KCR jammed | కేసీఆర్ ను కోర్టులో ఇరికించేసిన రేవంత్
x
BRS chief KCR

KCR jammed | కేసీఆర్ ను కోర్టులో ఇరికించేసిన రేవంత్

రిపోర్టును రద్దుచేయాలంటు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish rao) హైకోర్టులో వేసిన కేసులో ఎదురుదెబ్బ తగిలింది.


కాళేశ్వరం రిపోర్టు రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) కోర్టులో గట్టిగా ఇరికించేశారు. కాళేశ్వరం అవినీతి(Kaleshwaram Corruption), అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) ఇచ్చిన రిపోర్టును రద్దుచేయాలంటు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish rao) హైకోర్టులో వేసిన కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పీసీ ఘోష్ కమిషన్ కు విచారణ అర్హత లేదు కాబట్టి కమిషన్ ను కొట్టేయాలన్నారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరారు. అయితే కేసీఆర్ వాదనను కోర్టు కొట్టేసింది. ప్రభుత్వ చర్యలపై స్టే విధించటం సాధ్యంకాదని తేల్చి చెప్పేసింది. పనిలోపనిగా అసెంబ్లీలో చర్చల తర్వాతే చర్యల విషయం తేలుతుందని ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎంఎల్ఏలే కాబట్టి వాళ్ళు చెప్పదలచుకున్నది అసెంబ్లీలోనే చెప్పచ్చని కూడా అడ్వకేట్ జనరల్ వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది.

ఇక్కడే కేసీఆర్ కు పెద్దసమస్య ఎదురైంది. ఎలాగంటే అసెంబ్లీలో చర్చలు జరిగినపుడు కేసీఆర్, హరీష్ తమ వాదనలు వినిపించవచ్చని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కాబట్టి తొందరలోజరగబోయే అసెంబ్లీసమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది పెద్ద సమస్య. గడచిన ఏడాదిన్నరగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు కూడా కేసీఆర్ హాజరుకాలేదు. సభాధ్యక్షుడిగా రేవంత్ ను ఎదుర్కోవటం ఇష్టంలేకే కేసీఆర్ సమావేశాలకు హాజరుకావటంలేదు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు సభాధ్యక్షుడి హోదాలో రేవంత్ ను కేసీఆర్ సభలో నోరిప్పనీయలేదు. రేవంత్ అసెంబ్లీలో ఎప్పుడు ఏ విషయంపై మాట్లాడినా ఏదో ఒక గోలజరగటం, వెంటనే స్పీకర్ రేవంత్ ను సభనుండి సస్పెండ్ చేయటం అందరికీ తెలిసిందే.

అధికారంలో ఉన్నపుడు రేవంత్ విషయంలో తాను ఎలాగ వ్యవహరించారో కేసీఆర్ కు బాగా గుర్తుంది. ఇపుడు తనవిషయంలో రేవంత్ కూడా అదేపద్దతిలో వ్యవహరిస్తారు అన్న అనుమానంతోనే కేసీఆర్ సమావేశాలకు హాజరవ్వటంలేదు. అయితే గతంలో జరిగినట్లుగా రాబోయేసమావేశాలకు గైర్హాజరవ్వటం సాధ్యంకాకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ వినిపించాల్సిన వాదనలను కేసీఆర్ మాత్రమే వినిపించాలి. అలాగే హరీష్ తన వాదనలను తాను వినిపిస్తారు. గతంలో లాగ ప్రభుత్వానికి సమాధానాలు చెప్పటానికి కేసీఆర్ అవసరం లేదు తాము చాలని కేటీఆర్, హరీష్ అనేందుకు లేదు.

ఎందుకంటే అసెంబ్లీలో కమిషన్ రిపోర్టుపై జరిగే చర్చల వివరాలను అడ్వకేట్ జనరల్ కోర్టుకు అందిస్తారు. సమావేశాలకు కేసీఆర్ హాజరైతే ఒక పద్దతి గైర్హాజరైతే మరో పద్దతిగా ఉంటుంది వ్యవహారం. సమావేశాలకు హాజరైతే కేసీఆర్ వాదన ఏమిటన్నది కోర్టుకు తెలుస్తుంది. ఒకవేళ గైర్హాజరైతే మాత్రం ఎందుకు హాజరుకాలేదన్న విషయం విచారణలో కోర్టుకు సమాధానం చెప్పాల్సుంటుంది. కోర్టుగనుక సంతృప్తి చెందకపోతే తుదితీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పుడు కేసీఆర్, హరీష్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను బీఆర్ఎస్ తప్పుపట్టే అవకాశం ఉండదు.

ఒకవేళ సమావేశాలకు కేసీఆర్ హాజరైతే ఏమి మాట్లాడుతారు ? కాళేశ్వరం అవినీతి, అవకతవకలను ఎలా సమర్ధించుకుంటారన్నది ఆసక్తిగా మారుతుంది. కేసీఆర్ వాదనను రేవంత్, మంత్రులు ఈజీగా కౌంటర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో కేసీఆర్, హరీష్ ప్రభుత్వ వాదనను తిప్పికొట్టేందుకు అవకాశాలు తక్కువ. అందుకనే తనకు ఇష్టమున్నా లేకపోయినా తొందరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవ్వక తప్పని పరిస్ధితి. ఒకవేళ హాజరుకాకపోతే జరిగే నష్టానికి కేసీఆర్ బాధ్యుడవుతారు.

Read More
Next Story