
Revanth Reddy | ‘బీసీ రిజర్వేషన్‌కు మూడు మార్గాలు’
బీసీ రిజర్వేషన్ కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న సీఎం రేవంత్.
బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం అన్ని విధాలా పోరాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నామని, సాయంత్రం వరుకు లభించకపోతే రాష్ట్రపతిపై ప్రధాని ఒత్తిడి తెచ్చారనే భావించాల్సి ఉంటుందని రేవంత్ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేవంత్ సహా తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో ‘పోరుబాట’ పేరిట ధర్నా చేస్తున్నారు. బుధవారం భారీ ఎత్తున ఈ ధర్నా చేశారు. మూడు రోజులు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ బిల్లు ఆమోదానికి మూడు మార్గాలు ఉన్నాయని కూడా చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు ఆమోదం లభించని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గం చూడాలని అభిప్రాయపడ్డారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు అందుతున్నాయన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రేవంత్ తోసిపుచ్చారు. కిషన్ ముందుగా చట్టాన్ని చదవాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మా ఆఖరి పోరాటం చేశాం..
బీసీ రిజర్వేషన్ల కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో మాకు విపక్షాల నుంచి సర్టిఫికెట్ ఏమీ అవసరం లేదు. జంతర్‌మంతర్ వేదికగా మా గళాన్ని గట్టిగా వినిపించాం. మా వాయిస్ దేశమంతా వినిపించింది. ఈ విషయంలో మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీనే. బీసీలకు తమ పార్టీనే న్యాయం చేస్తుందన్న బీజేపీ నాయకులు.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు కేంద్రంతో చర్చలు చేయట్లేదు. ఈ బిల్లు ఆమోదానికి ఎందుకు కృషి చేయట్లేదు’’ అని ప్రశ్నించారు రేవంత్.
ప్రత్యామ్నాయమే గతి..
‘‘బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలా కృషి చేశాం. సెప్టెంబర్ 31 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తేదీ దగ్గర పడుతోంది. ఆ లోపు రిజర్వేషన్లు అమలు కాకుంటే.. ఎన్నికల నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాల్సిందే’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. బీసీల కోసం పోరాటం చేస్తామంటున్న బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కపట ప్రేమ ఒలకబోస్తున్నాయని, నిజంగా బీసీలంటే అంత ప్రేమ ఉన్నవారు.. ఢిల్లీలో తాము చేపట్టిన ధర్నాకు ఎందుకు మద్దతు ఇవ్వలేని నిలదీశారు.
మూడు మార్గాలు ఇవే..
బీసీ రిజర్వేషన్లకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించామని రేవంత్ చెప్పారు. ఇంకా బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ దగ్గర మూడు మార్గాలు ఉన్నాయని రేవంత్ వెల్లడించారు. ‘‘రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలి. జీవో ఇస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. కాబట్టి జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదు. స్థానిక సంస్థలను వాయిదా వేయడం రెండో మార్గం. అదే చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయి. నిధులు ఆగితే గ్రామాల్లో వ్యవస్థలు కుదేలవుతాయి. ఇక ముచ్చటగా మూడో మార్గం.. పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం. ఈ పద్దతిని అవలంబించేలా ఇతర పార్టీలపై కూడా ఒత్తిడి తెస్తాం’’ అని రేవంత్ వివరించారు.