భారీ భూ కుంభకోణానికి తెరలేపి రేవంత్: కేటీఆర్
x

భారీ భూ కుంభకోణానికి తెరలేపి రేవంత్: కేటీఆర్

దాదాపు 9,300 ఎకరాల ఇండస్ట్రీయల్ భూములు స్వాహా చేయడానికి ప్లాన్ వేశారంటూ కేటీఆర్ ఆరోపణలు.


తెలంగాణలో భారీ భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.4-5 లక్షల కోట్లు విలువ చేసే హైదరాబాద్ ఇండస్ట్రీయల్ భూములను స్వాహా చేయడం కోసం రేవంత్ రెడ్డి ముఠా ప్రయత్నిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఇటీవల జరిగిన కొండా సురేఖ ఉదంతం పెద్ద ఉదాహరణ అన్నారు. “రాష్ట్రంలో ఎక్కడ విలువైన భూమి కనిపించినా, రేవంత్‌ రెడ్డి ముఠా అక్కడ వాలిపోతోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల దృష్టి ప్రత్యేకంగా ప్రైమ్‌ లొకేషన్లపై పడుతోంది. బాలానగర్‌ పరిసరాల్లో దాదాపు 9,300 ఎకరాల్లో భారీ భూ దందా కొనసాగుతోంది. బాలానగర్‌, కాటేదాన్‌, జీడిమెట్ల ప్రాంతాల్లోని భూములను తమ అనుకూలులకు అప్పగిస్తున్నారని“ అని కేటీఆర్ ఆరోపించారు. విదేశాల్లో ఉన్న సమయాల్లో కూడా ఈ భూములకు సంబంధించిన ఫైళ్లపై సీఎం ఆదేశాలు జారీ చేశారని కూడా తెలిపారు. ఈ కుంభకోణంలో బీజేపీ కూడా పార్ట్‌నర్‌గా ఉందన్నారు. అందుకే దీనిపై ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదని విమర్శించారు.

భూ కుంభకోణంలో బీజేపీ

ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వంటి వ్యక్తులకు భూములు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారం గురించి తాను పూర్తి వివరాలుతో మాట్లాడుతున్నానని, గాలికి చేస్తున్న ఆరోపణలు కాదని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి భూ కుంభకోణంపై బీఆర్‌ఎస్‌ న్యాయపోరాటం చేస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ భూములు పొందిన వారికి కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్‌ రెడ్డి వలలో పడకూడదని సూచించారు. మెట్రో ప్రాజెక్ట్‌ భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములు కూడా ఈ వ్యవహారంలో లక్ష్యంగా మారాయని చెప్పారు.

ప్రతి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు కొన్ని రాయితీలు ఇవ్వడం సహజమేనని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత పెద్ద భూకుంభకోణానికి నాంది పలికారని కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022లో భూ రెగ్యులరైజేషన్‌ చట్టం తెచ్చి, పూర్తి ఫీజు చెల్లించాలి అనే నిబంధన తప్పనిసరిగా పెట్టినట్లు గుర్తుచేశారు. భూములను ఇతరులకు విక్రయిస్తే 200శాతం ఫీజు తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధన కూడా ఉన్నదన్నారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కనబెట్టి, కేవలం ౩౦ శాతం చెల్లిస్తే సరిపోయేలా ఆదేశాలు ఇచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతుందని కూడా స్పష్టం చేశారు.

Read More
Next Story