రెండు రాష్ట్రాల ‘జలయుద్దం’లో రేవంత్ గెలుస్తాడా ?
x
Revanth, Chandrababu and Siddharamaiah

రెండు రాష్ట్రాల ‘జలయుద్దం’లో రేవంత్ గెలుస్తాడా ?

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకకాలంలో రెండురాష్ట్రాలతో జలయుద్ధం చేస్తున్నది


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకకాలంలో రెండురాష్ట్రాలతో జలయుద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఏపీతో గోదావరి జలాల విషయంలో బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)కు వ్యతిరేకంగా రేవంత్(Revanth) ప్రభుత్వం యుద్ధంచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కర్నాటక(Karnataka)లో ఆల్ మట్టి ప్రాజెక్టు(Almatti Project) ఎత్తుపెంచే విషయంలో కూడా రేవంత్ ప్రభుత్వం న్యాయస్ధానంలో యుద్ధంచేయక తప్పని పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 మీటర్ల నుండి 524 మీటర్లకు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్నీరకాల పోరాటాలు చేస్తామని తెలంగాణ ఇరిగేషన్ శాఖమంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utthamkumar Reddy) ఇప్పటికే ప్రకటించారు.

ఆప్తమిత్రుడు, గట్టిమద్దతుదారుడు రేవంత్ పైకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బనకచర్ల అస్త్రాన్ని సంధించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి, అవకతవకలను ఎలా సరిచేయాలో అర్ధంకాని స్ధితిలో రేవంత్ ఉండగా అది సరిపోదన్నట్లుగా ఏపీలో బనకచర్ల ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు చేసిన బనకచర్ల ప్రకటన పుండుమీద కారం రాసినట్లయ్యింది. గోదావరి జలాలను బనకచర్ల(జీబీ లింక్) ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్ కు తరలించేందుకు ఉద్దేశించిందే బనకచర్ల ప్రాజెక్టు. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ జీబీ లింకు ప్రాజెక్టు పట్టిసీమ నుండి ప్రారంభమై బనకచర్ల రెగ్యులేటర్ ను కలుపుతుంది. నిజానికి జీబీ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పటికే సంవత్సరాలు అవుతున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు. కొత్తగా జీబీ లింక్ అంటే మరో పోలవరం ప్రాజెక్టు అవటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ కోణంలో చూస్తే బనచర్ల ప్రాజెక్టు ఓకే కాని తెలంగాణకు మాత్రం నాట్ ఓకే. గోదావరి జలాల పంపకాలపై ఇప్పటికే తెలంగాణ-ఏపీ మధ్య వివాదాలు తెమలటంలేదు. ఈనేపధ్యంలో బనకచర్ల ప్రాజెక్టుకు కూడా గోదావరి జలాలనే తరలిస్తామని చంద్రబాబు చెప్పటం చూస్తే వివాదం మరింత ముదురుతుందే తప్ప ఎప్పటికీ పరిష్కారమయ్యే సూచనలు కనిపించటంలేదు. గోదావరి వరదజలాలను తాము బనకచర్లలోకి మళ్ళించుకుంటామని చంద్రబాబు చెబుతున్నారు. అయితే గోదావరికి వరద ఎప్పుడొస్తుందన్నదే ప్రశ్న. నీటిపారుదలరంగ నిపుణుడు వెదిరెశ్రీరమ్ ‘‘అసలు వరదజలాలు అన్న మాటే తప్పం’’టున్నారు. ‘‘వరదజలాలను చూపించి వేలకోట్లరూపాయల ఖర్చుతో అత్యంత భారీ నిర్మాణాలు చేయటం ముమ్మాటికి తప్పే’’ అని శ్రీరామ్ గట్టిగానే చెప్పారు.

రాష్ట్రంలోను, కేంద్రంలోను ఉన్నది ఎన్డీయే ప్రభుత్వాలే కాబట్టి బనకచర్లకు కేంద్రప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు తెప్పించుకునేందుకు చంద్రబాబు గట్టిగా ప్రయత్నాలుచేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రయత్నాలను నిలువరించటం రేవంత్ కు పెద్ద సవాలనే చెప్పాలి. రేవంత్ ఏమిచేయబోతున్నారనే విషయంలో తెలంగాణ సమాజం ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ ఒకటే కాబట్టి తెలంగాణకు రావాల్సిన జలాలను చంద్రబాబుకు దోచిపెడుతున్నారంటు బీఆర్ఎస్ నానా గోలచేస్తోంది. నిజానికి ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు లేదు, రేవంత్ దోచిపెడుతున్నదీ లేదు. అయినా రాజకీయంగా రేవంత్ ను ఇరుకునపెట్టేందుకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్ నానా రచ్చచేస్తున్నారు. దీన్ని గమనించే రేవంత్ తెలివిగా పావులు కదుపుతున్నాడు. ఎలాగంటే గోదావరి-బనచర్ల లింక్ ప్రాజెక్టు వివాదంపై అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయాలని. అన్నీపక్షాలను కలుపుకుని బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటంచేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు.

అంతేకాకుండా బనకచర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రప్రభుత్వానికి, సెంట్రల్ వాటర్ కమిషన్ కు అభ్యంతరాలు చెబుతు రేవంత్ లేఖలు రాయించారు. బనకచర్లపైన అఖిలపక్ష పోరాటాల్లో పాల్గొనలా ? వద్దా అన్నది బీజేపీ, బీఆర్ఎస్సే తేల్చుకోవాలి. ఈ రెండుపార్టీలు ఎలాగు కలిసిరావని తెలుసుకాబట్టే రేవంత్ అఖిలపక్ష పోరాటాలని ప్రకటించింది. ఏపీ ఇరిగేషన్ శాఖమంత్ర నిమ్మల రామానాయడు మీడియాతో మాట్లాడుతు ‘‘రాయలసీమ రతనాల సీమగా మారాలంటే గోదావరి జలాల మళ్ళింపే శరణ్యమ’’ని ఒకపుడు కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. రామానాయుడు గుర్తుచేసిన కేసీఆర్ ప్రకటనతో మంత్రులు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పైకి మాటలతో ఎదురుదాడులు మొదలుపెట్టేశారు. కేంద్రందగ్గర అనుమతులు తెచ్చుకున్నా బనకచర్లను చంద్రబాబు కట్టలేరని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బాగా కాకపుట్టించాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితో అయినా, ఎందాకైనా పోరాటంచేస్తామన్న రేవంత్ ప్రకటన తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకున్నది.

రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, చెప్పిన అభ్యంతరాల కారణంగానే కేంద్రప్రభుత్వంలోని అటవీ, పర్యావరణ శాఖలు, జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ అన్నీ బనకచర్ల నిర్మాణ అనుమతులకు రెడ్ సిగ్నల్ చూపించాయి. అవసరమైతే ఏపీ, కేంద్రప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామన్న రేవంత్ హెచ్చరికలు కేంద్రశాఖలపై గట్టి ప్రభావాన్ని చూపించాయనే అనుకోవాలి. అయితే చంద్రబాబు ఎన్డీయేలో కీలకమైన పార్టనర్ కాబట్టి బనకచర్ల అనుమతుల విషయంలో తక్కువ అంచనా వేసేందుకు లేదు.

బనకచర్ల వివాదం ఈవిధంగా ఉంటే తాజాగా కర్నాటకతో పంచాయితీ మొదలైంది. కర్నాటకతో వివాదం ఏమిటంటే ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తును ఆప్రభుత్వం 519 మీటర్ల నుండి 524 మీటర్లకు పెంచాలని నిర్ణయించటమే. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణలో రేవంత్ ను ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. కారణం ఏమిటంటే రెండురాష్ట్రాల్లోను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటమే. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే బీఆర్ఎస్ వెంటనే రేవంత్ ను టార్గెట్ చేయటం మొదలుపెట్టింది. అధిష్ఠానం ఒత్తిడికి లొంగిపోయిన రేవంత్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్లు కేటీఆర్, హరీష్ నానా గోలచేస్తున్నారు. ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచే విషయాన్ని వ్యతిరేకిస్తు ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాసింది. అవసరమైతే కోర్టులో కేసులు వేస్తామని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాలో ప్రకటించారు.

అయితే ఇపుడు విషయం ఏమిటంటే ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే విషయంలో కర్నాటకలోని ఇరిగేషన్ నిపుణులు, మామూలు జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తుపెంచటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎత్తుపెంచటం వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని జనాలు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. కాబట్టి ప్రజల వ్యతిరేకేతను కూడా కర్నాటక ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఇదే విషయమై కర్నాటక నిర్ణయాన్ని సవాలు చేస్తు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు దాఖలుచేసింది. ఎందుకంటే ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచితే మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణంతో పాటు జిల్లాలోని చాలాప్రాంతాలు ముంపుకు గురవుతాయి కాబట్టి.

763 టీఎంసీలు కేటాయించాల్సిందే : ఉత్తమ్

ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన 1005 టీఎంసీల జలాల్లో ఇపుడు తెలంగాణకు 763 టీఎంసీలు కేటాయించాల్సిందే అని ఇరిగేషన్ శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో రెండురాష్ట్రాల మధ్య మొదలైన ట్రిబ్యునల్ వాదనల్లో ఈ విషయమై గట్టిగా పట్టుబట్టబోతున్నట్లు చెప్పారు. ట్రిబ్యునల్ వాదనల సందర్భంగా ఇరిగేషన్ నిపుణులు, ఉన్నతాధికారులతో మంత్రి ఢిల్లీలోనే క్యాంపువేశారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1005 టీఎంసీల నీటిలో 75శాతం డిపెండబులిటి మీద 811 టీఎంసీలు, 65శాతం డిపెండబులిటి మీద 49 టీఎంసీలు, సగటు ప్రవాహాల ఆధారంగా 145 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. గోదావరి నీటి మళ్ళింపును అనుసరించి కేటాయించిన 45 టీఎంసీలు కలిపితే మొత్తం 1050 టీఎంసీలుగా మంత్రి తెలిపారు. ఇందులో ఇపుడు రెండురాష్ట్రాల నీటివాటాలు కలిసున్నట్లు చెప్పారు. పరీవాహక ప్రాంతం ఆధారంగా చూసుకుంటే న్యాయబద్దంగా తెలంగాణకు 763 టీఎంసీలు దక్కాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆల్ మట్టి డ్యాం ఎత్తు పెంచటానికి వీల్లేదని కర్నాటక ప్రభుత్వానికి గట్టిగా చెబుతున్నట్లు ఉత్తమ్ చెప్పారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రింకోర్టులో తొందరలోనే తెలంగాణ ప్రభుత్వం కేసు దాఖలుచేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ప్రాజెక్టు ఎత్తుపెంచటం చాలా కష్టం: మేరెడ్డి

ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచటం చాలాకష్టమని నీటిపారుదల రంగం నిపుణుడు, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఇంజనీర్ మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మేరెడ్డి తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ ప్రాజెక్టు 5మీటర్ల ఎత్తు పెంచితే 100 టీఎంసీల నీటిని నిల్వచేసుకోవచ్చు’’ అని చెప్పారు. ‘‘అయితే ఇది ప్రాక్టికల్ గా సాధ్యంకాదు కాబట్టి కనీసం 50 టీఎంసీల నీటినిల్వకైనా అనుమతులు ఇవ్వాల’’ని కర్నాటక ప్రభుత్వం సుప్రింకోర్టును కోరినట్లు చెప్పారు. ‘‘ఎందుకంటే ఎప్పటినుండో ప్రాజెక్టు ఎత్తువివాదం సుప్రింకోర్టులో ఉంది కాబట్టే కర్నాటక ప్రభుత్వం సుప్రింకోర్టును అనుమతి కోరింద’’న్నారు. కర్నాటక ప్రభుత్వం అడిగిన వెంటనే సుప్రింకోర్టు అనుమతి ఇవ్వటం సాధ్యంకాదన్నారు. ‘‘ప్రాజెక్టు ఎత్తుపెంచేందుకు లేదని అభ్యంతరం చెబుతు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రికోర్టులో కేసు దాఖలుచేసింద’’న్నారు.

ఇదే ప్రాజెక్టుపై 2013 నుండి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని మేరెడ్డి వెల్లడించారు. ‘‘ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 నుండి 524 మీటర్లకు పెంచుకోవటానికి బ్రజేష్ ట్రిబ్యునల్ గతంలో అనుమతి ఇచ్చి’’న విషయాన్ని మేరెడ్డి గుర్తుచేశారు. ‘‘ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినపుడు ఉన్న మూడురాష్ట్రాలు ఇపుడు నాలుగై’’నట్లు చెప్పారు. ‘‘కాబట్టి ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం ఎత్తుపెంచటాన్ని వ్యతిరేకిస్తు వాదనలు వినిపిస్తోంద’’ని చెప్పారు. నీటికేటాయింపులు సక్రమంగా జరగాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూసేందుకు ట్రిబ్యునల్ గతంలోనే సూచించిన మానిటరింగ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండును మేరెడ్డి సమర్ధించారు.

‘‘ప్రాజెక్టు ఎత్తుపెంచాలంటే 65 వేలఎకరాలను కర్నాటక ప్రభుత్వం సేకరించాల’’ని చెప్పారు. ‘‘ఇన్ని వేల ఎకరాలు సేకరించాలంటే పరిహారంకింద భూయజమానులకు కర్నాటక ప్రభుత్వం వేలాది కోట్లరూపాయలను చెల్లించాల్సుంటుంద’’ని చెప్పారు. అలాగే ‘‘ప్రాజెక్టు ఎత్తు పెంచటంవల్ల బీజపూర్, భాగల్ కోట్, గుల్బార్గా జిల్లాల్లోని చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతాయ’’ని కూడా వివరించారు. ‘‘ముంపుకు గురయ్యే జనాలను ఇతర ప్రాంతాలకు తరలించటం, పరిహారాలు చెల్లించటం అంత తేలికగా జరిగే పనికాద’’న్నారు. హోలు మొత్తంమీద మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయం ప్రకారం ఆల్ మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచటం జరిగేపనికాదని అర్ధమవుతోంది. అయినా కాకపోయినా రేవంత్ కు అటు చంద్రబాబు ప్రభుత్వంతోను ఇటు సిద్ధరామయ్య ప్రభుత్వంతోను జలయుద్ధమైతే తప్పేట్లు లేదు. మరీ యుద్ధంలో తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ ఎంతవరకు కాపాడుతారో చూడాల్సిందే.

Read More
Next Story