రేవంత్ పట్టేమిటో ‘ఢిల్లీ టూర్’ చాటిచెప్పిందా ?
x
Revanth and Rahul Gandhi

రేవంత్ పట్టేమిటో ‘ఢిల్లీ టూర్’ చాటిచెప్పిందా ?

తాజా టూర్ వల్ల రేవంత్ ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లుగా సక్సెస్ సాధించారని చెప్పవచ్చు


అనుమానమే అవసరంలేదు ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అధిష్ఠానం దగ్గర తన పట్టును చాటిచెప్పింది. తాజా టూర్ వల్ల రేవంత్ ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లుగా సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. మొదటిదేమో రేవంత్ కు రాహుల్ గాంధి(Rahul Gandhi) అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదన్న కేటీఆర్ అండ్ కో ప్రచారం తప్పని నిరూపణ అయ్యింది. రెండోది ఏమిటంటే తనపైన ఫిర్యాదులు చెప్పటానికి ఢిల్లీకి వెళ్ళే వ్యతిరేక వర్గానికి రేవంత్ చెక్ చెప్పినట్లయ్యింది. రేవంత్ ను రాహుల్ దూరంగా ఉంచుతున్నారని, కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదని కేటీఆర్ పదేపదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. తొందరలోనే రేవంత్(Revanth) పోస్టు ఊడిపోతుందని ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలకు, నిరాధార ప్రచారం రేవంత్ ఢిల్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంతో పటాపంచలైపోయింది.

రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు రాహుల్, ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఇద్దరూ హాజరయ్యారు. తాజా టూరులో అధిష్ఠానం దగ్గర రేవంత్ కు మంచి పట్టుందన్న విషయం నిరూపణ కావటంతో పార్టీలోని వ్యతిరేకవర్గం కూడా జోరు తగ్గించటం ఖాయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో రేవంత్ కు ఉన్న క్రేజ్ మిగిలిన నేతలకు లేదు. మిగిలిన నేతలకన్నా రేవంత్ కు ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే కేసీఆర్ కుటుంబంతో రాజీలేని పోరాటంచేయటం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రేవంత్ ఇబ్బందిపడినట్లుగా మరే కాంగ్రెస్ నేత ఇబ్బందులు పడలేదు. వివిధ కారణాలతో రేవంత్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి జైలుకు పంపించింది. రేవంత్ క్యాబినెట్ లోని కొందరు మంత్రులు బీఆర్ఎస్(BRS) కీలకనేతలతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

అందుకనే కేటీఆర్(KTR), హరీష్(Harish) లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోని డెవలప్మెంట్లను, ప్రభుత్వంలోని అంతర్గత విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటు రేవంత్ పైన అన్నీ కోణాల్లో మాటలతో దాడులుచేస్తున్నారనే టాక్ పార్టీలోనే ఉంది. రేవంత్ కు వ్యతిరేకంగా ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు సొంతపార్టీలోనే కొందరు నేతలు వ్యతిరేకంగా తయారయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది. రేవంత్ కు రాహుల్ అపాయిట్మెంట్లు ఇవ్వటంలేదు, మాట్లాడటానికి కూడా ఇష్టపడటంలేదని కేటీఆర్ పదేపదే కామెంట్లు చేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అందరికీ తెలిసిందే. కేటీఆర్ తో పాటు పార్టీలోని వ్యతిరేక నేతల ప్రచారానికి చెక్ పెట్టేలా తాజా ఢిల్లీ టూర్ జరిగింది.


బీసీ రిజర్వేషన్లపై రేవంత్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు సోనియాగాంధి(Sonia Gandhi) తప్ప పార్టీలోని మిగిలిన అగ్రనేతలంతా హాజరయ్యరంటేనే రేవంత్ కు వాళ్ళిస్తున్న ప్రయారిటి అర్ధమైపోతోంది. దాదాపు 40 నిముషాలు సాగిన ప్రజంటేషన్లో రాహుల్ గాంధి, ప్రియాంకగాంధితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఓపికగా కూర్చోవటమే ఆశ్చర్యం. నిజానికి అన్నా, చెల్లెళ్ళు ఇద్దరు ఒక సమావేశానికి హాజరవటం అరుదనే చెప్పాలి. అలాంటిది ఇద్దరూ హాజరవ్వటమే కాకుండా రేవంత్ ప్రసంగాన్ని సాతం విన్నారు. తాజా పరిణామాలు చూసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దగ్గర రేవంత్ ప్రయారిటి ఏమీ తగ్గలేదని జరుగుతున్న వ్యతిరేక ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోయింది.

వాస్తవం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానంకు కూడా రేవంత్ స్ధాయి నేత తెలంగాణ కాంగ్రెస్ లో లేరనే చెప్పాలి. రేవంత్ కు ఉన్న వాగ్దాటి, చొరవ, ప్రజాకర్షణ ముందు మిగిలిన నేతలు నిలబడలేరు. కేసీఆర్ ఫ్యామిలితో ఎలాంటి అవగాహన లేకుండా నిఖార్సయిన ఫైట్ చేస్తుండటమే రేవంత్ కు జనాల్లో క్రేజ్ సంపాదించింది.

అయితే రేవంత్ లో మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే మెజారిటి ఎంఎల్ఏలు, మెజారిటి మంత్రుల్లో రేవంత్ కు ఉన్న పట్టును అధిష్ఠానం సహించదు. ఏ అధిష్ఠానం కూడా తన ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిన నేతలు స్వతంత్రంగా వ్యవహరించేంతస్ధాయికి చేరుకుంటున్నారంటే సహించదు. అలాగే రాష్ట్రంలోని పార్టీ, ఎంఎల్ఏలపై గట్టిపట్టు ఉన్న నేతలు కూడా అధిష్ఠానానికి రుచించదు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పద్దతి దశాబ్దాలుగా కంటిన్యు అవుతునే ఉంది. అధిష్ఠానం జోక్యంలేకుండా స్వతంత్రంగా వ్యవహరాలు నడిపింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) మాత్రమే. అలాంటి పరిస్ధితి మళ్ళీ రిపీట్ కావాలని ఏ అధిష్ఠానమూ కోరుకోదు, రిపీటవుతుంటే చూస్తు ఊరుకోదు. కాబట్టే రేవంత్ జోరుకు అధిష్ఠానం స్పీడు బ్రేకర్లను పెడుతోంది. మంత్రివర్గ విస్తరణ, ఎంఎల్సీల ఎంపికలో స్పీడ్ బ్రేకర్లను స్పష్టంగా బయటపడ్డాయి. పై రెండు సందర్భాల్లోను రేవంత్ అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకోలేకపోయారు.

ఏదేమైనా కొంతకాలం పాటు అధిష్ఠానం రేవంత్ మీద ఆధారపడక తప్పేట్లులేదు. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో రేవంత్ సాయం అధిష్ఠానానికి చాలా అవసరం. కాబట్టి ఇప్పటికిప్పుడు రేవంత్ పదవికి వచ్చిన ముప్పు ఏమీలేదనే అనుకోవాలి. కాని కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేమి జరగుతుందో ఎవరూ చెప్పలేరన్న విషయం అందరికీ తెలిసిందే.

Read More
Next Story