
బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అనేందుకు ఆధారాలు చూపించిన రేవంత్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) ఉపఎన్నిక సందర్భంగా రేవంత్ లేవనెత్తిన ఒక అంశం కీలకంగా మారింది
ఎప్పటినుండో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో తనఓట్లను కేసీఆర్(KCR) బీజేపీ(Telangana BJP)కి వేయించారు కాబట్టే కమలంపార్టీ 8 సీట్లలో గెలిచిందని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) ఉపఎన్నిక సందర్భంగా రేవంత్(Revanth) లేవనెత్తిన ఒక అంశం కీలకంగా మారింది. బుధవారం తనను కలసిన పాస్టర్లతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని చెప్పాడు. దీనికి ఆధారం ఏమిటంటే కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిపై విచారణకు సీబీఐకి కేసును రాష్ట్రప్రభుత్వం అప్పగించి మూడునెలలు అయినా ఇప్పటివరకు కేంద్రం ఉలకటంలేదు పలకటంలేదన్నాడు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి కోరుతు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం ఫైల్ పంపితే ఇంతవరకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ చెప్పాడు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిని సీబీఐ ఎందుకు టేకప్ చేయలేదు ? కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వలేదు ? అని రేవంత్ సీరియస్ గా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని రేవంత్ ఎన్నికల రోడ్డుషోలో కూడా ప్రశ్నిస్తున్నారు.
పై రెండు కేసుల్లో సీబీఐ, గవర్నర్ వైఖరి కారణంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనేందుకు సాక్ష్యాలు ఇంతకన్నా ఇంకేమి కావాలని తనను కలసిన పాస్టర్లను రేవంత్ ప్రశ్నించాడు. రెండుపార్టీల విలీనానికి ప్రయత్నాలు జరిగాయన్న కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను కూడా రేవంత్ గుర్తుచేశారు. ఈ రెండుపార్టీలు కుమ్మక్కయి జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రయోగశాలగా మార్చేసినట్లు రేవంత్ మండిపడ్డాడు.
క్రైస్తవ సంఘాల సమస్యలను వినిపించేందుకు ప్రతినిధులు రేవంత్ తో భేటీ అయ్యారు. వాళ్ళ సమస్యలను విన్న రేవంత్ భరోసా ఇచ్చాడు. అలాగే మైనారిటీల సంక్షేమానికి, భద్రతకు రాహుల్ గాంధి భరోసా ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశాడు. రేవంత్ భరోసా విన్నతర్వాత ఉపఎన్నికలో క్రిస్తియన్ల మద్దతు కాంగ్రెస్ కే ఉంటుందని పాస్టర్లు హామీ ఇచ్చారు.

