
ఈ నెల 13న రేవంత్ వర్సెస్ మెస్సీ మ్యాచ్
మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన భట్టి విక్రమార్క
ప్రఖ్యాత ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ చూడటానికి అభిమానులు ప్రపంచ నలుమూలల నుంచి హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ లో జరుగనున్న మ్యాచ్ కోసం ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం మీడియాతో అన్నారు. మెస్సీకి ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుందన్నారు. మ్యాచ్ కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భట్టీ పేర్కొన్నారు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియానికి చేరుకోవాలని ఆయన సూచించారు. మ్యాచ్ సందర్భంగా అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. మ్యాచ్ చూడటంకోసం అభిమానుల్లో ఉత్సాహం ఎలా పెరుగుతోందో స్పష్టంగా కనిపించిందని శ్రీధర్‌బాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వంటి సీనియర్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో పెరుగుతున్న క్రీడాఉత్సాహాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ , తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది.

