సాక్ష్యాలతో కేసీఆర్ పై రేవంత్ కౌంటర్ అటాక్
x

సాక్ష్యాలతో కేసీఆర్ పై రేవంత్ కౌంటర్ అటాక్

కేసీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు. గతేడాది ఇచ్చిన ప్రకటనని సాక్ష్యంగా చూపించి కేసీఆర్ ని అటాక్ చేశారు.


కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు. గతేడాది ఇచ్చిన ప్రకటనని సాక్ష్యంగా చూపించి కేసీఆర్ ని అటాక్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెలవుల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న వేళ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒకరికొకరు మాటల యుద్ధం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

నీటి ఎద్దడి వల్లే ఓయూ కి సెలవులు కేసీఆర్...

"రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై గత 4 నెలలుగా తెలంగాణ సీఎం, డీసీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ చీఫ్ వార్డెన్ నోటీసులో వారి వాదనలన్నీ వాస్తవమేనని నిర్ధారించారు. తెలంగాణలో విద్యుత్, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవం" అంటూ కేసీఆర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

కేసీఆర్ ని చూస్తే గోబెల్ మళ్ళీ పుట్టాడనిపిస్తోంది -రేవంత్

కేసీఆర్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) లో ఓ ట్వీట్ చేశారు. "కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్ లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు.

కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఓయూకి సెలవులు ఇవ్వడంపై కేసీఆర్ ఎక్స్ లో కాంగ్రెస్ సర్కార్ ని విమర్శించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు" అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారు.


అసలు ఓయూ లో ఏం జరుగుతోంది...

మే 1 నుంచి మే 31 వరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా వర్సిటీకి సెలవులు ఇస్తున్నట్టే ఈ ఏడాది కూడా సెలవులు ఇస్తున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, వేసవిలో ఉండే నీటి కొరత, కరెంటు కోతల గురించి కూడా నోటీసుల్లో పేర్కొనడం రాజకీయ దుమారానికి తెరతీసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కష్టాలు, నీటి కష్టాలు ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం అని ప్రతిపక్షాలు రేవంత్ సర్కార్ పై సెటైర్లు వేస్తున్నారు.

పరీక్షలున్నాయి.. సెలవులొద్దు...

ఓయూ విద్యార్థులు మాకు సెలవులొద్దు, మెస్, హాస్టళ్లు మూసివేయొద్దు, మాకు పోటీ పరీక్షలున్నాయి, ప్రిపేర్ అవ్వాలి అంటూ చీఫ్ వార్డెన్ ప్రకటనకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అయితే ఇది కొత్తేమి కాదు. కొన్నేళ్లుగా వర్సిటీకి సెలవులు ప్రకటించడం, విద్యార్థులు ఆందోళన చేయడం, వారిని బలవంతంగా తరలించడం మామూలే.

విద్యుత్, నీటి కొరతపై చీఫ్ వార్డెన్ క్లారిటీ...

ప్రతియేటా వర్సిటీకి వేసవి సెలవులు ఇలాగే ఇస్తాము. ఉత్తర్వుల్లో నీటి కొరత, విద్యుత్ కొరత అంశాలు ప్రస్తావిస్తాము. గతేడాది ఉత్తర్వుల్లో కూడా వీటి గురించి ప్రస్తావించామని ఓయూ చీఫ్ వార్డెన్ తెలిపారు.

విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు ఓయూలో లేవు -భట్టి

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, తాగునీటి సమస్యలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కంటిన్యూగా విద్యుత్ సరఫరా జరుగుతున్నట్టు డిజిటల్ మీటర్ లో కూడా రీడింగ్ నమోదైందని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్ కి ఓయూ రిజిస్ట్రార్ ద్వారా షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.

Read More
Next Story