మోడీ కులాన్ని కెలికిన రేవంత్
x
Modi and Revanth

మోడీ కులాన్ని కెలికిన రేవంత్

ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అగ్రకులాన్ని మోడీ బీసీ(BC cast)ల్లో కలిపినట్లుగా ఆరోపించారు


‘ప్రధానమంత్రి నరేంద్రమోడి లీగల్లీ కన్వర్టె డ్ బీసీ’...ఇది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య లేదా ఆరోపణ. యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతు నరేంద్రమోడి(Naredra Modi) పుట్టుకతో బీసీ కాదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అగ్రకులాన్ని మోడీ బీసీ(BC cast)ల్లో కలిపినట్లుగా ఆరోపించారు. మోడీ కులంగురించి రేవంత్(Revanth) యధాలాపంగా అన్నారో లేకపోతే కావాలనే కెలికారో తెలీటంలేదు. యధాలాపంగా అనే అవకాశం అయితే లేదు. కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగానే మోడీ కులాన్ని రేవంత్ కెలికారనే అనుకోవాలి. మోడీ కులాన్ని కెలకటం వల్ల రేవంత్ కు వచ్చే లాభం ఏమిటన్నది అర్ధంకావటంలేదు. ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మోడీ బీసీ కాదని, పుట్టుకతో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగా ఆరోపించిన రేవంత్ మరి పుట్టుకతో మోడీ కులం ఏమిటన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. పైగా తాను అన్నీ విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నట్లు సెల్ఫ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చుకున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు మోడీ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయినా బీసీ అయినా సమాజానికి వచ్చే నష్టమేమిటి ? లాభమేమిటి ? దేశంలోని భిన్న ప్రాంతాలకు, భిన్న మతాలు, కులాలకు కూడా నరేంద్రమోడీ ప్రధానమంత్రే కదా. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఒక కులాన్ని, ప్రాంతాన్ని ఆపాదించటం అంటే ప్రధానమంత్రి పీఠాన్ని చులకనచేయటమే అవుతుంది. ప్రధానమంత్రి పనితీరు, వ్యక్తిత్వం, అమలుచేస్తున్న విధానాలకు అనుగుణంగానే దేశంలో లేదా అంతర్జాతీయంగా ప్రతిష్ట పెరగటమో లేకపోతే తగ్గటమో జరుగుతుంది కాని కులం లేదా మతాన్ని బట్టి జరగదు.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా బీజేపీ(BJP) హైలైట్ చేసింది. దాన్ని ఎన్డీయే(NDA) పక్షాలు కూడా బలంగా ఎండార్స్ చేశాయి. ఎప్పుడైతే ప్రధాని అభ్యర్ధిగా మోడీ ఖాయమయ్యారో వెంటనే దేశవ్యాప్తంగా బీసీల్లో పోలరైజేషన్ మొదలైంది. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ‘బీసీ నేత’ అనే నినాదం బాగా వర్కవుటైంది. మోడీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా మెజారిటి బీసీలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావటానికి ‘మోడీ-బీసీ’ నినాదం కూడా అప్పట్లో కీలకపాత్ర పోషించింది. మళ్ళీ 2019, 2024 ఎన్నికల్లో ఎన్డీయే గెలుపులో మోడీ-బీసీ నినాదం వినబడలేదు. ఎందుకంటే రెండుసార్లు ఎన్డీయే గెలుపులో మోడీ పనితీరు, ప్రతిపక్షాల్లోని అనైక్యత, మోడీ నాయకత్వం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేలిపోవటం, మోడీకి ధీటైన స్ధాయిలో మరో ప్రతిపక్ష నేత లేకపోవటం ఎన్డీయేకి బాగా కలిసొచ్చింది. 2014 ముందువరకు బీజేపీని బలంగా ఢీ కొన్న వామపక్షాలు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోవటం కూడా మోడీకి అడ్వాంటేజ్ అయ్యింది.

మోడీ అగ్రవర్ణానికి చెందిన నేతనా ? కన్వర్టెడ్ బీసీనా అన్న విషయం జనాలకు ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. మోడీ పాలనలో తమబతుకులు ఎలాగున్నాయి ? ఉద్యోగాలు వస్తున్నాయా ? లేదా ? నిత్యావసరాల ధరలు తగ్గుతున్నాయా లేదా ? ఉద్యోగ, ఉపాధికి ఎంతవరకు అవకాశాలున్నాయి అన్న విషయాలను మాత్రమే మెజారిటి జనాలు పట్టించుకుంటారు. ప్రధానమంత్రిగా మోడీ ఉన్నా ఇంకెవరున్నా జనాలు ఇదే ఆలోచిస్తారు. అలాగే రాష్ట్రంలో రేవంత్ పాలనలో తమకేమిటి లాభం జరుగుతోందనే మెజారిటి జనాలు ఆలోచిస్తున్నారు. జనాలకు మేలుచేసే పనులు మానేసి మోడీ కులాన్ని కెలకటంవల్ల రేవంత్ కు ఏమిటి ఉపయోగమో అర్ధంకావటంలేదు.

ఎప్పుడైతే మోడీ కులంగురించి రేవంత్ ఆరోపించారో వేంటనే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులం, మతంపై ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. మోడీ కులంపై బహిరంగచర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, రాహుల్ మతం, కులంపై చర్చకు రేవంత్ సిద్ధమా ? అని కిషన్ విసిరిన సవాలుకు కాంగ్రెస్ నుండి ఇంతవరకు సమాధానంలేదు. తను మోడీకులంగురించి మాట్లాడితే బీజేపీ నేతలు రాహుల్ మతం, కులంగురించి లేవనెత్తుతారన్న విషయం రేవంత్ కు తెలియనిదికాదు. అయినాసరే మోడీ కులంగురించి ప్రస్తావించారంటే రేవంత్ కు హిడెన్ అజెండా ఏదో ఉండే ఉంటుందనటంలో సందేహంలేదు.

Read More
Next Story