Revanth Reddy | బేడీలతో లగచర్ల రైతు.. సీఎం రియాక్షన్ ఇదే..
x

Revanth Reddy | బేడీలతో లగచర్ల రైతు.. సీఎం రియాక్షన్ ఇదే..

గాంధీ ఆసుపత్రి ముందు ఒక పోలీస్ వ్యాన్ ఆగింది. అందులో నుంచి ఇద్దరు పోలీసులు దిగారు.


గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) ముందు ఒక పోలీస్(Police) వ్యాన్ ఆగింది. అందులో నుంచి ఇద్దరు పోలీసులు దిగారు. వారితో పాటు ఓ బక్క పల్చని వ్యక్తి.. చేతులకు బేడీలు వేసుకుని దిగాడు. అతనిని చూస్నే ఎవరైనా ఉగ్రవాదా అన్న అనుమానం కలిగేలా ఉంది. ఎక్కడ పారిపోతాడా అన్నట్లు ఆ వ్యక్తి బేడీల నుంచి ఒక చెయిన్‌ను వేసి, దాన్ని పోలీసు పట్టుకుని ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఏ ఉగ్రవాదో, సైకో కిల్లరో, పేరు మోసిన దొంగో, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మోసగాడో కాదు.. లగచర్ల(Lagacharla) ఫార్మా సిటీకి తన భూమి ఇవ్వను అని చెప్పిన ఒక సామాన్య రైతు. అతని పేరు హీర్యానాయక్. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన లగచర్ల రైతులలో ఒకడు. పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనకు బుధవారం రాత్రి గుండెపోటు వచ్చింది. అక్కడే ఆయనకు ప్రథమ చికిత్స అందించినా మెరుగైన చికిత్స కోసం ఆయనను గాంధీ ఆసుపత్రికుని వచ్చారు. ఆయన తీసుకొచ్చిన తీరు అలా ఉంది. హర్యానాయక్‌ను తీసుకొచ్చిన తీరుపై నెటిజన్లు, సాటి రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా మండిపడ్డారు. ఒక రైతును తీసుకొచ్చే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.

పోలీసుల తీరు అమానవీయం: కేటీఆర్

‘‘గుండె పోటు వస్తే కరుడుగట్టిన నేరస్తుడినైనా, తీవ్రవాదినైనా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకొస్తారు. కానీ ఒక రైతన్న‌కు గుండె పోటు వస్తే అతనికి సంకెళ్లు వేసి పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలిస్తారా. ఈ చర్య అమానవీయం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనను సుమోటోగా తీసుకోవాలి. ఈ అంశంపై విచారణ జరిపించేలా రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. రాహుల్ గాంధీకి నిజంగా మనసు అనేది ఉంటే.. కాంగ్రెస్‌ది ప్రేమ్‌ కీ దుఖానే అయితే.. గిరిజనులతో ప్రేమగా ఉండే గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించాలి’’ అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేయడంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన రైతు రాజ్యం అని నిలదీశారు. కాగా తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఈ వ్యవహారంపై పోలీసులు వివరణ ఇవ్వాలని కోరారు.

అంత అవసరం ఏమొచ్చింది: రేవంత్

‘‘లగచర్ల రైతుకు సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సని అవసరం ఏమొచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించండి. ఇలాంటి చర్యలను ప్రజా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. ఇటువంటి చర్యలకు పాల్పడిన అధికారులను కూడా మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజాస్వామ్య పాలన అందించే కాంగ్రెస్ హయాంలో ఇటువంటి ఘటనలకు పునరావృత్తం కాకూడదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదే విధంగా ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇవ్వాలని చెప్పారు. దాంతో పాటుగా సదరు రైతు ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో 45 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని 30రోజులుగా సంగారెడ్డి జైలులో ఉంచుతున్నారు.

Read More
Next Story