‘కేసీఆర్ హయాంలో తీరని అన్యాయం’
x

‘కేసీఆర్ హయాంలో తీరని అన్యాయం’

రాష్ట్ర ప్రభుత్వంపైకి కేటీఆర్ అండ్ కో.. ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి.


బీఆర్ఎస్ నేత కేటీఆర్ అండ్ కో అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తమపైకి ఆటోడ్రైవర్లను కావాలని కేటీఆర్ అండ్ కో రెచ్చగొడుతోందని ఆరోపించారు. వాళ్లు ఎన్ని చేసుకున్నా ప్రజలు తమతోనే ఉన్నారని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, ఈ సందర్బంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రెండేళ్ల విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. వీటిలో మొదటి సభ మక్తల్‌లో జరపారు. అందులో పాల్గొన్న సీఎం రేవంత్.. కీలక అంశాలను లేవనెత్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఉచిత బస్సును విమర్శిస్తున్నారు..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని కొందరు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగానే కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, పేదల కోసం సన్నబియ్యం పంపిణీని కొనసాగిస్తున్నాం అని గుర్తు చేశారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లేందుకు, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

దేశానికి, రాష్ట్రానికి పాలమూరు ప్రాంతాన్ని ఆదర్శంగా మార్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎంత నిధులు కావాలన్నా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇరిగేషన్‌తో పాటు ఎడ్యుకేషన్‌ రంగానికీ తమ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి పేద కుటుంబం నుంచి వచ్చే పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా స్కూళ్లు ప్రారంభించినట్టు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌కు తీరని అన్యాయం

కేసీఆర్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాను పట్టించుకున్న నాథుడే లేరని రేవంత్ అన్నారు. వారి పదేళ్ల పాలనలో జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను నిర్లక్ష్యం చేశారని గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం అన్ని జిల్లాల అభివృద్ధికి ప్రయత్నిస్తోందన్నారు. ఆ దిశగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

విద్యకు పెద్దపీట

విద్యాభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో ఒకటేనని పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.200 కోట్ల వ్యయంతో నెలకొల్పినట్టు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఇద్దరు నేతలు మాత్రమే గెలిచినా, అక్కడి 14 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరిన వెంటనే ట్రిపుల్ ఐటీ కాలేజీని అందించామని, పాలమూరు విశ్వవిద్యాలయంలో అవసరమైన కోర్సులన్నీ ఏర్పాటు చేశామని తెలిపారు.

పాలమూరు జిల్లా విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా మారాలని సీఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను నిరంతరం అమలుచేస్తున్నదని గుర్తుచేశారు. మహిళా సాధికారతపై మాట్లాడుతూ — “మా ఆడబిడ్డలు ఇప్పుడు పెట్రోల్ బంకుల యజమానులయ్యారు, వెయ్యి బస్సులకు యజమానులయ్యారు. హైటెక్ సిటీలో అంబానీ, అదానీ స్థాయిలో మా అక్కలకు వ్యాపార అవకాశాలు వచ్చాయి. ప్రజల ఆశీర్వాదం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి” అని అన్నారు.

Read More
Next Story