కాగ్నిజెంట్ వచ్చేస్తోంది..శంకుస్ధాపన చేయబోతున్న రేవంత్
x
Cognizant center

కాగ్నిజెంట్ వచ్చేస్తోంది..శంకుస్ధాపన చేయబోతున్న రేవంత్

కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో రెండో సెంటర్ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించిన శంకుస్ధాపన బుధవారం సాయంత్రం జరగబోతోంది.


పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. పెట్టుబడులు, పరిశ్రమలను సాధించేందుకు రేవంత్ 12 రోజుల పాటు అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. 3వ తేదీన బయలుదేరిన రేవంత్ బృందం 14వ తేదీన హైదరాబాద్ చేరుకున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ రాష్ట్రానికి చేరుకునే సమయానికి హైదరాబాద్ లో ఒక భారీ ఐటి సంస్ధ భూమిపూజ నిర్వహణకు సిద్ధమైపోయింది. ప్రపంచ ఐటి కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ సంస్ధ హైదరాబాద్ లో రెండో సెంటర్ ఏర్పాటుకు తెలంగాణా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో రెండో సెంటర్ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించిన శంకుస్ధాపన బుధవారం సాయంత్రం జరగబోతోంది. దీనికోసం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్ లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న రేవంత్ విన్నపాన్ని సీఈవో అంగీకరించారు. అంగీకరించటమే కాకుండా వెంటనే యాక్షన్లోకి దిగేశారు. ఈనెల 5వ తేదీన న్యూజెర్సీలోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయంలో రవికుమార్-రేవంత్ మధ్య భేటీ జరిగింది. ఆ సమయంలోనే హైదరాబాద్ లో రెండో సెంటర్ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ఆసక్తిచూపింది.

కోకాపేటలో ఏర్పాటుచేయబోయే సెంటర్లో సుమారు 15 వేలమందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది. ఈ సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. రేవంత్ భేటీ అయిన పదిరోజుల్లోనే యాజమాన్యం రెండో సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటమే కాకుండా భవన నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తుండటం శుభపరిణామమనే చెప్పాలి.

దేశం మొత్తంమీద 1994లో మొదటగా కాగ్నిజెంట్ సెంటర్ చెన్నైలో ఏర్పాటైంది. అక్కడ మొదలైన సంస్ధ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. 2002లో హైదరాబాద్ లోని ఐటి కారిడార్లో ఏర్పాటైన సంస్ధకు ఇఫుడు ఐదు క్యాంపసులున్నాయి. హైదరాబాద్ క్యాంపస్ లో 57 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణా ఐటి రంగంలో అత్యధికంగా ఉద్యోగాలున్న సంస్ధగా కాగ్నిజెంటుకు మంచి ట్రాక్ రికార్డుంది. గడచిన రెండేళ్ళల్లో 7500 ఫ్రెషర్స్ కు ఉద్యోగాలిచ్చింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ రు. 7500 కోట్ల ఎగుమతులను రికార్డుచేసింది. ఇంతమంచి ట్రాక్ రికార్డున్న కాగ్నిజెంట్ కోకాపేటలో రెండో సెంటర్ ఏర్పాటులో 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించబోతోందంటే రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ అనే చెప్పాలి.

Read More
Next Story