Harish Rao | ‘రైతుబంధు ఆపింది రేవంత్ రెడ్డే’.. ప్రభుత్వంపై హరీష్ ఫైర్
x

Harish Rao | ‘రైతుబంధు ఆపింది రేవంత్ రెడ్డే’.. ప్రభుత్వంపై హరీష్ ఫైర్

మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్క పంటకు కూడా పథకాన్ని అమలు చేయలేదంటూ రేవంత్‌పై హరీష్ రావు సెటైర్లు వేశారు.


తెలంగాణ రైతులకు రైతబంధు(Rythu Bandhu) అందకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మరోసారి నోరు విప్పారు. అసలు ఈ పథకాన్ని ఆపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)దేనంటూ చురకలంటించారు. రైతులను బాగు చేస్తున్నామని చెప్పుకుంటూ మీ మానాన మీరు ‘రైతు పండగ’ నిర్వహించుకోవడం కాదని, నిజంగా రైతుకు మేలు చేసే పనులు చేయాలంటూ హితవు పలికారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి రైతులకు కష్టాలే ఉన్నాయని విమర్శించారు. గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క పంటకు కూడా రైతు బంధు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతున్నలను కష్టపెట్టిన ఏ ప్రభుత్వ బాగుపడిన దాఖలాలు లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘రేవంత్ రెడ్డి.. సీఎం పీఠమెక్కిన తర్వాత నుంచి ఉన్న రైతు బంధును కూడా ఇవ్వట్లేదు. రైతు, కైలు రైతు మాట్లాడుకోవాలని మంత్రి, ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు రైతు బంధును ఆపిందే సీఎం రేవంత్ రెడ్డి కదా. బీమా ద్వారా రైతులకు రూ.82 వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. బతుకమ్మ చీరల ద్వారా నేతన్నలను ఉపాధి కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం ఆఖరికి బతుకమ్మ చీరలను కూడా ఎగ్గొట్టింది’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఎల్‌ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా అసత్య ఆరోపణలు చేసింది. ఇప్పుడు ప్రజల నుంచి రూ.15 వేల కోట్లు కట్టించాలని ఆదేశాలిస్తున్నారు. పేదలపై నిజంగానే చెప్పేటంత ప్రేమ ఉంటే.. ఎల్ఆర్ఎష్‌ను ఉచితంగా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ఆఖరికి నిరుద్యోగుల సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు హరీష్ రావు. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు రోడ్డెక్కినా పట్టించుకోలేదని, పైగా అదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర అని నిందారోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేపడితే ఎక్కడలేని ఆరోపణలు చేశారని, ఇప్పుడు అదే సర్వేను కాంగ్రెస్ చేయిస్తుందని, మరి ఆ సర్వే ఎలా ఉందో రేవంత్ రెడ్డి చెప్పరా.. అంటూ సెటైర్లు వేశారు. గతంలో తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, ఆరోపణలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

Read More
Next Story