‘ఓట్ల చోరీ’ పోస్టర్ రిలీజ్.. ఈసీకి ఛాలెంజేనా..?
x

‘ఓట్ల చోరీ’ పోస్టర్ రిలీజ్.. ఈసీకి ఛాలెంజేనా..?

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపిచ్చిన తెలంగాణ కాంగ్రెస్. పోస్టర్ విడుదల చేసిన సీఎం, మంత్రులు.


జాతీయ ఎన్నికల కమిషన్‌తో తెలంగాణ కాంగ్రెస్ కయ్యానికి కాలుదువ్వుతోందా? అంటే అవుననే చెప్పాలి. ఇటీవల బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం భారీ సంఖ్యలో ఓట్ల చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ల చోరీ’ అన్న నినాదాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అలా అనడం సరైనది కాదని పేర్కొంది.

అలాంటిది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన తాజా పోస్టర్ ఒకటి.. జాతీయ ఎన్నికల సంఘానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నట్లే ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్‌పై ‘ఓట్ల చోరీ’ అనే ఉంది. పోస్టర్ కూడా అదే అంశానికి సంబంధించింది. ఈ పోస్టర్‌ను కార్యకర్తలో, చిన్నాచితకా నేతలో కాదు.. సీఎం రేవంత్ సహా మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా బడాబడా నేతలు కలిసి విడుదల చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

‘ఓట్ల చోరి’ ప్రచార పోస్టర్‌ను విడుదల చేసిన కాంగ్రెస్.. ఈ విషయంపైనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహంచాలని డిసైడ్ అయింది. అంతేకాకుండా ఓట్లను ఎన్నికల సంఘం ఎలా చోరీ చేసింది అనే విషయాలను ప్రజలకు అర్థయ్యేలా చెప్పడానికి పలు ప్రాంతాల్లో ప్రత్యేక సభలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ అంశానికి సంబంధించే బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. ఈ ఓట్ల చోరీని అడ్డుకుందామని, రాహుల్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుద్దామని పిలుపుకూడా ఇచ్చారు. ఇంతలోనే పోస్టర్‌ను విడుదల చేసి తెలంగాణలో ఓట్ చోరి క్యాంపెయిన్‌ను షురూ చేశారు.

ఛాలెంజ్.. ఈసీకా కేంద్రానికా..?

ఈ క్రమంలోనే మరో చర్చ కూడా తెరపైకి వచ్చింది. ‘ఓట్ చోరి’ పోస్టర్‌ను విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎవర్ని ఛాలెంజ్ చేస్తుంది? ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న జాతీయ ఎన్నికల కమిషన్‌కా..? లేదంటే అలా చేయమని ఆదేశాలిచ్చిందని, ఈసీని మభ్యపెట్టిందని ఆరోపిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీకా? లేదంటే ఈ రెండిటి మధ్య చీకటి పొత్తుందని రాహుల్ ఆరోపించారు కాబట్టి.. ఈ రెండింటికా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే కేంద్రానికి పాలన విషయంలో మద్దతిస్తామన్న రేవంత్.. ఒక్కసారిగా సవాల్ విసరడం కూడా హాట్ టాపిక్‌గా మారుతోంది

విమర్శలు వరదలు..

అయితే ఓట్ల చోరీ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు వరదలు పారుతున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిందంటే అందుకు ఈ ఓట్ల చోరీ, ఈవీఎం ట్యాపరింగ్‌లే కారణమని కాంగ్రెస్ నేతలు విమర్శలపైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఓటర్లు ఎవరికి ఓటేసినా తమకే వచ్చేలా బీజేపీ.. ఈవీఎంలను ట్యాంపర్ చేసిందని, అందుకే వరుసగా మూడోసారి కూడా గెలిచిందని విమర్శించారు. అలా కాకుండా నిజాయితీగా, బ్యాలెట్ పేపర్ల తరహాలో ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలు ఎవరూ కూడా బీజేపీకి ఓటేసేవారు కాదని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా నిజంగానే ఎన్నికల్లో అవకతవకలు చేసి ఉంటే.. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? ఇంతమంది ప్రతిపక్ష ఎంపీలు ఎలా గెలిచి ఉండేవారు? అని బీజేపీ నేతలు ఎదరు ప్రశ్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఓట్ల చోరీ అనదొద్దు..: ఈసీ

ఈసీపై దాడి చేయడానికి ‘ఓట్‌ చోరీ’ వంటి కుళ్లు పదాలు ఉపయోగించడానికి బదులుగా ఆధారాలను సమర్పించాలని కమిషన్ తెలిపింది. 1951-52లో జరిగిన మొదటి ఎన్నికల నుంచి ‘ఒక వ్యక్తికి ఒక ఓటు’ నిబంధన అమలవుతున్నదని వివరించింది. సాక్ష్యాధారాలేవీ లేకుండా భారతీయ ఓటర్లను దొంగలుగా అభివర్ణించడం కన్నా, ఏ వ్యక్తి అయినా ఏదైనా ఎన్నికల్లో వాస్తవంగా ఓటు వేసినట్లు రుజువులు ఉంటే, లిఖితపూర్వక అఫిడవిట్‌తో ఈసీకి సమర్పించాలని తెలిపింది. భారతీయ ఓటర్ల కోసం ‘ఓట్‌ చోరీ’ వంటి కుళ్లు పదాలను వాడటం ద్వారా తప్పుడు కథనాలను సృష్టించే ప్రయత్నం చేయడమంటే, కోట్లాది మంది భారతీయ ఓటర్లపై, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది చిత్తశుద్ధిపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనని తెలిపింది. కానీ ఇప్పుడు రేవంత్ విడుదల చేసిన పోస్టర్‌పై ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Read More
Next Story