మూడు కంపెనీలతో రేవంత్ టీమ్ ఒప్పందాలు
x

మూడు కంపెనీలతో రేవంత్ టీమ్ ఒప్పందాలు

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో మూడు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.


తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో మూడు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్సీజియం, ట్రైజీన్, వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థలతో రేవంత్ బృందం మంగళవారం ఒప్పందాలు కుదుర్చుకున్నారు .

మరింత విస్తరించనున్న ఆర్సీజియం...

అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది. సీఈఓ గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బృందం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

ఆర్సీజియం అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి పరుస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు.

ఆర్సీజియం ప్రతినిధులతో రేవంత్ బృందం

వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీజియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. ఆర్సీజియం తన సేవలను విస్తరణ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

ట్రైజీన్ ప్రతినిధులతో రేవంత్ బృందం

ట్రైజీన్ తో కుదిరిన ఒప్పందం...

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ సెంటర్ పై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను ఇవ్వనుంది.

వాల్ష్ కర్రా ప్రతినిధులతో రేవంత్ బృందం

వీ హబ్ లో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ పెట్టుబడులు

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ [WE HUB - Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు - వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల (రూ.839 కోట్ల) పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడుపోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

Read More
Next Story