KCR | కాళేశ్వరం అవినీతిని ఎండగట్టేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్
x
Revanth and KCR

KCR | కాళేశ్వరం అవినీతిని ఎండగట్టేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleswaram Project) అడ్డంపెట్టుకుని కేసీఆర్(KCR) పాల్పడిన అవినీతిపై జనాల్లో చైతన్యం తీసుకురావాలని అనుకుంటున్నాడు


కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) సరైన నిర్ణయమే తీసుకుంటున్నట్లున్నారు. రాజకీయనాయకుడు కదా ప్రజలదృష్టిలో ప్రతిపక్షాలను దోషిగా నిలబెట్టేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటాడు అనటంలో సందేహంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణవ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశమైన కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleswaram Project) అడ్డంపెట్టుకుని కేసీఆర్(KCR) పాల్పడిన అవినీతిపై జనాల్లో చైతన్యం తీసుకురావాలని అనుకుంటున్నాడు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కారుపార్టీ(BRS)ని చావుదెబ్బకొట్టడమే ఏకైక టార్గెట్ గా రేవంత్ వ్యూహాలు పన్నుతున్నాడు. తొందరలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే కాళేశ్వరం రిపోర్టును టేబుల్ చేయటానికి రేవంత్ నిర్ణయించాడు. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు(Justice PC Ghosh Commission)ను ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు 670 పేజీల రిపోర్టును క్యాబినెట్లో ప్రవేశపెట్టి చర్చించేందుకు వీలుగా 30 పేజీలకు కుదించింది ప్రభుత్వం.

ఆ రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి పనికిరాకుండా పోవటంలో కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే అని స్పష్టంగా ఉంది. కేసీఆర్ తర్వాత కీలకపాత్ర ఎవరిదయ్యా అంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, మేనల్లుడు తన్నీరు హరీష్ రావుదే. వీళ్ళ తర్వాత అప్పట్లో ఆర్ధికశాఖ మంత్రిగా పనిచేసి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్ కే జోషి, ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తో పాటు ఉన్నతాధికారులు చాలామందే ఉన్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే ఘోష్ కమిషన్ రిపోర్టును రేవంత్ ప్రభుత్వం తెలుగులోకి అనువదిస్తోంది. ఇంగ్లీషులో ఉన్న రిపోర్టు అందరికీ అర్ధమవ్వాలని లేదుకదా. అందుకనే ఆరిపోర్టును తెలుగులోకి కూడా అనువదిస్తోంది. అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ ప్రారంభంకాగానే దాని తెలుగు అనువాదం కాపీలను రాష్ట్రమంతా(పబ్లిక్ డాక్యుమెంట్) పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు అనువాదం ఆధారంగా కేసీఆర్ అవినీతి, అవకతవకలపై మారుమూల గ్రామాల్లో కూడా చర్చ జరిగేట్లుగా పార్టీ శ్రేణులును రంగంలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలోని అన్నీగ్రామాల్లో కూడా కేసీఆర్ అండ్ కో అవినీతి, అవకతవకలపై చర్చలు జరిగేట్లుగా అవసరమైన చర్యలను రేవంత్ తీసుకుంటున్నాడు. రాష్ట్రమంతా కేసీఆర్ అవినీతిపై చర్చ జరిగేందుకు రేవంత్ పెద్ద వ్యూహమే పన్నాడు. ఇప్పటివరకు రిపోర్టులోని అంశాలను మంత్రులు మాట్లాడినపుడు లేదా లీకుల రూపంలో మీడియా, సోషల్ మీడియా ద్వారానే జనాలు తెలుసుకున్నారు.

అలాంటిది కాళేశ్వరం అవినీతి, అవకతవకల్లో కేసీఆర్ పాత్రను హైలైట్ చేస్తు ప్రభుత్వమే పబ్లిక్ డాక్యుమెంట్ రూపంలో జనాలందరికీ చేర్చాలనే నిర్ణయం సంచలనంగా మారటం ఖాయం. కమిషన్ రిపోర్టు తెలుగు అనువాదాన్ని జనాలందరికీ పంచితే ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకుని ఏమి జరిగిందో తెలుసుకుంటారు. కమిషన్ రిపోర్టే కాబట్టి అందులోని విషయాలను జనాలు అనుమానించేందుకు కూడా అవకాశాలు తక్కువ. ఈ రకంగా కేసీఆర్ అవినీతిని జనాల్లోకి తీసుకెళ్ళటానికి రేవంత్ పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు. 670పేజీల రిపోర్టుమొత్తాన్ని తెలుగులోకి అనువదించలేకపోవచ్చు. ముఖ్యమైన అంశాలను అంటే కేసీఆర్, హరీష్, ఈటల పాత్రలపైన కమిషన్ వ్యాఖ్యలను, అవినీతి జరిగిన విధానాన్ని, స్ధలాల మార్పు, అంచనాలు, సవరించిన అంచనాల్లాంటి అనేక నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన నష్టాలు, ఖజానాపై పడిన మోయలేని భారం తదితర వివరాలను తెలుగులోకి అనువదించి పబ్లిక్ డాక్యుమెంటుగా జనాలందరికీ పంపిణీ చేయాలని డిసైడ్ చేశారు. అందుబాటులో, ఆసక్తి ఉన్నవారు వెబ్ సైట్లో కూడా చదువుకునే వీలు కల్పిస్తుందేమో చూడాలి.

కాళేశ్వరం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ స్పష్టంచేశారు. ప్రభుత్వవర్గాల ప్రకారం అసెంబ్లీలో ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వానికే మెజారిటి ఉంది కాబట్టి బాధ్యులందరిపైనా కఠినచర్యలు తీసుకోవాలని తీర్మానంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా కేసీఆర్, హరీష్, ఈటల కోర్టు ద్వారానే ఎదుర్కొనే అవకాశాలున్నాయి. సో, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు మొదలవుతాయి, కాళేశ్వరం రిపోర్టును ఎప్పుడు టేబుల్ చేస్తారు అన్న విషయం ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అయినా కేసీఆర్ సభకు హాజరవుతారేమో చూద్దాం.

Read More
Next Story