రెండో విడత కూడా సక్సెస్
x
Revanth Reddy

రెండో విడత కూడా సక్సెస్

రెండో విడత రుణమాఫీలో ఆరున్నర లక్షలమంది రైతులకు రు. 6198 కోట్లను విడుదలచేశారు.


రైతు రుణమాఫీ రెండో విడత నిదుల విడుదలను రేవంత్ రెడ్డి సక్సెస్ చేశారు. మంగళవారం రుణమాఫీ రెండో విడత నిధులను విడుదలచేశారు. రెండో విడత రుణమాఫీలో ఆరున్నర లక్షలమంది రైతులకు రు. 6198 కోట్లను విడుదలచేశారు. మొదటి విడత రుణమాఫీలో 11.50 లక్షల మంది రైతులను రుణవిముక్తి చేయటం కోసం రేవంత్ ప్రభుత్వం రు. 6100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది మూడో విడత మాత్రమే. మొదటి దశలో లక్ష రూపాయల్లోపు రుణాలున్న రైతుల అప్పులు మాఫీ అయితే రెండో విడతలో లక్ష నుండి లక్షన్నర రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీచేసింది. అంటే రెండు విడతల్లో ప్రభుత్వం రుణమాఫీకి రు. 12300 కోట్లు విడుదలచేసినట్లయ్యింది.

మూడో విడత రుణమాఫీకి మిగిలిన రు. 19 వేల కోట్లను విడుదల చేయాల్సుంటుంది. మూడు విడతల్లో రుణమాఫీ అవ్వాల్సిన మొత్తం రు. 31 వేల కోట్లుగా ప్రభుత్వం గతంలోనే డిసైడ్ చేసింది. మూడో విడతలో రుణమాఫీ లబ్దిదారుల రైతుల సంఖ్యను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే లక్షన్నర నుండి 2 లక్షల రూపాయల వరకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయబోతోంది. మూడో విడత రుణమాఫీ బహుశా రేవంత్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత జరగవచ్చు. ఆగష్టు 2వ తేదీన పెట్టుబడుల ఆకర్షణ కోసం పారిశ్రామికవేత్తలతో మాట్లాడేందుకు అమెరికాలో 12వ తేదీవరకు పర్యటించబోతున్నారు. పదిరోజుల టూర్లో ఎన్ని రాష్ట్రాల్లో రేవంత్ పర్యటించబోతున్నారు ? ఎంతమంది పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారనే విషయమై క్లారిటి రాలేదు. అందుకనే అమెరికా నుండి 12వ తేదీ తిరిగొచ్చిన తర్వాతే మూడో విడత రుణమాఫీ ఉండబోతోంది.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు యూపీఏ హయాంలో ఆహారభద్రత చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే దేశవ్యాప్తం 72 వేల కోట్ల రైతు రుణామాలను మాఫీచేసిన విషయాన్ని కూడా రేవంత్ ప్రస్తావించారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుపక్షపాతి అన్న విషయం రుజువైందని రేవంత్ చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి సరిగాలేకపోయిన 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ ప్రకారమే తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీ జరిగిన, జరగబోతున్న జూలై, ఆగష్టు నెలలు రాష్ట్ర చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోతాయని రేవంత్ అన్నారు. రు. 31 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు రేవంత్ చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఆరుమాసాల్లో తమ ప్రభుత్వం రు. 42 వేల కోట్లు వడ్డీ చెల్లించిన తర్వాత కూడా రైతు రుణమాఫీ హామీకి కట్టుబడి అమలుచేస్తున్న విషయాన్ని అందరు గుర్తించాలన్నారు. రు. 25 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. మొత్తంమీద అప్పటి ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో ఐదింటిని ప్రభుత్వం అమలుచేసినట్లయ్యింది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మూడు గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు అందించటం, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను నెరవేర్చిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీలో రెండు విడతలను అమలుచేసింది. ఇక మిగిలింది ఆరో హామీ మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్ హామీ మాత్రమే. ఈ హామీని ఎప్పుడు అమలుచేస్తుందో చూడాలి.

Read More
Next Story