
తుపాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన రేవంత్
పట్టణంలోని సమ్మయ్యనగర్ లో వరద బాధితుల ఇళ్ళకు వెళ్ళారు
హనుమకొండలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటించారు. శుక్రవారం మధ్యాహ్నం మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, కొండా సురేఖ తదితరులతో కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని సమ్మయ్యనగర్ లో వరద బాధితుల ఇళ్ళకు వెళ్ళారు. తమ ఇళ్ళు ఏ విధంగా దెబ్బతిన్నాయనే విషయాన్ని బాధితులు నేరుగా రేవంత్ కు వివరించారు. పొలాల్లోని పంటలు దెబ్బతినటం, పశువులు నష్టపోవటం లాంటి అనేక సమస్యలను బాధితులు చెప్పగా రేవంత్ ఓపికగా విన్నారు. పక్కనే ఉన్న కలెక్టర్, ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలను జారీచేశారు. బాధితులతో మాట్లాడిన తర్వాత రేవంత్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్ళి సమీక్ష చేశారు.
మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసిందే. లక్షలాది ఎకరాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతినేశాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వరదపాలయ్యాయి. బాధితులతో మాట్లాడేటపుడు ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.
సమీక్ష తర్వాత రేవంత్ మాట్లాడుతు నగరంలో చెరువులు, నాలాల కబ్జాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కబ్జాదారులు ఎంతటివారైనా వదలద్దని ఆదేశించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ పై ఇరిగేషన్ శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంలేకపోవటంతోనే చాలా సమస్యలు వస్తున్నట్లు రేవంత్ అభిప్రాయపడ్డారు. చెరువుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లెక్కలు పక్కాగా ఉండాలన్నారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. ఒక్కళ్ళ కోసం వందలమందిని ఆగంచేయద్దని అధికారులకు చెప్పారు. ఇసుకమేటలు వేసిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేయాలని చెప్పారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమస్యతోనే ముంపు తీవ్రత పెరిగిందన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
వరంగల్ లో నాలాలు, చెరువుల కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వరంగల్ లో మున్సిపల్, ఇరిగేషన్ శాఖ మధ్య సమన్వయం ఎందుకు లేదని నిలదీశారు. వరంగల్ స్మార్ట్ సిటి పథకంలో పెండింగ్ పనులన్నీ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. స్మార్ట్ సిటి పథకంలో నిధులు సరిపోకపోతే ప్రభుత్వం నుండి కూడా నిధులు విడుదలచేస్తామని హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటిలో చేపట్టాల్సిన పనులపై వెంటనే నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. పనులు చేయటానికి క్షేత్రస్ధాయిలో కోఆర్డినేషన్ కమిటి వేయాలన్నారు. క్లౌడ్ బరస్ట్ కు శాశ్వత పరిష్కార ప్రణాళికలు తయారుచేయాలన్నారు. కలెక్టర్ ను రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేయాలని రేవంత్ ఆదేశించారు.




