ఆపరేషన్ ఆకర్ష్ ముహూర్తం మొదలైనట్లేనా ?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లేనా ? శుక్రవారం జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లేనా ? శుక్రవారం జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రేవంత్ వెళ్ళారు. ముగ్గురు సుమారు అర్ధగంటపాటు మాట్లాడుకున్నారు.
బీఆర్ఎస్ తరపున పోయిన ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్ వాడ నియోజకవర్గం నుండి గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా అంతకుముందు మంత్రిగా కూడా పనిచేసిన పోచారం పార్టీలోనే కాకుండా జిల్లాలోని సీనియర్లలో ప్రముఖుడనే చెప్పాలి. అలాంటి పోచారం ఇంటికి రేవంత్ వెళ్ళి భేటీ అవటం ఆశ్చర్యంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుండి 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పదేపదే చెబుతున్నారు. అలాగే శాసనమండలిలోని బీఆర్ఎస్ సభ్యులను కూడా కాంగ్రెస్ చేర్చుకోబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. మొత్తంమీద ఈనెలాఖరులో మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో వీలైనంతమందిని లాగేసుకోవటానికి రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.
ఇందులో భాగంగానే పోచారంతో రేవంత్ భేటీ అయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోచారమే కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వదిలేసి హస్తంగూటికి చేరటానికి రెడీగా ఉన్నారని ప్రచారం పెరిగిపోతోంది. ఇప్పటికే ముగ్గురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో పాటు సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి కూడా కూడా రేవంత్ తో భేటీ అయ్యారు. రేవంత్ తో భేటీ అయిన ఎంఎల్ఏలు అందరూ తమ నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసమే కలిసినట్లు చెబుతున్నారు. పార్టీ మారే ఉద్దేశ్యంతో ఉన్నా చెప్పేది మాత్రం అభివృద్ధి నిధుల కోసమనే విషయం అందరికీ తెలిసిందే.
బీఆర్ఎస్ కున్న 38 మంది ఎంఎల్ఏల్లో ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. మిగిలిన 35 మందిలో పోచారం, బండ్ల ఈరోజో రేపో పార్టీని వదిలేయటం ఖాయంగా ఉంది. ఇక మిగిలిన 33 మందిలో ఇంకెంతమంది బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారో తెలీటంలేదు. గెలిచిన 39 మందిలో 16 మంది గ్రేటర్ పరిధిలోని వారే. వీరిలో కంటోన్మెంట్ ఎంఎల్ఏ లాస్యా నందిత చనిపోయిన తర్వాత జరిగిన ఉపఎన్నిక సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. దాంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. ఇందులో కూడా ముగ్గురు వెళ్ళిపోగా మరో ఇద్దరు పార్టీని వదిలేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎల్ఏలు గెలవలేదు. అందుకనే గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎంఎల్ఏలపైన ఎక్కువ దృష్టిపెట్టారు.
ఎంఎల్ఏలే కాకుండా ఎంఎల్సీలను కూడా లాగేయాలని రేవంత్ డిసైడ్ అయినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. 40 మంది ఉండే శాసనమండలిలో బీఆర్ఎస్ బలం 29 కాగా కాంగ్రెస్ బలం 6 మాత్రమే. ఎంఐఎంకు ఇద్దరు, టీచర్ అభ్యర్ధులు ఇద్దరుండగా బీజేపీ తరపున ఒకళ్ళున్నారు. బడ్జెట్ కు సంబంధించిన ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా అసెంబ్లీలో ఇబ్బంది లేదుకాని సమస్యంతా మండలిలోనే ఎదురవబోతోంది. తనకున్న బలంతో మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలన్నది గులాబీ బాస్ కేసీయార్ వ్యూహంగా ఉంది. ఈ విషయం తెలుసుకాబట్టే మండలిలోని బీఆర్ఎస్ మెజారిటి సభ్యులను కూడా లాగేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని రేవంత్ ప్లాన్ చేశారట. మొత్తంమీద తాజా పరిణామంతో రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లే అర్ధమవుతోంది.