
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇరకాటంలో పడిన రేవంత్ రెడ్డి
అన్నీ కోణాల్లో గవర్నర్ చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఈరోజో లేకపోతే రేపో ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకంపెడతారని రేవంత్ అనుకున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పెద్ద ఇరకాటంలో పడిపోయారు. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వర్తింపచేసేందుకు క్యాబినెట్ ద్వారా ఆర్డినెన్స్ రెడీ చేయించిన విషయం తెలిసిందే. దాదాపు రెండువారాలకుపైగా సదరు ఆర్డినెన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర పెండింగులో ఉండిపోయింది. న్యాయ, రాజ్యాంగనిపుణులతో గవర్నర్ చర్చలు జరిపారు. అన్నీ కోణాల్లో గవర్నర్ చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఈరోజో లేకపోతే రేపో ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకంపెడతారని రేవంత్ అనుకున్నారు. అయితే అనూహ్యంగా గవర్నర్ ఆ ఆర్డినెన్స్ ను కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపారు. ఆర్డినెన్సును కేంద్రహోంశాఖకు పంపటం అంటే దాదాపు కోల్డ్ స్టోరేజిలో వేసేయటమనే అనుకోవాలి.
ఎందుకు కోల్డ్ స్టోరేజి అని అంటున్నామంటే దాదాపు మూడునెలల క్రితం బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టాలని గవర్నర్ సంతకం అయిన బిల్లును రేవంత్(Revanth) ప్రభుత్వం రాష్ట్రపతికి పంపింది. అప్పటినుండి ఆ బిల్లు పరిస్ధితి ఏమైందో ఎవరికీ తెలీదు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లును(BC Reservations) ఎన్డీయే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బిల్లును పార్లమెంటులో చర్చించి, ఓటింగ్ ద్వారా పాస్ చేయించి రాజ్యంగసవరణలుచేసి ఎన్డీయే ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో పెడుతుందని ఎవరూ అనుకోవటంలేదు. అందుకనే ఆ బిల్లు మీద ఆశలు వదిలేసుకున్న రేవంత్ క్యాబినెట్ ఆర్డినెన్సును ఇష్యూచేసింది. చివరకు ఈ ఆర్డినెన్స్(BC Ordinance) కూడా ఢిల్లీకే చేరటంతో ఇపుడు దాని పరిస్ధితి ఏమిటనేది అయోమయంగా తయారైంది.
ఇపుడు రేవంత్ కు వచ్చిన సమస్య ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇచ్చిన హామీని ఇపుడు అమలుచేయకపోతే ఎన్నికల్లో బీసీలు ఏవిధంగా రియాక్టవుతారో ఊహించలేకపోతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ మోసంచేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao), కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి(G.Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికల్లో హామీఇచ్చి మాటతప్పిన రేవంత్ మీద కోపంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీలు ఓట్లేస్తే పార్టీ దారుణంగా దెబ్బతినటం ఖాయం. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్ధానికసంస్ధల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే జూలై 25 తేదీలోగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల రిజర్వేషన్లను ఖరారుచేయాలని కూడా హైకోర్టు చెప్పింది. గవర్నర్ ఆర్డినెన్సు మీద సంతకం చేయకుండా ఢిల్లీకి పంపటంతో రిజర్వేషన్ల ఖరారు సాధ్యంకాలేదు.
ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం అయితేనే ఆర్డినెన్స్ చట్టంరూపంలో అమల్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమీషన్ రిజర్వేషన్లను ఖరారు చేయగలదు. రిజర్వేషన్లు ఖరారు అయితేకాని ఎన్నికలు పెట్టేందుకు లేదు. సో, గవర్నర్ సంతకం కాలేదుకాబట్టి రిజర్వేషన్ల ఖరారుకాలేదు. రిజర్వేషన్లు ఖరారుకాలేదు కాబట్టి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు లేదు. ఈమొత్తంచూస్తే ఇవన్నీ కూడా రేవంత్ ను ఇరుకునపెట్టేందుకే జరగుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ పై కేంద్రహోంశాఖ ఎప్పుడు స్పందిస్తుందో తెలీదు. న్యాయ, రాజ్యంగనిపుణులతో చర్చలు జరిపి కేంద్రహోంశాఖ ఇప్పట్లో నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు తక్కువే. ఎందుకంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ఆగష్టు నెల 12వ తేదీవరకు జరుగుతాయి కాబట్టి తెలంగాణ గవర్నర్ పంపిన ఆర్డినెన్సును కేంద్రప్రభుత్వం పట్టించుకునేంత సీన్ లేదు. మరి రేవంత్ ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి ? ఈ విషయాన్నే రేవంత్ ప్రభుత్వం సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతున్నది.
ఒకమార్గముంది
ఇపుడు రేవంత్ ముందు ఒకే ఒక మార్గముంది. అదేమిటంటే చట్టబద్దంగా కాకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలుచేయటం. ఈ మార్గం ముందునుండి అనుకుంటున్నదే. ఇపుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 22 శాతం. ఈ 22శాతానికి పార్టీపరంగా అదనంగా మరో 20శాతం కలిపి మొత్తం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు బీసీకులసంఘాల నేతలు అంగీకరిస్తారా ? అన్నదే కీలకమైన పాయింట్. ఎందుకంటే 2023 ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పింది చట్టబద్దంగానే కాని పార్టీపరంగా కాదు. పార్టీపరంగా అమలుచేసేట్లయితే 42 శాతమే ఎందుకు ఇంకా ఎక్కువ శాతాన్నే అమలుచేయచ్చు అడ్డు ఏముంటుంది ? 42శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా అమల్లోకి వస్తే భవిష్యత్తులో దీన్ని ఏ ప్రభుత్వం కూడా మార్చేందుకు ఉండదు. అందుకనే 42శాతం రిజర్వేషన్లను బీసీలు చట్టబద్దంగా అమలుచేయమని డిమాండ్ చేస్తున్నారు.
50శాతానికి మించకూడదు
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రింకోర్టు తీర్పుంది. ఆ తీర్పుప్రకారం ఇపుడు ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే మొత్తం రిజర్వేషన్లు 70శాతంకు చేరుకుంటుంది. రిజర్వేషన్లు 70శాతం అన్నది సుప్రింకోర్టు తీర్పుకు విరుద్ధం. కాబట్టి రేవంత్ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చెల్లవు. ఒకవైపు బిల్లు కేంద్రం దగ్గర పెండింగులో ఉంది. ఇంకోవైపు రేవంత్ క్యాబినెట్ పంపిన ఆర్డినెన్సును గవర్నర్ కేంద్రహోంశాఖకు రెఫర్ చేశారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తోంది. చివరకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగానే కావాలని బీసీ సంఘాల నేతల డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇన్ని సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో అర్ధంకాక రేవంత్ దిక్కులుచూస్తున్నాడు. చివరకు ఏమవుతుందో చూడాలి.