Revanth Reddy | మోదీ, అదానీ టార్గెట్‌గా రేవంత్ విమర్శలు..
ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీ టార్గెట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ(PM Modi), వ్యాపారవేత్త అదానీ(Adhani) టార్గెట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీకి అదానీ బాగోగులే తప్ప దేశం పట్టట్లేదంటూ రేవంత్ ధ్వజమెత్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ఎదుట సీఎం రేవంత్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ.. దేశంలో రగులుతున్న సమస్యలపై నోరు విప్పాలని, పార్లమెంటు చర్చకు ఓకే చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న విపక్షాల నోర్లు నొక్కేయడం మానుకోవాలని హితవు పలికారు. అయితే అదానీ అవినీతి అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని, మణీపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ రెండిటికీ అధికారి పక్షం నో చెప్పడంతో వీటిపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్.. తన శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ వరకు ‘చలో రాజ్‌భవన్’ పేరిట బరాీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు అంతా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ ఎదుట బైఠాయించారు. జై కాంగ్రెస్.. జై సోనియాంధీ అని, డౌన్ డౌన్ మోదీ అంటూ వారు నినాదాలు చేశారు. మణిపూర్ అంశంపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ నిరసనలో భాగంగానే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి కేంద్రానికి తెలియజేయాలని కోరారు.
అవినీతి అడ్డాలుకు భారత వ్యాపార వ్యవస్థలు: సీఎం
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత వ్యాపార వ్యవస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ‘‘వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను అంచెలంచలుగా పెంపొందించింది. కానీ ఇప్పుడు అదానీ, ప్రధాని కలిసి ఆ పరువు మొత్తాన్ని గంగలో కలిపేశారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువును తాకట్టుపెట్టారు. మణిపూర్ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ‘చలో రాజ్‌భవన్’ చేపట్టింది’’ అని రేవంత్ అన్నారు.
అదానీపై విచారణ జరగాలి
‘‘అదానీ సంస్థలు ఇక్కడ నడుచుకున్న విధంగానే ప్రాజెక్ట్‌ల కోసం అమెరికాలో కూడా లంచాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి. అది కాస్తా బయటకు రావడంతో అదానీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. భారతదేశ పరువును మంటగలిపిన అదానీపై మన దేశంలో మాత్రం ఎటువంటి విచారణ లేదు. అదానీపై సమగ్ర విచారణ జరగాలి. ఆ విచారణను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నేతృత్వంలో నిర్వహించాలి. అదానీ అవినీతిపై చర్చ, జేపీసీ వేయడానికి కేంద్రం సుముఖత చూపడం లేదు. అలా చేస్తే అదానీ కటకటలా వెనక్కు వెళ్లాల్సి వస్తుందని బీజేపీకి బాగా తెలుసు. అందుకే అదానీని కాపాడటానికి మోదీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ఎదుట ధర్నా చేస్తాం’’ అని రేవంత్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ మద్దతు ఎవరికి?
ఈ సందర్భంగానే ఈ విషయంలో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది ప్రజలకా? అదానీ-ప్రధానికా? అని రేవంత్ ప్రశ్నించారు. ‘‘అరెస్ట్‌ల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీకి బీఆర్ఎస్ దాసోహమైపోయింది. అందుకే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. బీఆర్ఎస్.. ప్రజల వైపు ఉంటుందా? అదానీ-ప్రధాని జేజేలు కొడుతుందా? అనేది తేల్చి చెప్పాలి. మోదీ, కేసీఆర్ వేరువేరు కాదు.. వారిద్దరూ కూడా ఒకే నాణేకి ఉండే బొమ్మాబొరుసు వంటి వారు. బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే అదానీపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయాలి. ఆ పార్టీ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తాం. అదానీపై జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. ప్రధాని మోదీ అండగా నిలిచినా ప్రజా కోర్టులో అదానీని శిక్షే వరకు పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు రేవంత్.