Revanth Reddy | ‘పేదల కల నేరవేర్చడానికే ఇందిరమ్మ ఇళ్లు పథకం’
x

Revanth Reddy | ‘పేదల కల నేరవేర్చడానికే ఇందిరమ్మ ఇళ్లు పథకం’

ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి పేదవాడు కనే కల. దానిని నెరవేర్చడానికే తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి పేదవాడు కనే కల. దానిని నెరవేర్చడానికే తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొస్తోందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఈరోజు సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులను ఎంపిక చేయడం కోసం రూపొందించిన యాప్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. రోటీ, కపడా, మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని తెలిపారు. వ్యవసాయ భూమి, సొంతిళ్లు ఉండటాన్ని ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంగా భావిస్తారని, అది గమనించే దశాబ్దాల క్రితమే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, భూ పంపిణీని చేపట్టారని వివరించారు. దేశంలో గుడి లేని ఊరైనా కనిపిస్తుందేమో కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు మాత్రం ఉండదు అని రేవంత్ వ్యాఖ్యానించారు. రూ.10వేలతో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకుందని, ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదోడికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, గతంలో కేసీఆర్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను రద్దు చేశారని, దానిని తమ ప్రభుత్వం పునరుద్దరించిందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు అందించామని సీఎం తెలిపారు.

‘‘ఈ సంవత్సర కాలంలో అందరి సహకారంతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. పేదవారు ఆత్మ గౌరవంతో బతకాలి. ఆనాడే ఈ విషయాన్ని ఇందిరా గాంధీ గుర్తించారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. తద్వారా పేదవారికి భూ పంపిణీ ద్వారా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈరోజు ఏ గ్రామంలో చూసినా దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికను AI సాయం ద్వారా నిజమైన అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటి నిర్మాణంలో ఎలాంటి డిజైన్ల షరతులు లేవు. లబ్ధిదారుల వారికి అనుకూలంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. మొదటి సంవత్సరం 4 లక్షల 59వేల ఇళ్లు నిర్మించనున్నాం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు అనుమతుల మంజూరు చేశఆం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు. మేము ఇల్లు కట్టి ఇస్తాము.. మీరు పెళ్ళిళ్లు చేయండి. గిరిజనులు, పారిశుధ్య కార్మికులు, అత్యంత పేదవారికి ప్రాధాన్యం ఇస్తాం. పైరవీలకు తావులేకుండా అర్హుల ఎంపిక. ఐటీడీఏ ఆదివాసీల ప్రాంతాలకు అదనంగా ఇళ్ళు మంజూరు చేస్తాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న కానుకే ఈ ఇందిరమ్మ ఇల్లు అన్నారు.

ఇదొక మహత్తర కార్యక్రమం: భట్టి

‘‘మా ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రజలకు కానుకగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నాం. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇళ్లు నిర్మించే మహత్తర కార్యక్రమం ఇది. ప్రజల అవసరాలు తీర్చడం, వారి ఆత్మ గౌరవాన్ని పెంచడం కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని చేపట్టాం. రూ.7లక్షల కోట్ల అప్పుల భారం మా మీద గత ప్రభుత్వం వేసినా.. వారు చేసిన అప్పులు చెల్లిస్తూనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. కొద్ది మంది ప్రభుత్వం చేసే మంచిపనులను అడ్డుకొని ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం చేయలేని విధంగా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ కడుతున్నాం. విద్యార్థుల డైట్ చార్జీలు 40%పెంచాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క విద్యార్ధికి ఇబ్బంది రానివ్వం’’ అని భరోసా ఇచ్చారు ఢిప్యూటీ సీఎం

టార్గెట్ రీచ్ అవుతాం: పొంగులేటి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలో వెళ్ళిన సందర్భంలో గ్రామ గ్రామాన వెళ్ళిన సందర్భంలో ఇందిరమ్మ ఇళ్లు చూపించి సంతోష పడ్డారు. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని భావించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న 10 ఏళ్లలో పేదలను విస్మరించారు. మిగితా ఇళ్లను పునరుద్ధరించి 30,000 ఇళ్లను కేటాయిస్తున్నాము. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టి పేదవాడికి ఇవ్వడం జరుగుతుంది. వారిలో దివ్యాంగులు, వితంతువులు, రైతుకూలీలు ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి పేద వాడికి ఇల్లు ఇస్తాము. ఏ పార్టీ అని కానీ, మళ్ళీ మాకు ఓటు వేస్తావా అని కానీ అడగం. ప్రతి పేద వాడికి ఇల్లు కేటాయిస్తాము. 4 దశల్లో 5లక్షల రూపాయలు కేటాయింపు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు కేటాయింపు చేస్తాము. వరి వేస్తే ఉరి అన్న గత ప్రభుత్వం ఆలోచనలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది’’ అని పొంగులేటి వివరించారు.

Read More
Next Story