
రేవంత్ ‘మహిళాశక్తి’తో మగువల మనసు ఆకట్టుకోగలడా ?
రేవంత్ ప్రకటించిన కోటీశ్వరుల ప్రకటన మహిళలను బాగా ఊరిస్తున్నట్లే ఉంది
చాలాకాలం క్రితం ప్రారంభమై ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే క్విజ్ ప్రోగ్రామ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే క్విజ్ ప్రోగ్రామ్ కు తెలుగు అనువాదమే మీలో ఎవడు కోటీశ్వరుడు(Kaun Banega Karodpati). ఈ ప్రోగ్రామ్ లో నిజంగా చెప్పాలంటే గొప్పదనం అంటు ఏమీలేదు. ఎందుకంటే గతంలోనే ఎన్నో టీవీషోల్లో క్విజ్ ప్రోగ్రాములు ప్రసారమయ్యాయి. అయితే మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్ కు గతంలో ఏ ప్రోగ్రామ్ కు లేనంత ఆధరణ ఎందుకు వచ్చింది ? ఇందుకు రెండే కారణాలు. మొదటిది ప్రోగ్రామ్ హోస్ట్ ప్రముఖ బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అయితే రెండో కారణం విజేతకు ఏకంగా ‘కోటిరూపాయలు’ బహుమానం దక్కటం. ఇప్పటివరకు క్విజ్ ప్రోగ్రాము(Quiz Programme)లో పాల్గొని విజేతై కోటిరూపాయలు గెలుచుకున్నది చాలా తక్కువమందే. అయితే కోటిరూపాయల గెలుచుకునే క్విజ్ ప్రోగ్రాములో తమసత్తా ఏమిటో తెలుసుకునేందుకు ఎవరికి వారుగా దేశంలోని జనాలు క్విజ్ ప్రోగ్రామ్ మొదలయ్యే సమయానికి టీవీలముందు అతుక్కుపోయేవారు. కారణం పైన చెప్పుకున్నట్లుగా కోటిరూపాయలకు ఉన్న పవర్.
కోటిరూపాయల సంపాదన అన్నది ఎగువమధ్య తరగతి జనాల్లోని చాలామందికి కలలోని మాటే. అలాంటిది ఇక మధ్య, దిగువ తరగతి జనాలగురించి చెప్పాల్సిన పనేలేదు. ఇపుడిదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth) ప్రకటించిన కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయటంగురించే. రేవంత్ ప్రకటించిన కోటీశ్వరుల ప్రకటన మహిళలను బాగా ఊరిస్తున్నట్లే ఉంది. అందుకనే రేవంత్ ప్రకటనపై చాలామంది మహిళలు బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. రాష్ట్రంలోని స్వయంసహాయక గ్రూపుల్లోని(ఎస్ హెచ్ జీ)(SHGs) కోటిమందిమహిలను కోటీశ్వరులను చేసేబాధ్యతను తాను తీసుకుంటున్నట్లు రేవంత్ చేసిన ప్రకటన చాలామంది మహిళల్లో బాగా ఆసక్తిని పెంచేస్తోంది. ఈ ప్రోగామ్ కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇందిరామహిళాశక్తి’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. గ్రూపుల్లోని మహిళలు రేవంత్ ప్రకటనపై తెగ చర్చించేసుకుంటున్నారు. గ్రామ, మండల, జిల్లాస్ధాయిల్లోని గ్రూపుల ముఖ్య లీడర్లందరు సమావేశమై ఇదే విషయమై మాట్లాడుకుంటున్నారు.
ఈ పథకంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మహిళలను విజయవంతమైన మహిళలుగా తీర్చిదిద్దటమే. ఇందుకోసం ఆసక్తి ఉన్న, కెపాసిటి ఉన్న మహిళలతో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తిసామర్ధ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ల(Solar Power Plants) యూనిట్లు పెట్టించటం. ఇండస్ట్రియల్ పార్కుల్లో 5 శాతం ప్లాట్లు కేటాయించటం, జిల్లాకో పెట్రోల్ బంకును ఏర్పాటుచేయించటం, 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్(Indira MahilaSakthi Bazar) ఏర్పాటుచేయించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే స్వయంఉపాధిపథకం క్రింద 196 ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్లు, విద్యార్ధులకు యూనిఫారమ్ తయారీ యూనిట్లు ఏర్పాటుచేయించటం, 22 మహిళా శక్తి భవనాలను నిర్మించటం, మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేయటం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.
ఇదికాకుండా డైరీ సహకార రంగంలో 40 వేలమంది సభ్యులకు శిక్షణ ఇప్పించటం, ఈవెంట్ మేనేజ్మెంట్ల నిర్వహణలో శిక్షణ ఇప్పించటంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణలో భాగస్వాములను చేయటమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పైన చెప్పినవన్నీ సాకారమవ్వటానికి లక్ష కోట్ల రూపాయల అప్పులు ఇప్పించాలన్న లక్ష్యాన్ని రేవంత్ సర్కార్ పెట్టుకున్నది. ఆర్టీసీ బస్సులను కూడా అద్దెకు ఇప్పించి ఆర్ధికంగా బలోపేతం చేయించాలని రేవంత్ ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇప్పటికే 150 గ్రూపులను కూడా ఎంపికచేసింది. మరివన్నీ నిజంగానే ప్రభుత్వం చేయగలుగుతుందా ? ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఎంతమంది మహిళలు అందిపుచ్చుకుంటారు ? అన్నదే కీలకమైన ప్రశ్న. ఇదే విషయమై ‘తెలంగాణ ఫెడరల్’ తో కొందరు మహిళలు తమ అబిప్రాయాలను పంచుకున్నారు.
రేవంత్ ప్రకటన సాధ్యంకాదు
కోటిమందిమహిళలను కోటీశ్వరులను చేయటం అన్న రేవంత్ ప్రకటన ఆచరణలో సాధ్యంకాదని వరంగల్లోని కాకతీయ యూనివర్సిటి రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ జ్యోతిరాణి అభిప్రాయపడ్డారు. ‘ఒక మధ్యతరగతి మహిళ కోటీశ్వరురాలు కావటానికి జీవితకాలం సరిపోద’న్నారు. ‘స్వయంసహాయగ్రూపుల్లో పనిచేస్తున్న మహిళలు కోటీశ్వరురాలు అవ్వటం లాజికల్ గా ఎప్పటికీ సాధ్యంకాద’ని చెప్పారు. ‘చిన్నచిన్న వ్యాపారాలను మల్టీ నేషనల్ కంపెనీలు(ఎంఎన్సీ) మింగేస్తున్న ఈ కాలంలో మహిళలు ఆర్ధికంగా ఎప్పటికి ఎదగాల’ని ఆమె ప్రశ్నించారు. ‘కరోనా, జీఎస్టీ వచ్చి చిన్న వ్యాపారాలాను దారుణంగా దెబ్బతీసి’నట్లు జ్యోతిరాణి అభిప్రాయపడ్డారు. ‘గ్రూపుల్లోని మహిళలు ఎవరో కొందరు ప్రభుత్వ సాయాన్ని అందిపుచ్చుకుని ఆర్ధికంగా బలోపేతం అయితే అవ్వచ్చ’ని చెప్పారు. కిందస్ధాయి నుండి ప్రారంభమై ఎవరో ఒకరు పెద్దస్ధాయికి ఎదిగితే అది అందరికీ వర్తించదని జ్యోతి చెప్పారు. కాకపోతే కోటీశ్వరురాలు అవ్వాలనే ఆశలున్న మహిళలు గట్టిగా ప్రయత్నిస్తే కనీసం లక్షాధికారన్నా అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
ఆర్ధికంగా బలోపేతం అవచ్చు
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండల కేంద్రంలో సాయిలక్ష్మి గ్రూపు లీడర్ కలకోటి లక్ష్మి మాట్లాడుతు కోటీశ్వరురాలు అయ్యేందుకు ప్రయత్నిస్తే కనీసం లక్షాధికారి అన్నా అవ్వచ్చు కదాని అభిప్రాయపడ్డారు. ‘నిజంగానే కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయటం సాధ్యంకాద’ని అంగీకరించారు. అయితే ‘ప్రభుత్వ సాయాన్ని బాగా ఉయోగించుకుంటే కోటీశ్వరురాలు కాకపోయినా మహిళలు ఆర్ధికంగా బలోపేతం అయ్యే అవకాశాలున్నాయ’ని చెప్పారు. ‘కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న లక్ పతి దీదీ పథకం లాగే మహిళాశక్తి పథకం కూడా మహిళలకు ఉపయోగపడితే అంతకుమించి ఏమికావాల’న్నారు.
అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలకేంద్రంలోనే ఉన్న భావన గ్రూపు లీడర్ కాలం హేమలత మాట్లాడుతు ‘ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళాశక్తి పథకాన్ని మహిళలు అందరు అందిపుచ్చుకోవాల’ని చెప్పారు. ‘గట్టిగా ప్రయత్నిస్తే కొందరు మహిళలైనా ఎప్పుడో ఒకపుడు కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం ఉంద’న్నారు. ‘బ్యాంకులు ఇపుడు అప్పులిస్తున్నాయని, తీసుకున్న అప్పులను తీరుస్తున్న గ్రూపులకు మరింత ఎక్కువగా అప్పులిస్తున్నాయ’ని హేమలత చెప్పారు. రేవంత్ చేసింది రాజకీయ ప్రకటన అయితే కాదని అభిప్రాయపడ్డారు. ‘నిజంగానే రాజకీయ ప్రకటన అయితే మహిళా గ్రూపులకు ప్రభుత్వ గ్యారెంటీ ఉండి బస్సులను ఎందుకు ఇప్పిస్తుంద’ని ప్రశ్నించారు.
ప్రభుత్వ లక్ష్యం మంచిదే
జనగామ జిల్లా కేంద్రంలో అంబికా మహిళా గ్రూపు లీడర్ కెమిడి కృష్ణవేణి మాట్లాడుతు మహిళా గ్రూపులోని చివరి మహిళవరకు ప్రభుత్వం అందిస్తున్న పథకం లబ్ది అందాలన్నారు. ‘మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వం లక్ష్యం మంచిదే’ అని చెప్పారు. ‘తీసుకున్న అప్పులను తీరుస్తున్న గ్రూపులకు బ్యాంకులు ఇంకా పెద్దమొత్తంలో అప్పులిస్తున్న’ట్లు చెప్పారు. రు. 30 లక్షలు అప్పు తీసుకున్న గ్రూపులు కూడా తనకు తెలుసన్నారు. అంతపెద్దమొత్తంలో బ్యాంకులు అప్పులిస్తున్నాయంటేనే గ్రూపుల పనితీరు బాగుందనే కదా అర్ధం అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వం అందిస్తున్న పథకం ద్వారా బాగా కష్టపడితే కోటీశ్వరురాలు కాలేకపోయినా కనీసం లక్షాధికారి అయినా అవ్వచ్చ’ని కెమిడి అభిప్రాయపడ్డారు.
ఆర్ధికంగా బలోపేతమవుతారు
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటి ఎకనామిక్స్ డిపార్ట్ మెంటులో అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు మాట్లాడుతు ‘ప్రభుత్వ లక్ష్యాలు భారీగా పెట్టుకుంటే అందులో కొందరైనా లక్షాధికారులైనా అవచ్చ’న్నారు. ‘కొంతమంది మహిళలు ప్రభుత్వ పథకం ద్వారా లక్షాధికారులు అయినా ఇందిరా మహిళాశక్తి పథకం ఉద్దేశ్యం నెరవేరినట్లే’ అని అభిప్రాయపడ్డారు. ‘పథకాలు పెట్టడం, నిధులు మంజూరు చేయటంతో ఆపేయకుండా పథకాలు ఎలా పనిచేస్తున్నాయి, మహిళ ఆర్ధిక స్ధితిగతులు ఏ విధంగా మెరుగయ్యాయనే విషయాన్ని ప్రభుత్వం గమనించటం చాలా ముఖ్యమ’న్నారు. పథకాల అమలుపై మానిటరింగ్, ఫాలోఅప్ ఉండటంలేదని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి మిషన్లో ఇప్పటికే కొన్ని గ్రూపులతో ప్రభుత్వమే క్యాంటిన్లు పెట్టిస్తోందని, టీస్టాల్స్ నడిపిస్తున్నట్లు శేషు చెప్పారు. ‘మహిళలను ప్రభుత్వం వృత్తుల నుండి వ్యాపారాల వైపు నడిపిస్తున్నట్లు’గా చెప్పారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న లక్ పతీ దీదీ పథకం మోడల్లోనే రాష్ట్రప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి పథకాన్ని అమలుచేయబోతున్నట్లు శేషు చెప్పారు.