తెలంగాణలో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు
x

తెలంగాణలో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు

ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందించామని, మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు..


తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం ఫైర్‌ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ ను సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు చెప్పారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ... గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందుకొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారన్నారు.

ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందించామని సీఎం వెల్లడించారు. మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం అని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామన్నారు.

ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతుందని సీఎం స్పష్టం చేశారు. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించామన్నారు. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామని పేర్కొన్నారు. "ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతాం. నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటా" అని సీఎం రేవంత్ రెడ్డి యువతకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం తోపాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story