రేవంత్ కి రాహుల్, అదానీ చిక్కులు
x

రేవంత్ కి రాహుల్, అదానీ చిక్కులు

తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని అదానీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. బీఆర్ఎస్ చేతికి అస్త్రం ఇచ్చారు.


అదానీ గ్రూప్ ఆస్తులపై విచారణకు డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం గన్ పార్క్ నుంచి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. అదానీ గ్రూప్ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు జరపాలని, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్‌పర్సన్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ సెబీతో కుమ్మక్కయ్యిందని ఆరోపించింది. ఈ క్రమంలో అదానీ అక్రమ ఆస్తుల పెంపుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సెబీ చైర్మన్‌ని వెంటనే విధుల నుంచి తొలగించాలని గళమెత్తింది. కాగా, ఈ నిరసన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కి అస్త్రమిచ్చిన రేవంత్?

ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి, ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. "అదానీ మెగా కుంభకోణం పై విచారణ జరపాలి, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి, దోషులకు చట్టపరంగా శిక్షించాలి" అని డిమాండ్ చేశారు. ఇక్కడివరకు బానే ఉంది. కానీ, తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని అదానీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. బీఆర్ఎస్ చేతికి అస్త్రం ఇచ్చారు. ఓవైపు ఆయన గ్రూప్ పై విచారణకి డిమాండ్ చేస్తూ... రాష్ట్రంలోకి ఆయన్ని ఎలా ఆహ్వానిస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. హ్యాష్ ట్యాగ్ స్కాంగ్రెస్ అని పెట్టి ఎద్దేవా చేశారు.

'గల్లీ మే దోస్తీ, డిల్లీ మే కుస్తీ'

ఈ నిరసనపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అదానీ పెట్టుబడులను స్వాగతిస్తూనే.. ఆ గ్రూప్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. 2024 జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నారని, తెలంగాణలో అదానీ కంపెనీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అదానీ గ్రూప్‌ను వ్యతిరేకిస్తూనే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుందని సూచిస్తూ, “గల్లీ మే దోస్తీ, డిల్లీ మే కుస్తీ” అని సెటైర్ వేశారు.

Read More
Next Story