
రిజర్వేషన్లకు కేంద్రాన్ని ఒప్పిస్తాం: కిషన్ రెడ్డి
కుల గణన చేశామంటూ గప్పాలు చెప్పుకుంటున్న కాంగ్రెస్.. సర్వేను పూర్తి చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
కుల గణన చేశామంటూ గప్పాలు చెప్పుకుంటున్న కాంగ్రెస్.. సర్వేను పూర్తి చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పైగా ప్రతి లెక్క పక్కాగా ఉందంటూ కహానీలు చెప్తున్నారని, అంత పక్కాగా లెక్క ఉంటే మళ్ళీ రెండో విడత సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేను ఒక్క బీసీ సంఘం కూడా సమర్థించడం లేదని, ఈ లెక్కల ప్రకారం తమకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఘంటాపథంగా చెప్తున్నాయని గుర్తు చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీజేపీ పూర్తిగా సమర్థిస్తుందని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి చేసి, బీసీ సంఘాలు దానిని సమర్థిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు వరంగల్‌లో కిషన్ రెడ్డి పర్యటించారు.. ఈ సందర్భంగా కుల గణన, కాంగ్రెస్ పాలనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ కులమేంటో సీఎం చెప్పాలి
‘‘రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీది ఏ కులమో రేవంత్ రెడ్డి చెప్పాలి. త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. బిజీ షెడ్యూల్ వల్ల రాష్ట్ర అధ్యక్షుని నియామకం లేట్ అవుతోంది. మాకు బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టేందుకు భయపడుతోంది. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధం ఉంది. తెలంగాణలో రూ.10లక్షల కోట్ల నిధులు మేము ఖర్చు చేశాము’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ లాంటి సీఎం దేశంలోనే లేరు
‘‘కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి చేయలేదు. ఇచ్చిన హామీలు అమలుచేయాలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజా వ్యతిరేకతను మరల్చేందుకు లేని విషయాలను సీఎం మాట్లాడుతున్నాడు. దేశంలో ఏ సీఎం కూడా ప్రతీ వారం డిల్లీకి వెళ్లరు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ వారం డిల్లీలో అటెండెన్స్ వేసుకోవాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు గడ్డు కాలమే. మోడీ పైన, కేంద్రంపైన మాట్లాడినంత మాత్రాన నీ వైఫల్యాలు ప్రజలు మార్చిపోరు. రాబోయే రోజుల్లో నీ వైఫల్యాలపై బీజేపీ పోరాటం చేస్తుంది’’ అని అన్నారు.
కేసీఆర్ బాటలోనే రేవంత్
‘‘ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. వనరులు సమకూర్చుకునే అంశంలో ప్రణాళిక లేదు. ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు రోడ్డు మ్యాప్ కూడా లేదు. గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్లు కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఘాటుగా, ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు, దొందూ దొందే’’ అని చురకలంటించారు.
కాంగ్రెస్ గెలుపుకు అదే కారణం
‘‘రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకత కారణంగా సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేవంత్ రెడ్డి ప్రసంగాలకు ఆకర్షితులై కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోలేదు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు ప్రజలకు పదేళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 12 నెలల్లోనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు’’ అని విమర్శించారు.
‘‘కాంగ్రెస్‌ను, బీఆర్‌ఎస్‌ను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రతిపక్షం, ప్రశ్నించే గొంతు ఉండొద్దని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులను పార్టీలో చేర్చుకొని శాసన మండలిని నీరుగార్చారు. శాసన మండలిలో మేధావులు, విద్యావంతులు ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తారు. అందుకే శాసన మండలిని రాజ్యాంగ నిపుణులు ఏర్పాటు చేశారు. శాసనసభ చేసిన చట్టాలపై మేధావులైన మండలి సభ్యులు సూచనలు చేసేవారు. ప్రజల గుండె చప్పుడు వినిపించే మండలిని తన భజన చేసే సభగా కేసీఆర్ మార్చారు’’ అని ఎద్దేవా చేశారు.