రేవంత్ నిద్రపోయేట్లు లేడుగా
x
Revanth and KCR

రేవంత్ నిద్రపోయేట్లు లేడుగా

కేసీయార్ దెబ్బకు టీడీపీ మాత్రమే నేలమట్టమైంది. కేసీయార్ చేయలేని పనిని ఇపుడు రేవంత్ పూర్తిచేసట్లే కనబడుతున్నారు.


బీఆర్ఎస్ ను ఏదో ఒకటి చేసేంతవరకు రేవంత్ రెడ్డి నిద్రపోయేట్లు కనబడటంలేదు. ప్రతిపక్షాలను సాంతం దెబ్బతీయాలని పదేళ్ళు కేసీయార్ చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. కేసీయార్ దెబ్బకు టీడీపీ మాత్రమే నేలమట్టమైంది. కేసీయార్ చేయలేని పనిని ఇపుడు రేవంత్ పూర్తిచేసట్లే కనబడుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలంటే మైనస్ బీజేపీ అనే అర్ధంచేసుకోవాలి. బీజేపీ జోలికి వెళితే అధికారంలో ఉన్నవాళ్ళు కష్టాలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. అందుకనే అప్పుడు కేసీయార్ అయినా ఇపుడు రేవంత్ అయినా బీజేపీ మినహా మిగిలిన పార్టీలనే టార్గెట్ చేయగలరు. ఇందులో భాగంగానే కేసీయార్ ను ఉక్కిరిబిక్కిరి చేయటమే టార్గెట్ గా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ను సాంతం దెబ్బతీయటంలో కేసీయార్ ఫెయిలయ్యారు. మరి బీఆర్ఎస్ ను దెబ్బతీయటంలో రేవంత్ ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ఒకపుడు ప్రతిపక్షాలపైకి ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ పైన కేసీయార్ ఎలాంటి అస్త్రాలను ప్రయోగించారో ఇపుడు అచ్చంగా అదే అస్త్రాన్ని కేసీయార్ పైకి రేవంత్ ప్రయోగిస్తున్నారు. ఇంతకీ ఆ అస్త్రం ఏమిటంటే వలసల అస్త్రం. ఒకపార్టీలో నుండి ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు అధికారపార్టీలోకి జంప్ చేసేట్లు ప్రేరేపించటమే అస్త్రం అసలు ఉద్దేశ్యం. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీయార్ తెలంగాణాలో ప్రతిపక్షాలే ఉండకూడదని అనుకున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. అయితే చివరినిముషంలో చంద్రబాబు ప్రయత్నం ఫెయిలవ్వటమే కాకుండా రివర్సుకొట్టింది.

కేసీయార్ పూర్తిగా సక్సెస్ కాలేదా ?

దాన్ని అవకాశంగా తీసుకున్న కేసీయార్ వెంటనే అలర్టై టీడీపీని దెబ్బకొట్టారు. తెలుగుదేశంపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలతో పాటు సీనియర్ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. చివరకు టీడీపీఎల్పీని కూడా బీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. ఆ దెబ్బకు టీడీపీ ఖాళీ అయిపోవటమే కాకుండా కోలుకోలేనంతగా దెబ్బతినేసింది. ఆ తర్వాత తన దృష్టిని కేసీయార్ కాంగ్రెస్ పైన పెట్టారు. హస్తంపార్టీని కూడా చాలావరకు దెబ్బకొట్టారు. ఎంఎల్ఏలను, సీనియర్ నేతలను లాగేసుకుని పార్టీని బాగా బలహీనపరిచారు. పదేళ్ళపాలనలో తనకు ఎదురన్నదే ఉండకూడదని కేసీయార్ అనుకున్నారు. అందుకనే రెండుప్రధాన పార్టీలను ఎంతవీలైతే అంత దెబ్బకొట్టేశారు. కేసీయార్ చర్యలు మితిమీరిపోవటం, రేవంత్ అండ్ కో కాంగ్రెస్ లో చేరటంతో పార్టీ పుంజుకుని చివరకు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

రేవంత్ సక్సెస్ అవుతారా ?

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇపుడు కేసీయార్ పైకి రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. ఏ రోజు ఏ కారుపార్టీ నేత పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. కేసీయార్ కు అత్యంత సన్నిహితులైన చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంఎల్ఏ కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ లో చేరుతున్నారు. 29 ఉదయం కేసీయార్ తో భేటీలో కేకే మాట్లాడుతు పార్టీ విధానాలు నచ్చకే తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పటాన్ని కేసీయార్ జీర్ణించుకోలేకపోయారని పార్టీవర్గాలు చెప్పాయి. అలాంటిది సాయంత్రానికి కూతురుతో పాటు కడియం కూడా బీఆర్ఎస్ ను వదిలేస్తున్నట్లు చెప్పటంతో కేసీయార్ కు పెద్ద షాక్ తగిలింది. ఇంతకుముందే ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

కారుపార్టీ ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, కొత్తా ప్రభాకరరెడ్డి, ప్రకాష్ గౌడ్ తో పాటు కొందరు ఎంఎల్ఏలు రేవంత్ తో భేటీ అయ్యారు. అప్పటికే పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి సీనియర్లు తమ కుటుంబాలతో కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ నుండి ఏ రోజు ఏ నేత, ఏ ఎంఎల్ఏ కాంగ్రెస్ లో చేరుతారో తెలీక కేసీయార్లో గందరగోళం పెరిగిపోతోంది. 26 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో చేర్చుకోవడమే టార్గెట్ గా రేవంత్ పావులు కదుపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఒకపుడు కేసీయార్ ప్రయోగించిన వలసల అస్త్రాన్నే ఇపుడు రేవంత్ ప్రయోగిస్తుండటంతో కేసీయార్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

ఇదే విషయమై టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు అధికారం లేకుండా బతకలేమన్న ఆలోచనతోనే ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నట్లు అబిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లోనే చనిపోతానని తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే కేశవరరావు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ను కూల్చేస్తామని బెదిరించిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ చేర్చుకోవాలని అనుకోవటమే విడ్డూరంగా ఉందన్నారు. అధికారపార్టీలో లేకపోతే బతకలేమని ప్రజాప్రతినిధులు అనుకునే పరిస్ధితిని పార్టీలు తీసుకురావటం నిజంగా దురదృష్టమన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికే పార్టీ మారుతున్నట్లు చెబుతున్నదంతా అబద్ధమే అన్నారు.

Read More
Next Story