‘కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు’
x

‘కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు’

ఉపరాష్ట్రపతి ఎన్నికలో సీఎం రేవంత్ అడ్డంగా దొరికిపోయారన్న పాడి కౌశిక్ రెడ్డి.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్.. బీజేపీకి అమ్ముకున్నారని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండి కూటమి తరుపున నిలబడిన వ్యక్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారని, కానీ సుదర్శన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 300 అని కౌశిక్ రెడ్డి తెలిపారు. తేడా వచ్చిన 15 ఓట్లలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఎనిమిది ఉన్నాయని వ్యాఖ్యానించారు. వారంతా కూడా ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వేశారని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత తమ ఓట్లు బీజేపీకి వేశామని కాంగ్రెస్ ఎంపీలు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌ను, నితిన్ గడ్కరీని కలిశారని అన్నారు కౌశిక్ రెడ్డి. క్రాస్ అయిన 15 ఓట్లలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలవి 8 ఉన్నాయని వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం చేశారు. చంద్రబాబుతో లింక్ పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు. నాకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయాన్ని చెప్పారు. తాము బీజేపీకి ఓటేశామని వెల్లడించారు. రాహుల్ గాంధీ.. ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ల పార్టీ ముఖ్యమంత్రే ఓట్ చోరీకి పాల్పడుతున్నారు. తాను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు మాజీ జస్డి సుదర్శన్ రెడ్డిని కూడా రేవంత్ మోసం చేశారు. చంద్రబాబు, మోడీకి రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి రేవంత్ వెన్నుపోటు పొడిచారు’’ అని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

అమ్ముకోవడం వెన్నతో పెట్టిన విద్య

‘‘రేవంత్ రెడ్డికి అమ్ముకోవడం వెన్నతో పెట్టిన విద్య. తొలుత గ్రూప్-1 పోస్ట్‌లను అమ్ముకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మ్యాన్.. యూరియాను అమ్ముకున్నారు. సీబీఐ, ఐటీ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలని రాహుల్ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణను రేవంత్ ఏమో సీబీఐకే ఇస్తారు. మంత్రులు ఎవరికీ తెలియకుండా కాళేశ్వరం అంశాన్ని రేవంత్.. సీబీఐకి ఇచ్చారు’’ అని ఆరోపించారు. ‘‘రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా..? బీజేపీకి ముఖ్యమంత్రా? అనేది తెలుస్తలేదు. మోదీకి, రేవంత్‌కి ఒప్పందం లేకపోతే గ్రూప్-1 పోస్టుల అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడీ చేసిన బండి సంజయ్.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు’’ అని ప్రశ్నించారు.

Read More
Next Story