
రంగరాజన్‌కు సీఎం రేవంత్ ఫోన్
ఇలాంటి దాడులను తమ ప్రభుత్వం సహించదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రేవంత్.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై గత శుక్రవారం అంటే ఫిబ్రవరి 7న దాడి జరిగింది. రామ రాజ్య స్థాపనకు సహకరించాలన్న రఘువీరారెడ్డి ప్రతిపాదనను తిరస్కరించడంతో రంగరాజన్‌పై దాడి చేశారు. ఈ ఘటన రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. దాంతో పాటుగానే ఇందులో అనేక వాస్తవాలు ఇంకా చీకటిలోనే ఉన్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో చిలుకూరి ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయనను పరామర్శించారు. ఇలాంటి దాడులను తమ ప్రభుత్వం సహించదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రేవంత్. అదే విధంగా అక్కడి పరిస్థితులను పరిశీలించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆదేశించారు.
చిలుకూరుకు మంత్రి కొండా సురేఖ
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు పరామర్శించేందుకు కొండాసురేఖ చిలుకూరు బయలుదేరుతున్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ హితం కోసం అనుక్షణం పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు సరికాదని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఇలాంటి దాడులను సహించదని హెచ్చరించారు. రామరాజ్యం పేరుతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కూడా ఘాటుగా స్పందించారు.
ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది: శ్రీధర్ బాబు
‘‘రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు మరియు నిర్వాహకులు అయిన సౌందర్య రాజన్ గారి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది హేయమైన చర్య, రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదు. రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాలపడడం దుర్మార్గం వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటు రామరాజ్యం అని చెప్పడం క్షమించని నేరం అంతే కాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్య. కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అమానుషం. ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించదు.. కఠినంగా వ్యవహరిస్తాం..’’ అని పునరుద్ఘాటించారు.