‘బీజేపీలో చేరడానికి రేవంత్ రెడీ’.. దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు..?
x

‘బీజేపీలో చేరడానికి రేవంత్ రెడీ’.. దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు..?

మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతానన్న కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరడానికి రేవంత్ రెడీ అంటూ వ్యాఖ్యానించారు.


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు లేని చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. వెంటనే ఈనెల 24న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు కేటీఆర్ హాజరవుతారా కారా అనేది కీలకంగా మారింది. కాగా తాజాగా ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాను తప్పకుండా విచారణకు హాజరవుతానంటూ వెల్లడించారు. తన మాటలను వక్రీకరించి కావాలనే పెద్ద సమస్యగా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని కూడా విమర్శలు గుప్పించారు.

కమిషన్‌ను తెలియజేస్తా

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే మహిళలపై ఎన్నో ఘటనలు జరిగాయి. వాటిని మహిళా కమిషన్‌కు వివరిస్తాను. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నాకు నోటీసులు ఇచ్చారు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. కాబట్టి ఈ విచారణకు తప్పకుండా హాజరవుతా. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను అన్న మాటలను వివరిస్తాను. అదే విధంగా మహిళా ఎమ్మెల్యేలను సీఎం, కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను’’ అని వెల్లడించారు. అనంతరం రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం కానుంది. కేసీఆర్‌కు గవర్నర్ పదవి. కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా, కవితకు బెయిల్‌తో పాటు రాజ్యసభ సభ్యత్వం కూడా కల్పించనున్నారు’ అంటూ ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్‌లో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమ పార్టీ ఎప్పటికీ విలీనం కాదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోదీతో రేవంత్ అదే చెప్పారు: కేటీఆర్

‘‘నా ప్రస్థానం బీజేపీలో మొదలైంది. ఇక్కడే ముగిస్తుందని రేవంత్.. మోదీకి చెప్పారని ఢిల్లీలో ఉన్న సోర్స్ ద్వారా నాకు తెలిసింది. ఈ విషయంపై రేవంత్ రెడ్డే స్పష్టత ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. మోదీని ఒక్క మాట అనాలన్నా రేవంత్ రెడ్డి భయపడుతుండటమే ఇందుకు నిదర్శనమేనని, తాను చనిపోయే ముందు బీజేపీ జెండా కప్పుకునే తుది శ్వాస విడుస్తానని రేవంత్ రెడ్డి.. మోదీకి మాట ఇవ్వడం వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మాకు కేంద్ర మంత్రి పదవులను కూడా రేవంత్ రెడ్డే డిసైడ్ చేస్తున్నారు. కానీ అసలు ఆయనే ముందుకు బీజేపీలో చేరనున్నారు’ అని వ్యాఖ్యానించారు.

రుణమాఫీ అంతా డొల్లే

‘‘రైతు రుణమాఫీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంతా పైనపటారం లోన లొటారమే. అదంతా డొల్లే. రుణమాఫీ వివరాల సేకరణ ఈ నెల 20 నుంచి చేపడతాం. జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం వరకు అందరికీ రుణమాఫీ కాని రైతుల వివరాలు అందిస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష పోరాటం చేస్తాం. రుణమాఫీ పూర్తి అయ్యే వరకు పోరాటాన్ని ఆపేది లేదు. ప్రతి ఒక్కరి నియోజకవర్గం నుంచి వివరాలు తీసుకుంటాం’’ అని తెలిపారు. ఈ అంశంపై పదేపదే ప్రశ్నిస్తున్నారని, దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్న ఉద్దేశంతోనే హరీష్ రావు కార్యాలయంపై దాడి కూడా చేశారంటూ ఆరోపించారు. దాదాపు 50 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22 లక్షల మందికి మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

Read More
Next Story