల్లో పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాల సమీక్షలను తనింట్లోనే పెట్టుకున్నారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గం సమీక్షను పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ అయిన కొడంగల్లోని తనింట్లో కానిచ్చేశారు. తాజాగా నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సమీక్షను మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇంట్లో నిర్వహించారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎంఎల్ఏకి రేవంత్ కు ఏమాత్రం పడదు. కోమటిరెడ్డి బ్రడర్స్ కు రేవంత్ తో ఏ స్ధాయిలో వైరముందో అందరికీ తెలిసిందే. అయినా సరే వైరాన్ని పక్కనపెట్టేసి అదేపనిగా రేవంత్ మునుగోడు ఎంఎల్ఏ ఇంట్లోనే సమీక్ష నిర్వహించారంటే పక్కా ప్లాన్ అర్ధమైపోతోంది. ఇంతకీ ప్లాన్ ఏమిటంటే నేతల మధ్య వైరంతో పార్టీ ఒక్కసీటును కూడా కోల్పోకూడదన్నదే రేవంత్ ఉద్దేశ్యం. అందుకనే వైరాన్ని పక్కనపెట్టి రాజగోపాలరెడ్డితో మాట్లాడి పార్లమెంటు పరిధిలోని ఎంఎల్ఏలు, నేతలందరినీ ఎంఎల్ఏ ఇంటికే పిలిపించారు. అంటే ఎంఎల్ఏకి తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలను పంపారు.

భువనగిరి ఎంపీ సీటును గెలిపించే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మీదే ఉంచారు. కారణం ఏమిటంటే రాజగోపాలరెడ్డేమో తన భార్యకు ఎంపీ టికెట్ కావాలని పట్టుబట్టారు. అలాగే అన్న, మంత్రి వెంకటరెడ్డేమో తన మద్దతుదారుడికే టికెట్ రావాలని పట్టుబట్టారు. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ చెప్పిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దాంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అలిగితే కష్టమని గ్రహించిన రేవంత్ ఇద్దరికీ మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. అభ్యర్ధుల గెలుపుకోసం రేవంత్ పడుతున్న కష్టాన్ని అటు అధిష్టానం ఇటు పార్టీలోని సీనియర్లు గమనిస్తున్నారు. ఖమ్మం సీటుకోసం పట్టుబట్టిన మాజీ ఎంపీ వీ హనుమంతరావుకు కూడా టికెట్ రాలేదు. అందుకనే వీహెచ్ ఇంటికి రేవంత్ వెళ్ళి మరీ సముదాయించొచ్చారు.

తొందరలోనే అన్నీ పార్లమెంటునియోజకవర్గాల్లోను పర్యటించేందుకు రేవంత్ షెడ్యూల్ రెడీచేస్తున్నారు. ఇప్పటికైతే తనకత్తికి ఎదురులేదన్నట్లుగా రేవంత్ దూసుకుపోతున్నారు. ఒక విధంగా తన ప్రత్యర్ధులందరినీ నిర్వీర్యులను చేసేస్తున్నట్లే లెక్క. తనను కాదని అధిష్టానం దగ్గరకు ఎవరైనా వెళ్ళినా వాళ్ళ మాట చెల్లుబాటు కానీయకుండా రేవంత్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. ఇలాంటి ముందుజాగ్రత్తలు అన్నీ పార్టీల్లోను సహజమే. మొత్తానికి వ్యతిరేకుల్లో ఒక్కళ్ళు కూడా నోరెత్తకుండా రేవంత్ ఏమి మాయచేశారో అనే చర్చయితే నేతల మధ్య పెరిగిపోతోంది.

ఇదే విషయమై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట్లాడుతు ముఖ్యమంత్రిగానే కాకుండా పీసీసీ ప్రెసిడెంటుగా కూడా రేవంత్ రెడ్డే కంటిన్యు అవుతారని చెప్పారు. రేవంత్ పాలన భేషుగా ఉందన్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడుతు మరో పదేళ్ళు రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు. నిజానికి రేవంత్ కు బద్ధశతృవులు ఎవరైనా ఉన్నారా అంటే ముందు వరసలో వీళ్ళిద్దరే ఉంటారని అందరికీ తెలిసిందే.

Read More
Next Story